అనంతలో న్యూఇయర్ కేకులు తింటే అంతేనట

Update: 2020-01-01 04:51 GMT
కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు.. కేకులతో సెలబ్రేట్ చేసుకోవటం కామన్. మిగిలిన పండుగల వేళ మిఠాయిలకు బదులుగా న్యూఇయర్ రోజున మాత్రం కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేయటం ఒక అలవాటుగా మారింది. నగరాలు.. పట్టణాల్లోనే కాదు.. టైర్ త్రీ పట్టణాల్లోనూ ఇలాంటి కల్చర్ పెరిగింది. తాజాగా అనంతపురం పట్టణంలో న్యూఇయర్ కేకుల నాణ్యతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి షాకింగ్ నిజాల్ని బయటకు వెలికితీశారు.

మంగళవారం ఫుడ్ సేఫ్టీ.. తూనికలు కొలతల శాఖకు చెందిన అధికారులు అనంతపురం పట్టణంలోని పలు బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా పలు బేకరీల్లో తయారు చేసిన కేకుల అసలు సంగతి తెలిస్తే నోట మాట రాకపోవటమే కాదు.. జన్మలో కేక్ తినేందుకు ఇష్టపడని పరిస్థితి. పట్టణంలోని అరవిందనగర్ మసీదు వెనుక ఒక బేకరీకి చెందిన యజమాని కల్తీ కేకుల్ని తయారు చేశాడు.

కేకులకు వాడే మైదా పురుగులు పట్టి ఉండటం ఒక ఎత్తు అయితే.. కేకుల్లో మోతాదుకు మించిన రంగుల్ని వాడేయటం.. చాక్లెట్ ఫ్లేవర్కోసం వాడే పౌడర్ కు తయారీ తేదీ లేకపోవటంతో పాటు.. నాణ్యతకు సంబంధించి భారీ సందేహాలకు తావిచ్చేలా ఉన్నాయి. అప్పటికే పట్టణంలోని పలుబేకరీలకు వేలాది కేకులు అక్కడి నుంచి సరఫరా అయ్యాయి. దీంతో పట్టణంలోని ఎనిమిది బేకరీలు.. హోటళ్లపైనా దాడులు నిర్వహించారు. దాదాపుగా అన్ని చోట్ల కేకుల నాణ్యతలో తేడా ఉండటంతో అందరికి నోటీసులు ఇచ్చారు. కొత్త సంవత్సరం వస్తున్నవేళ సంబరంగా కేక్ కొందామనుకున్న వారంతా అసలు నిజాలు బయటకు రావటంతో నోట మాట రాకపోవటమే కాదు.. కేకు వెనుక ఇంత నడుస్తుందా? అని అవాక్కవుతున్నారు.


Tags:    

Similar News