ఆ మాజీ సీఎం ఏసీలు కూడా ఎత్తుకెళ్లాడ‌ట‌

Update: 2018-06-11 11:30 GMT
ఏండ్ల త‌ర‌బ‌డి ప్ర‌భుత్వ బంగ‌ళాల‌ను వ‌ద‌ల‌కుండా ప‌ట్టుకుని గ‌బ్బిలాల్లా వేలాడుతున్న ఉత్త‌ర్ ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రుల‌ను వెంట‌నే ఖాళీ చేయాల‌ని ఆఖ‌రుకు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వాల్సి వ‌చ్చింది. అయితే తాము ఖాళీ చేసి మ‌రో చోటకు వెళ్ల‌డానికి త‌మ‌కు స‌ర‌యిన బంగ‌ళాలు దొర‌క‌ట్లేద‌ని కొన్నాళ్లు పేచీ పెట్టినా చివ‌ర‌కు అంద‌రూ ఖాళీ చేయాల్సి వ‌చ్చింది. అయితే పోతూ పోతూ ఆ బంగ‌ళాల‌ను డ్యామేజీ చేసి వెళ్లార‌ట‌.

యూపీ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ ఇటీవ‌ల ల‌క్నోలోని ప్ర‌భుత్వ బంగళాను ఇటీవ‌ల ఖాళీ చేశాడు. ఆ త‌రువాత ఆ ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారుల‌కు ఆశ్చ‌ర్య‌క‌ర‌మ‌యిన  దృశ్యాలు క‌నిపించాయ‌ట‌. భ‌వ‌నం మొత్తం చింద‌ర‌వంద‌ర‌గా ఉండ‌డ‌మే కాక గ‌దుల‌లో ఉన్న ఇటాలియ‌న్ మార్బుల్స్, ఏసీలు, కొన్ని త‌లుపులు కూడా అక్క‌డి నుండి తీసుకుపోయిన‌ట్లు తెలుస్తుంది.

అఖిలేష్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు రూ.45 కోట్ల‌తో భ‌వ‌నాన్ని ఆధునిక‌రించారు. అందులో ప్ర‌త్యేకంగా సైకిల్ ట్రాక్ వేశారు. ఇప్పుడు ఆ ట్రాక్ కోసం వాడిన విదేశీ ఇటుక‌ల‌ను తీసుకెళ్లార‌ట‌. సైకిల్ ట్రాక్ మొత్తం తవ్వార‌ట‌. దీంతో అఖిలేష్ కు ఈ విష‌యంలో న్యాయ నిపుణుల‌తో సంప్ర‌దించి నోటీసులు ఇవ్వాల‌ని అధికారులు భావిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ లోని మార్బుల్ తో పాటు అనేక విలువ‌యిన వ‌స్తువులు త‌ర‌లించేశార‌ట‌.

అయితే ఇదంతా బీజేపీ చేస్తున్న దుష్ప్ర‌చారం అని, తాను సొంతంగా పెంచుకున్న మొక్క‌లు కూడా అక్క‌డే వ‌దిలేసి వ‌చ్చాన‌ని అఖిలేష్ యాద‌వ్ చెబుతున్నాడు. త‌న ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీయాల‌న్న ఆలోచ‌న‌లో భాగంగానే బీజేపీ ఈ ఆరోప‌ణ‌లు చేస్తుంద‌ని, తాను అక్క‌డి నుండి ఏమీ త‌ర‌లించ‌లేద‌ని అన్నారు. ఏది ఏమ‌యినా ప్ర‌భుత్వ ఆస్తుల‌ను ప్ర‌జాప్ర‌తినిధులు డ్యామేజీ చేయ‌డం క్ష‌మార్హం కాదు.
Tags:    

Similar News