హైటెక్ సిటీ ఎవరి ప్లాన్? చంద్రబాబా? నేదురుమల్లా?

Update: 2018-12-14 04:46 GMT
ఏపీ సీఎం చంద్రబాబును మాజీ ఐఏఎస్‌ లు వెంటాడుతున్నట్లుగా ఉంది. ఇప్పటికే మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు చంద్రబాబుపై నిత్యం నిప్పులు చెరుగుతుండగా తాజాగా ఆయనకు మరో మాజీ ఐఏఎస్ కూడా తోడవుతున్నారు. పది రోజుల కిందట ఏపీలో అవినీతిపై విరుచుకుపడిన ఆయన తాజాగా మరోసారి ఏపీలో పాలనా వైఫల్యాలు - అవినీతి - అడ్డగోలు ఖర్చులు - ఇష్టారాజ్యంపై విరుచుకుపడ్డారు.అలాగే హైటెక్ సిటీని చంద్రబాబు కట్టలేదని.. దానికి నేదురుమల్లి జనార్దనరెడ్డి బీజం వేశారని చెప్పారు.
   
ఏపీ ప్రభుత్వం చేస్తున్న వేల కోట్ల అప్పులను ఎక్కడ ఖర్చు పెడుతున్నారో చెప్పాల్సిన అవసరం ఉందని మాజీ సీఎస్ అజయ్‌ కల్లం డిమాండ్ చేశారు. రైతులకు కనీసం గిట్టుబాటు ధర కల్పించలేని ప్రభుత్వం అమరావతిలో ఫైవ్ స్టార్ హోటళ్లకు మాత్రం సబ్సిడీలు ఇస్తోందని ఆయన ఫైరయ్యారు. సరదాగా విదేశాలకు తిరిగే వారికి కూడా చంద్రబాబు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందన్నారు. ఇండిగో విమాన సంస్థ విజయవాడ నుంచి సింగపూర్‌ కు విమానం తిప్పేందుకు 18 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం చెల్లిస్తూ జీవో ఇచ్చిందన్నారు. ఒక ప్రైవేట్‌ సంస్థ విమానాలు తిప్పుతుంటే డబ్బులు ఇచ్చి నడిపించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చిందన్నారు. విహారయాత్రకు వెళ్లే పెద్దల కోసం 18 కోట్లు ఇవ్వడం ప్రజల కోసం పాలన ఎలా అవుతుందని అజయ్ కల్లం ప్రశ్నించారు. ఒక నిరుద్యోగి పరీక్ష రాసేందుకు మరో పట్టణానికి వెళ్తే ఆ యువకుడి పరిస్థితి గురించి మాత్రం ప్రభుత్వం ఆలోచించడం లేదన్నారు.
   
తెలంగాణలో పక్కా ఇళ్ల నిర్మాణానికి చదరపు అడుగుకు 800 రూపాయలు చెల్లిస్తుంటే… ఆంధ్రప్రదేశ్‌ లో మాత్రం 1900 నుంచి 2200 రూపాయలను ప్రైవేట్‌ కాంట్రాక్ట్ సంస్థలకు చెల్లిస్తున్నారని కల్లం అన్నారు. ఇలాంటి వాటిపై ఎవరైనా ప్రశ్నిస్తే హేళన చేయడం అలవాటైపోయిందన్నారు. లగ్జరీకి ఏమాత్రం నాయకులు అలవాటు పడకూడదని మహాత్మ గాంధీ చెప్పారన్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే ముఖ్యమంత్రే తన లగ్జరీ కోసం వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆవేదన చెందారు.
   
1991లో పీవీ నర్సింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆరు ఐటీ ఎస్‌ ఈ జెడ్‌ లను ఏర్పాటు చేస్తే అందులో ఒకటి హైదరాబాద్ లోని మైత్రివనంలో వచ్చిందన్నారు. ఆ తర్వాత వచ్చిన కంపెనీలకు అక్కడ స్థలం సరిపోకపోవడంతో నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి… 10 ఎకరాల భూమి - నాలుగున్నర కోట్ల డబ్బు కేటాయించారన్నారు. హైటెక్‌ సిటీకి నేదురుమల్లి జనార్దన్ రెడ్డే స్వయంగా శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి హైటెక్ సిటీని ప్రారంభిస్తే ఆ తర్వాత చంద్రబాబు మాత్రం చుట్టూ భూములు కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని అజయ్ కల్లం వివరించారు. హైటెక్ సిటీ చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వారు ఇప్పుడు అంతా తామే కట్టామని చెప్పుకుంటున్నారంటూ చంద్రబాబును ఏకిపడేశారు.
Tags:    

Similar News