ఆ తలనొప్పి తలెత్తకుండా.. అద్వానీ పోటీకీ బీజేపీ ఓకే!

Update: 2019-03-10 10:06 GMT
ఐదేళ్ల కిందట బీజేపీ అధికారంలోకి వచ్చాకా ఆ పార్టీలో కొత్త కొత్త నియమాలు వచ్చాయి. తమకంటే సీనియర్ల బాధను తగ్గించుకునేందుకు మోడీ, అమిత్ షా లు డెబ్బై ఐదేళ్ల వయసు దాటిన నేతలకు రిటైర్మెంట్ ను ప్రకటించారు. అది ఒక రకంగా బలవంతపు రిటైర్మెంట్. పార్టీలో సీనియర్ల పొడ గిట్టకపోవడంతోనే షా, మోడీలు ఆ నిర్ణయాన్ని అమలు చేశారనే ప్రచారం జరిగింది.

ఆ నిర్ణయం ద్వారా చాలా మంది సీనియర్లను పక్కన పెట్టేశారు షా, మోడీ. డెబ్బై ఐదేళ్ల వయసు దాటిందని చెప్పి.. కొంతమంది మంత్రుల చేత కూడా రాజీనామాలు చేయించారు. అదంతా అద్వానీ, జోషి వంటి సీనియర్ల ప్రాధాన్యతను తగ్గించేందుకే అనే విశ్లేషణలు వినిపించాయి.

అయితే ఈ విషయంలో చాలా విమర్శలనే ఎదుర్కొన్నారు షా, మోడీలు. పార్టీకి పునాదులు వేసిన నేతలను పక్కన పెట్టి వీళ్లు నియంతృత్వాన్ని అమలు చేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. అయితే ఈ సారి మాత్రం వాటికి అవకాశం ఇవ్వకూడదని అనుకుంటున్నట్టుగా ఉన్నారు.

అందుకే డెబ్బై ఐదేళ్ల నియమం విషయంలో కఠినంగా వ్యవహరించాలని అనుకోవడం లేదట. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకోనుందని సమాచారం. డెబ్బై ఐదేళ్ల వయసు దాటిన వారు మంత్రి పదవులకు, ఇతర పార్టీ పదవులకు వద్దని తీర్మానించిన బీజేపీ.. అయితే ఎన్నికల్లో పోటీకి మాత్రం అభ్యంతరం లేదని అంటున్నారు. అంటే ఎంపీలుగా పోటీ చేసుకోవచ్చు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసుకోవచ్చు. అయితే ఆ వయసు దాటిన వారికి ప్రభుత్వ, పార్టీ పదవులు ఉండవు. ఇదీ బీజేపీ  సడలించుకున్న నియమం.

ఒకరకంగా ఇది మోడీ, అమిత్ షాలు తెలివైన నిర్ణయమే తీసుకున్నారు. ఏజ్ కారణాన్ని చూపి.. అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి వాళ్లకు ఈ సారి పోటీకి కూడా అవకాశం ఇవ్వకపోతే.. విమర్శల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. వారిని నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కాంగ్రెస్ కూడా వారిపై సానుభూతి చూపి మోడీ, షాల మీద విమర్శలు చేయవచ్చు. ఆ పరిస్థితిని తప్పించుకునేందుకు పోటీ కి అభ్యంతరం లేదనే నిర్ణయాన్ని తీసుకుంటున్నట్టుగా ఉన్నారు!
Tags:    

Similar News