వాళ్ల‌కు షాక్‌.. అఖిలేష్‌కు జోష్‌

Update: 2021-12-13 08:50 GMT
దేశంలోనే అత్య‌ధిక అసెంబ్లీ స్థానాలున్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ ఎన్నిక‌లపైనే ఇప్పుడు అంద‌రి దృష్టి కేంద్రీకృత‌మై ఉంది. వ‌చ్చే ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జ‌రిగే ఆ ఎన్నిక‌ల సంద‌డి ఇప్ప‌టికే అక్క‌డ మొద‌లైపోయింది. వ‌చ్చే ఏడాది అయిదు రాష్ట్రాల‌కు జ‌రిగే శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా యూపీలోనూ ఎన్నిక‌ల స‌మ‌రం జ‌రుగుతుంది.

ఈ పోరులో విజ‌యం కోసం అన్ని పార్టీలు వ్యూహాలు ర‌చించ‌డంలో మునిగిపోయాయి. కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితి చూస్తుంటే అఖిలేష్ యాద‌వ్ ఆధ్వ‌ర్యంలోని స‌మాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) దూకుడు మీద క‌నిపిస్తోంది. పొత్తులు... చేరిక‌ల‌తో ఆ పార్టీ దూసుకెళ్తోంది.

తాజాగా యూపీ ముఖ్య‌మంత్రి యోగి, బ‌హుజ‌న్ స‌మాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావ‌తికి అఖిలేష్ షాకిచ్చాడు. బీజేపీ ఎమ్మెల్యే దిగ్విజ‌య్ నారాయ‌ణ్‌, బీఎస్పీ ఎమ్మెల్యే విన‌య్ శంక‌ర్ తివారీతో పాటు ఆ పార్టీ నేత‌లు కుశాల్ తివారీ, గ‌ణేష్ శంక‌ర్ అఖిలేష్ స‌మ‌క్షంలో ఎస్పీలో చేరారు.

అక్క‌డ తిరిగి అధికారం నిల‌బెట్టుకోవాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న బీజేపీకి ఎన్నిక‌ల ముందు ఇది ఊహించ‌ని షాకే. మ‌రోవైపు విన‌య్‌, కుశాల్‌, గ‌ణేష్ ఎస్పీలో చేర‌తార‌ని ముందే తెలుసుకున్న బీఎస్పీ వాళ్ల‌ను బ‌హిష్క‌రించింది. ఇప్పుడు ఈ నాయ‌కుల చేరిక‌తో తూర్పూ యూపీలో పార్టీకి ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌నే న‌మ్మ‌కంతో అఖిలేష్ ఉన్నారు. ముఖ్యంగా అక్క‌డి బ్రాహ్మ‌ణ ఓట్ల‌ను పొంద‌వ‌చ్చ‌ని ఆ పార్టీ భావిస్తోంది.

యూపీలో సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడైన హ‌రిశంక‌ర్ తివారీ త‌న‌యుడే ఈ విన‌య్ శంక‌ర్‌. దీంతో అక్క‌డ వాళ్ల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. ఇది పార్టీకి మేలు చేస్తుంద‌నే వాళ్ల‌ను అఖిలేష్ చేర్చుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

మ‌రోవైపు ఇప్ప‌టికే బీఎస్పీ నుంచి స‌స్పెండ్ అయిన ఆరుగురు ఎమ్మెల్యేలు స‌మాజ్‌వాదీ పార్టీలో చేరారు. ఈ సారి ఎలాగైనా యూపీలో పార్టీని గెలిపించుకోవాల‌నే ల‌క్ష్యంగా అఖిలేష్ సాగుతున్నారు. తాను పోటీ చేయ‌డం లేద‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఆయ‌న‌.. పార్టీ విజ‌యం కోసం మాత్రం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు.
Tags:    

Similar News