షాకింగ్ విష‌యాన్ని చెప్పిన అంబానీ కొడుకు!

Update: 2018-04-08 05:20 GMT
నిన్న రాత్రి (శ‌నివారం) ఐపీఎల్ మ్యాచ్ చూశారా?  అందులో ముంబ‌యి జ‌ట్టు ఓడిపోకూడ‌దంటూ ఓప‌క్క ముకేశ్ అంబానీ వైఫ్ తో పాటు ఆమె కుమారుడు ఆకాశ్ అంబానీ తెగ టెన్ష‌న్ ఫీల్ కావ‌టం గ‌మ‌నించారా?  ఇప్పుడా విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. ఆ  అబ్బాయి చెప్పిన ఒక విష‌యం తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇంత‌కీ ఈ అబ్బాయ్ గురించి ఈ మ‌ధ్య‌నే పెళ్లి ముచ్చ‌ట విన్నారు క‌దా. ఆ అబ్బాయికి సంబంధించిన ఒక విష‌యం మీకు ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌క మాన‌దు.

దేశంలోనే అత్యంత సంప‌న్నుడైన తండ్రికి కొడుకైన ఆకాశ్ అంబానీకి తాము ఎంత రిచ్ అన్న విష‌యం అమెరికాలో ఉన్న‌త చ‌దువుకు కోసం వెళ్లిన త‌ర్వాత కానీ అర్థం కాలేద‌ట‌. తాము అంత సంప‌న్నుల‌మా? అని షాక్ తిన్నాడ‌ట‌. ఈ ఆస‌క్తిక‌ర‌మైన ముచ్చ‌ట మొత్తంగా అర్థం కావాలంటే.. ఈ మ‌ధ్య‌న ఆకాశ్ చెప్పిన మాట‌ల్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే.

జియోను దేశ ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేసిన ఆకాశ్ స్కూలింగ్ మొత్తం అంబానీ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్లోనే జ‌రిగింది. ఆ స్కూల్లో అత‌డు.. అంద‌రితో పాటు తాను ఒక‌డినే అన్న‌ట్లు పెరిగాడే కానీ.. తాను దేశంలోనే అత్యంత సంప‌న్నుల కుటుంబాల‌కు చెందిన ఒక కుటుంబానికి వార‌సుడ‌న్న విష‌యం అస్స‌లు తెలీద‌ట‌.

స్కూల్లో మిగిలిన పిల్ల‌ల మాదిరే మేం పేరున్న‌కుటుంబం నుంచి వ‌చ్చామ‌న్న విష‌యం మాత్ర‌మే తెలుసు. మా స్కూల్లో చాలామంది మాదిరే మేము కూడా క‌దా అనుకునేవాళ్లం. ఎందుకంటే..తాత‌య్య‌.. అమ్మానాన్న‌లు మ‌మ్మ‌ల్ని అలానే పెంచారు. మ‌మ్మ‌ల్ని చాలా నిరాడంబ‌రంగా పెంచారు. ఎంత‌లా అంటే స్కూల్లో చాలామంది పిల్ల‌ల‌కు ఇచ్చే పాకెట్ మ‌నీ కంటే అమ్మ మాకిచ్చే పాకెట్ మ‌నీ త‌క్కువ‌గా ఉండేది.

వ్యాపారానికి సంబంధించిన విష‌యాల్ని మా ద‌గ్గ‌ర అస్స‌లు చ‌ర్చించేవారుకాదు. తాత‌య్య‌తో క‌బుర్లు చెప్ప‌టం.. ప్ర‌తి ఆదివారం బ్రీచ్ క్యాండీ క్ల‌బ్‌ కి వెళ్ల‌టం లాంటివి చాలా సాదాసీదాగా జ‌రిగేవి.ప్ల‌స్ వ‌న్ చ‌దువుకునేట‌ప్పుడు రిల‌య‌న్స్ సంస్థ గురించి వ్యాసం రాయ‌మ‌న్నారు. మాది దేశంలోనే పెద్ద వ్యాపార సంస్థ అన్న విష‌యం మొద‌టిసారి అని తెలిసింది. అయిన‌ప్ప‌టికీ మా ఆస్తిపాస్తుల గురించి తెలీదు.

అమెరికాలో చ‌దువుతున్న‌ప్పుడు ఫ్రెండ్స్ తో క‌లిసి ఉన్న‌ప్పుడు ఓ కుర్రాడి చేతిలో ఉన్న ఫోర్బ్స్ ప‌త్రిక‌ను తీసుకొని పేజీలు తిర‌గేస్తున్న‌ప్పుడు.. అందులో అత్యంత సంప‌న్నుల జాబితా క‌నిపించింది. అందులో నాన్న పేరు చూసి చాలా షాక‌య్యా. అప్ప‌టివ‌ర‌కూ అలాంటి లిస్ట్ ఒక‌టి ఉంటుంద‌ని కూడా తెలీదు. అలాంటి జాబితాలో మా కుటుంబం పేరు ఉండ‌టం చూసిన త‌ర్వాత నుంచి నా ఆలోచ‌న‌ల్లో చాలా మార్పు వ‌చ్చింది.

అంత గొప్ప కుటుంబంలో పుట్ట‌టం నిజంగా అదృష్టం. కానీ.. తాత‌.. నాన్న‌ల పేరు చెప్పుకొని కాకుండా నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాల‌న్న ప్ర‌య‌త్నంతో వ‌చ్చిందే జియో ఆలోచ‌న‌. చ‌దువు పూర్తి కావ‌టానికి కొద్ది నెల‌ల ముందు నాన్న‌కు జియో గురించి చెబితే.. ఓకే అన్నారు. జియో ప్ర‌ధాన కార్యాల‌యం మొత్తం నా ఆలోచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లే ఉంటుంది. మా ఫ్యామిలీ మెంబ‌ర్ల‌తో స‌హా ఎవ‌రికి ప్ర‌త్యేక క్యాబిన్లు లేకుండా జియో ఆఫీసును త‌యారు చేయించాన‌ని చెప్పాడు. ఇదంతా చెప్పిన ఆకాశ్ మ‌రో ముఖ్య‌మైన విష‌యాన్ని చెప్పాడు. తానిప్పుడు ఇలా ఉండ‌టానికి.. సొంత నిర్ణ‌యాలు తీసుకోవ‌టానికి.. డ‌బ్బు విలువ తెలియ‌టానికి కార‌ణం త‌న త‌ల్లే కార‌ణ‌మ‌న్నాడు. ఎన్ని ప‌నులున్నా కుటుంబానికి స‌మ‌యం కేటాయించాల‌ని అమ్మ గ‌ట్టిగా చెప్పే మాట అని చెప్పాడు. గొప్ప‌వాళ్ల ఇళ్ల‌ల్లో ఎలాంటి వాతావ‌ర‌ణం ఉంటుంద‌ని తెలుసుకోవ‌టానికి ఆకాశ్ అంబానీ ఒక మంచి ఎగ్జాంఫుల్ గా చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News