ప్ర‌భుత్వం న‌వ్వుల పాలు అవుతోందంటున్న మంత్రి

Update: 2017-07-21 16:37 GMT
దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిక‌రంగా మారిన త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై ఆ రాష్ట్రంలోని నేత‌ల్లో సైతం తీవ్ర అసంతృప్తి ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. అధికార అన్నాడీఎంకే పార్టీలో లుక‌లుక‌లు ఆ పార్టీ ప‌రువును రోడ్డున ప‌డేసిన‌ సంగ‌తి తెలిసిందే. ఇన్నాళ్లు ఈ విష‌యంలో విప‌క్షంలో చ‌ర్చ జ‌రుగుతుండ‌గా...తాజాగా ఏకంగా మంత్రి హోదాలో ఉన్న నేత త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్త‌ప‌ర్చారు. రాష్ట్ర సహకార శాఖ మంత్రి సెల్లూర్‌ రాజు తాజాగా మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో అన్నాడీఎంకే పరిస్థితి నవ్వులాటగా తయారైందని వాపోయారు.

అన్నాడీఎంకే అధినేత్రి - దివంగ‌త‌ ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత పార్టీ పరిస్థితి నవ్వుకోవడానికి పనికివచ్చే సాధనంగా తయారైందని మంత్రి సెల్లూర్ రాజు త‌మ పార్టీ ప‌రిస్థితిపై ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తమిళ నటుడు వడివేలు కామెడీలో పాత్రల మాదిరిగా తమను చూస్తున్నారని ఆయన చెప్పారు. ప‌రిస్థితిని చక్క‌దిద్దాల్సిన నాయ‌కులు త‌మ త‌మ ఆదిప‌త్య‌పోరులో బిజీగా గ‌డిపేస్తున్నార‌ని...పరిపాల‌న సాగ‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌లు త‌మ‌ను దోషుల్లాగా చూస్తున్నార‌ని అసంతృప్తి వ్య‌క్తం చేశారు. త‌మ‌లో త‌మ‌కు సాగే కుంప‌ట్లు త‌మ‌ను క‌మెడీయ‌న్ల‌ వ‌లే చూస్తున్నార‌ని మంత్రి వాపోయారు.

ఇదిలాఉండ‌గా అధికార పార్టీలో మ‌రో క‌ల‌క‌లం రేగింది. శాసనసభ సమావేశాలు ముగిసిన మరుసటి రోజే అన్నాడీఎంకే అమ్మ వర్గం ఎమ్మెల్యే - టీటీవీ దినకరన్‌ మద్దతుదారుడు - పెరుందురై నియోజకవర్గ శాసనసభ్యుడు తొప్పు వెంకటాచలం అసెంబ్లీ కమిటీ పదవికి గురువారం రాజీనామా చేశారు. అధికారపార్టీలోని సభ్యుడు ఇలా ప్రాధాన్య పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది. రాష్ట్ర శాసనసభ సమావేశాలు సజావుగా సాగాయని సంబరపడాలో... ముందు ముందు ఎదురవనున్న పరిణామాలను తలుచుకుని ఆందోళన చెందాలో తెలియని పరిస్థితిలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప‌డిపోయార‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ప‌ళ‌నిస్వామి సీఎం పదవీ చేప‌ట్టి అయిదు నెలలు పూర్తి అయింది.
Tags:    

Similar News