సోనియ‌మ్మ విధేయుడి భ‌విష్య‌త్ ఏం కానుంది?

Update: 2017-08-08 05:42 GMT
ప‌దేళ్ల పాటు నాన్ స్టాప్ ప‌వ‌ర్ ను ఎంజాయ్ చేసి.. త‌న‌కు తోచిన‌ట్లుగా ఏడాపెడా నిర్ణ‌యాలు తీసుకున్న యూపీఏ స‌ర్కారుకు రిమోట్ లా వ్య‌వ‌హ‌రించింది ఎవ‌ర‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే. మ‌రి.. ఆ రిమోట్‌ కు స‌ల‌హాలు ఇస్తూ..న‌మ్మిన బంటుగా వ్య‌వ‌హ‌రించిన వ్య‌క్తిగా అహ్మ‌ద్ ప‌టేల్‌ కు పేరుంది. కాంగ్రెస్ పార్టీలో సోనియ‌మ్మ త‌ర్వాత ప‌వ‌ర్ ఫుల్ నేత‌గా అహ్మ‌ద్‌ కు పేరుంది. అలాంటి నేత ఇప్పుడు రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు ప‌డుతున్న అవ‌స్థ‌లు అన్నిఇన్ని కావు.
 
స్ప‌ష్ట‌మైన మెజార్టీ ఉన్న‌ప్ప‌టికీ మోడీ.. షాల పుణ్య‌మా అని ఆయ‌న గెలుపు ఇప్పుడు మ‌హా డౌట్ గా మారింది. ఏం జ‌రుగుతుందో అర్థం కాక కాంగ్రెస్ నేత‌లు కిందామీదా ప‌డుతున్నారు. వారి అవ‌స్థ‌ల్ని చూస్తున్న మోడీ.. షా ద్వ‌యం ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేస్తున్నార‌ని చెప్పాలి.

సాధార‌ణంగా ఏ రాష్ట్రంలో అయినా రాజ్య‌స‌భ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయంటే ఎవ‌రికి పెద్ద ఆస‌క్తి ఉండ‌దు. ఎమ్మెల్యేల లెక్క ప్ర‌కారంగా ఆయా పార్టీలు త‌మ అభ్య‌ర్థుల్ని బ‌రిలోకి దించుతాయి. విపక్షాల‌కు అవ‌కాశం ఉన్న స్థానాల్ని వ‌దిలేయ‌టం ఆ మ‌ధ్య వ‌ర‌కూ ఉంది. కానీ.. ఇప్పుడా ప‌రిస్థితి లేదు. దూకుడు రాజ‌కీయాలు రాష్ట్రాల్ని దాటేసి.. కేంద్రంలోనూ తిష్ట వేస్తున్నాయ‌న్న దానికి నిద‌ర్శ‌నంగా తాజా గుజ‌రాత్ లో జ‌రుగుతున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌లుగా చెప్పాలి.

వాస్త‌వానికి అక్క‌డ జ‌రుగుతున్న మూడు స్థానాల్లో రెండు స్థానాల‌కు గుజ‌రాత్ అధికార‌ప‌క్ష‌మైన బీజేపీకి మెజార్టీ ఉంది. మిగిలిన స్థానం కాంగ్రెస్ ఖాతాలో ప‌డాలి. అయితే.. మోడీ.. షా లాంటి నేత‌లు చ‌క్రం తిప్పుతున్న వేళ‌.. అంత సులువుగా ఎన్నిక‌లు జ‌రిగిపోతే బాగుండదు క‌దా. అందుకే మూడో స్థానానికి బీజేపీ అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపారు. దీంతో.. కాంగ్రెస్ కు వెళ్లాల్సిన స్థానానికి పోటీ అనివార్య‌మైంది.

ఇదిలా ఉంటే.. ముక్త కాంగ్రెస్ అన్న నినాదాన్ని జోరుగా వినిపిస్తూ దూసుకెళుతున్న మోడీ.. షాలు ఆ పార్టీకి దెబ్బేసే ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌దిలి పెట్ట‌రు. ఇందుకు త‌గ్గ‌ట్లే గుజ‌రాత్ రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కు వెళ్లాల్సిన సీటుకు ఎస‌రు పెట్టే ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేశారు.  ఇందులో భాగంగా గ‌డిచిన కొద్ది రోజులుగా చాలానే రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

దీంతో..ఖాయంగా కాంగ్రెస్ ఖాతాకు వెళ్లాల్సిన రాజ్య‌స‌భ స్థానం.. ఇప్పుడు ఏం జ‌రుగుతుందో? అన్న సందేహంలోకి వెళ్లిపోయింది. కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత శంక‌ర్ సింఘ్ వాఘేలా కాంగ్రెస్ పార్టీతో త‌న‌కున్న ఇర‌వై ఏళ్ల అనుబంధాన్ని తెంచేసుకొని డ‌జ‌ను మంది ఎమ్మెల్యేల‌తో బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌టంతో మొద‌లైన షాకుల ప‌ర్వం.. మూడంటే మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్న ఎన్సీపీ సైతం కాంగ్రెస్‌ కు షాకిచ్చే వ‌ర‌కూ వెళ్ల‌టం చూస్తే.. కాంగ్రెస్ ప‌రిస్థితి ఎంత ఇబ్బందిక‌రంగా మారిందో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

మొన్న‌టి వ‌ర‌కూ 57 మంది ఎమ్మెల్యేల‌తో బ‌ల‌మైన విపక్షంగా ఉన్న కాంగ్రెస్‌.. ఈ మ‌ధ్య కాలంలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో ఆ బ‌లం కాస్తా 44కు ప‌డిపోయింది.  రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్థి అహ్మ‌ద్ ప‌టేల్ గెల‌వాలంటే 46 మంది ఎమ్మెల్యేల బ‌లం అవ‌స‌రం. కానీ.. అందుకు రెండు స్థానాలు త‌క్కువైన వేళ‌.. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ మిత్ర‌ప‌క్షం ఎన్సీపీ కూడా తాము ఎవ‌రికి ఓటు వేస్తామ‌న్న‌ది ఇంకా నిర్ణ‌యించ‌లేద‌ని చెప్ప‌టంతో కాంగ్రెస్ టెన్ష‌న్ తో విల‌విలలాడిపోతోంది.

ఈ కార‌ణంతోనే త‌న‌కున్న ఎమ్మెల్యేలు ఎక్క‌డ ప‌ట్టు త‌ప్పి పోతార‌న్న భ‌యంతో తాను అధికారంలో ఉన్న క‌ర్ణాట‌క రాష్ట్రానికి ఎమ్మెల్యేల్ని పంపి క్యాంపు నిర్వ‌హించింది. ఈ రోజు జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో సోనియ‌మ్మ‌కు న‌మ్మిన బంటు.. ఆమె రాజ‌కీయ స‌ల‌హాదారు అహ్మ‌ద్ ప‌టేల్ బ‌య‌ట ప‌డ‌తారా?  లేక‌.. ఘోర అవ‌మాన భారాన్ని మూట‌గ‌ట్టుకుంటారా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కూ అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఏదో విధంగా అహ్మ‌ద్ ప‌టేల్ బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉందంటున్నారు. అదే స‌మ‌యంలో చివ‌రి నిమిషంలో కానీ మోడీ.. షాలు త‌మ‌దైన స్టైల్లో చ‌క్రం తిప్పితే మాత్రం అహ్మ‌ద్ ప‌టేల్‌కు భారీ అవ‌మానం త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News