అసద్ సాబ్..మోడీపై ఆక్రోశం సరే..ఆ మాట రాదెందుకు?

Update: 2020-04-12 05:27 GMT
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాటలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన ఇన్నాళ్లకు భౌతిక దూరం గురించి పెదవి విప్పిన ఆయన.. ముస్లింలంతా సోషల్ డిస్టెన్స్ ను పాటించాలని చెప్పారు. ఇన్నాళ్లకు ఆయనకు ఆ మాట గుర్తుకు వచ్చిందా? అన్న ప్రశ్న పలువురి నోట వినిపిస్తోంది. ప్రధాని మోడీపై తన ఆక్రోశాన్ని తాజాగా తీర్చుకున్న ఆయన.. మర్కజ్ వెళ్లి వచ్చిన వారంతా విధిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్న పిలుపు ఎందుకు ఇవ్వరు? అన్నది ప్రశ్న. పలు రాష్ట్రాల్లో ఇప్పటికి మర్కజ్ వెళ్లి వచ్చిన వారి ఆచూకీ తెలీక.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కిందామీదా పడుతున్నాయి.

పలు పార్టీల ఎంపీలతో భేటీకి పిలిచిన ప్రధాని మోడీ.. ఇద్దరు ఎంపీలున్న తమ పార్టీని.. ముగ్గురు ఎంపీలున్న కేరళలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీని చర్చకు ఎందుకు పిలవలేదని ఆక్షేపించారు. అంతేకాదు.. మోడీజీ మీరు కూడా మాకు ప్రధాని అని.. ప్రపంచవ్యాప్తంగా కరోనాపై పోరాటానికి అందరూ కలిసి వస్తే.. దేశంలో మాత్రం కొందరు మతాల మధ్య విషప్రచారాన్ని చేస్తున్నట్లుగా వాపోయారు.

సోషల్ మీడియాలో మతాల మధ్య దుష్ప్రచారం చేయటం ట్రెండుగా మారిందని.. ఇలాంటి ప్రచారం చేసే వారు దేశ సమైక్యతను చెడగొడుతున్నారన్నారు. లాజిక్ గా మాటలు చెప్పటం అసద్ కు అలవాటే. తనకు తగ్గట్లు మాటలు చెప్పే ఆయన.. సూటిగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే ప్రయత్నం చేయరు? అసద్ చెప్పినట్లుగా కొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని మతాల మధ్య అడ్డుగోడలు కట్టే దుర్మార్గం చేయొచ్చు. కానీ.. అలాంటి వాటిని బాధ్యత కలిగిన ఎంపీగా.. ఒక పార్టీ అధినేతగా అసద్ ఎందుకు బద్ధలు కొట్టటం లేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

కరోనా వ్యాప్తి మొదలైన వెంటనే..తాను తరచూ ప్రస్తావించే ముస్లింలకు.. ఆయన ఎందుకు పిలుపు ఇవ్వలేదు? చిన్నపాటి అనుమానం ఉన్నా భయాందోళనలకు గురి కాకుండా వైద్యుల వద్దకు వెళ్లాలని ఎందుకు చెప్పలేదు? మర్కజ్ ఎపిసోడ్ తెర మీదకు వచ్చిన తర్వాత.. కాలికి బలపం చుట్టుకొని తిరిగే చందంగా.. అసద్ ఎందుకు వ్యవహరించనట్లు? తనను ఉద్దేశించి సోషల్ మీడియాలో వినిపించే సందేహాల్ని ఆయన ఎందుకు తీర్చరు?
Tags:    

Similar News