కడుపు చించుకున్న ములాయం..

Update: 2017-04-02 05:48 GMT
సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న కుటుంబ కలహాలు ఎలాంటివో అందరికి తెలిసిందే. అసెంబ్లీ ముందు మొదలైన ఫ్యామిలీ రచ్చ అంతకంతకూ పెరిగి.. ఓ దశలో పార్టీ రెండు ముక్కలైపోతుందన్న వాదన వినిపించింది. అంతలోనే ములాయం కాస్త వెనక్కి తగ్గేసరికి.. ధిక్కర స్వరం వినిపించిన ఆయన కుమారుడు అఖిలేశ్ సైతం కాస్తంత వెనక్కి తగ్గారు. తండ్రి.. కొడుకు..బాబాయ్ ఇలా రకరకాల కాంబినేషన్లో నడిచిన రచ్చ పంచాయితీ.. ఎన్నికల ముందు కాస్త తగ్గినా.. ఎన్నికల్లో ఎదురైన దారుణ ఓటమితో తాజాగా మరోమారు తెరపైకి వచ్చింది.

తాజాగా తన కొడుకుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సమాజ్ వాదీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్. కొడుకు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లకాలంలో తాను తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నట్లుగా వాపోయారు.తన కుమారుడు ఏ రోజూ పట్టించుకోలేదన్న ఆక్రోశాన్ని  వ్యక్తం చేశారు ములాయం. సీఎంగా ఉన్నప్పుడు.. పట్టుమని పది నిమిషాలు కూడా తన దగ్గర తన కుమారుడు కూర్చున్నది లేదన్న ములాయం.. ఏ తండ్రి  చేయని పనిని తాను చేసినట్లుగా చెప్పుకున్నారు. ఏ రాజకీయ అధినేత కూడా తన కొడుకును ముఖ్యమంత్రిని చేయలేదన్నారు. తాను మాత్రం అందుకు భిన్నంగా తన కొడుకును సీఎం చేశానని.. కానీ తనకు మాత్రం అవమానాలే మిగిలాయన్నారు. తాజాగా మొదలైన ములాయం ఆక్రోశజ్వాల సమాజ్ వాదీ పార్టీని ఎక్కడవరకూ తీసుకెళతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News