ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్లి త‌ప్పు చేస్తున్నావ్ యోగి!

Update: 2018-05-04 11:07 GMT
అత్యుత్త‌మ స్థానాల్లో ఉన్న వారు ఆచితూచి అడుగులు వేయాలి. ఏ మాత్రం త‌ప్పు చేసినా మూల్యం భారీగా ఉంటుంది. ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న వారు.. ముందు త‌మ రాష్ట్రాన్ని చ‌క్క‌దిద్దుకోవాలి. అక్క‌డి ప్ర‌జ‌ల బాగోగుల మీద దృష్టి పెట్టాలి. ఆ త‌ర్వాత వేరే రాష్ట్రాల వ్య‌వ‌హారాల్లో త‌ల‌దూరిస్తే ఎవ‌రేం అన‌రు. కానీ.. ఓప‌క్క సొంత ప్ర‌జ‌లు ప్ర‌కృతి విప‌త్తుతో తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్న వేళ‌.. అవేమీ ప‌ట్ట‌న‌ట్లుగా స‌దూర తీరాన ఉన్న రాష్ట్రంలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారానికి వెళ్ల‌టం అంటే భారీ త‌ప్పు చేసిన‌ట్లే. తాజాగా అలాంటి త‌ప్పే చేశారు యూపీ ముఖ్య‌మంత్రి యోగి అదిత్య‌నాథ్‌.
 
క‌ర్ణాట‌క‌లో జ‌రుగుతున్న ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం. దీనిపై యూపీ మాజీ సీఎం.. స‌మాజ్ వాదీ పార్టీకి చెందిన అఖిలేశ్ యాద‌వ్ తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. ఓప‌క్క యూపీ ప్ర‌జ‌లు ఇసుక తుఫానుతో తీవ్ర ఇక్క‌ట్ల‌కు గురి అవుతుంటే.. ఆ విష‌యాన్ని వ‌దిలేసి.. క‌ర్ణాట‌క రాష్ట్రంలో ప్ర‌చారానికి వెళ్ల‌టం ఏమిటంటూ మండిప‌డ్డారు.

యోగి తీరు బాధ్య‌తారాహిత్యాన్ని చూపిస్తోంద‌న్నారు. యోగి వెంట‌నే త‌న ప్ర‌చారాన్ని వ‌దిలేసి రాష్ట్రానికి రావాల‌ని.. లేకుంటే క‌ర్ణాట‌క‌లోనే మ‌ఠం క‌ట్టుకొని అక్క‌డే ఉండిపోవాల‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ బాగోగులు చూస్తార‌న్న ఉద్దేశంతోనే యోగిని రాష్ట్ర సీఎంగా యూపీ ప్ర‌జ‌లు ఎన్నుకున్నార‌ని.. అలాంట‌ప్పుడు రాష్ట్రంలో క‌ల్లోల ప‌రిస్థితులు ఏర్ప‌డితే.. సొంత ప్ర‌జ‌ల సంక్షేమం ప‌ట్ట‌దా? అని ప్ర‌శ్నించారు.

ఇప్పుడు కూడా రాష్ట్రానికి తిరిగి రాన‌ట్లైయితే.. యూపీకి రావాల్సిన అవ‌స‌రం లేద‌ని.. మ‌ఠం క‌ట్టుకొని క‌ర్ణాట‌క‌లోనే ఉండిపోవాల‌న్నారు. ఇసుక తుఫాను ధాటికి యూపీలో 70 మందికి పైగా మృతి చెంద‌గా.. 83 మంది గాయ‌ప‌డ్డారు. అగ్రా జిల్లాలోనే 43 మంది మ‌ర‌ణించారు. ఇసుక తుఫాన్ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో మృతుల సంఖ్య ఎక్కువ‌గా ఉంటుంద‌ని భావిస్తున్నారు. క‌ర్ణాట‌క‌లో ప్ర‌చారం చేస్తున్న యోగిపై అఖిలేశ్ నిప్పులు చెరిగిన నేప‌థ్యంలో ఆయ‌న ప్ర‌చారాన్ని మ‌ధ్య‌లో ఆపేసి రాష్ట్రానికి వ‌చ్చేస్తే.. ఆక్రెడిట్ అఖిలేశ్‌ కు వెళుతుంది. ఒక‌వేళ రాకుండా క‌ర్ణాట‌క‌లో ప్ర‌చారంలో మునిగిపోతే.. సొంతోళ్ల ప్రాణాలు ప‌ట్ట‌ని సీఎంగా ముద్ర ప‌డ‌టం ఖాయ‌మంటున్నారు. మొత్తానికి యోగిని అఖిలేశ్ టైం చూసి మ‌రీ ఫిక్స్ చేసిన‌ట్లు లేదూ?
Tags:    

Similar News