వివేకా హ‌త్య కేసు!... ముగ్గురు అరెస్ట్!

Update: 2019-03-28 11:25 GMT
తెలుగు నేల‌లో పెను సంచ‌ల‌నంగా మారిన వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో కాసేప‌టి క్రితం కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో సాక్ష్యాల‌ను తారుమారు చేసేందుకు య‌త్నించారని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వివేకానంద‌రెడ్డి స‌న్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, వివేకా పీఏ కృష్ణారెడ్డిల‌తో పాటు ప్ర‌కాశ్ అనే వ్య‌క్తి కూడా అరెస్ట‌య్యారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం పులివెందుల డీఎస్పీ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల‌ను వెనువెంటనే మేజిస్ట్రేట్ ముందు హాజ‌రుప‌రిచిన‌ట్టు కూడా ఆ ప్ర‌క‌ట‌న‌లో డీఎస్పీ తెలిపారు. ఇప్పుడు ఈ వార్త పెను క‌ల‌క‌ల‌మే రేపుతోంది. స‌రిగ్గా ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌లైన త‌ర్వాత వివేకా హ‌త్య‌కు గురి కావ‌డం, అరెస్టుల ప‌ర్వం నామినేష‌న్ల ఘ‌ట్టం ముగిసిన మ‌రుక్ష‌ణ‌మే మొద‌లైపోవ‌డం సంచ‌ల‌నంగా మారిపోయింది.  

ఈ కేసులో పోలీసులు ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నా... ఆ నిర్ణ‌యాలు ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశాలున్నాయ‌ని క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఏ కోణంలో విచార‌ణ చేప‌ట్టినా... ఆ కోణాన్ని నిరూపించేందుకు చాలా స‌మ‌యమే ప‌డుతుంద‌న్న విష‌యం తెలిసిందే. తీరా పోలీసులు ఆరోపించిన కోణం త‌ప్ప‌ని తేలితే... దానితో సంబంధం లేని వ‌ర్గానికి చాలా న‌ష్ట‌మే జ‌రిగిపోతోంది. మొత్తంగా పోలీసులు చెప్పే మాట‌లే జ‌నాన్ని బాగా ప్ర‌భావితం చేయ‌నున్నాయి. ఈ విష‌యంలో జ‌నం నిజానిజాల గురించి ప‌ట్టించుకునే ప్ర‌సక్తి ఉండ‌ద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటి వాద‌న‌తోనే వైసీపీ ఈ కేసు విచార‌ణ నివేదిక‌ను బ‌య‌ట‌పెట్ట‌కుండా సిట్ ను క‌ట్ట‌డి చేయాల‌ని హైకోర్టులో పిటిష‌న్ వేసింది.

అయితే ఈ పిటిష‌న్ దాఖ‌లై రెండు రోజులు కూడా గ‌డ‌వ‌క ముందే అరెస్టులు మొద‌లైపోవ‌డం చూస్తుంటే... త్వ‌ర‌లోనే మ‌రికొన్ని కీల‌క అరెస్ట్ లు చోటు చేసుకునే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. హ‌త్య జ‌రిగిన రోజు ఉద‌యం పోలీసులు వ‌చ్చేలోగానే వివేకా బెడ్ రూంలోని ర‌క్త‌పు మ‌క‌ర‌ల‌ను క‌డిగేయ‌డం, వివేకా త‌ల‌కు క‌ట్టు క‌ట్ట‌డం, పంచ‌మానా జ‌ర‌గ‌కుండానే శ‌వాన్ని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డం జ‌రిగిపోయిన విష‌యం తెలిసిందే. కేసు విచార‌ణ‌లో ఇదే కీల‌కం కావ‌డంతో ఈ కోణంలోనే పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. మొత్తంగా తొలుత ముగ్గురిని అరెస్ట్ చేసిన పులివెందుల పోలీసులు... ఇంకెంత మందిని ఈ కేసులో అరెస్ట్ చేస్తారోన‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ అరెస్టుల ప‌ర్వం ఎక్క‌డికి దారి తీస్తుందోన‌న్న అనుమానాలు కూడా లేకపోలేదు.

Tags:    

Similar News