ఏ అర్హ‌త‌తో క‌విత బోనం ఎత్తుకున్నారు?

Update: 2018-07-31 12:10 GMT
ఆర్భాటంగా ప్ర‌చారం చేస్తే సరిపోదు. అంతుకు మించి.. సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఎలాంటి క‌ష్టం ఎదురుకాకుండా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంది. ఆ విష‌యాన్ని మ‌ర్చిపోయినందుకు కేసీఆర్ స‌ర్కారు తాజాగా భారీగా విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటోంది. ఇప్ప‌టివ‌ర‌కూ బోనాల సంద‌ర్భంగా ఎప్పుడూ ఎదురుకాని ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌పై కేసీఆర్ స‌ర్కారు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు.

బంగారు తెలంగాణ‌లో స‌గ‌మైన మ‌హిళ‌ల‌తో క‌న్నీళ్లు పెట్టిస్తున్న ఘ‌న‌త టీఆర్ ఎస్ స‌ర్కారుద‌ని బీజేపీ మ‌హిళా మోర్చా రాష్ట్ర అధ్య‌క్షురాలు ఆకుల విజ‌య విమ‌ర్శించారు. జ‌నాభాలో స‌గ‌మైన మ‌హిళ‌ల ఓట్ల‌తో రాష్ట్రంలో అధికారాన్ని చేప‌ట్టిన కేసీఆర్‌..ఈ రోజున మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల్ని ప‌ట్టించుకోవ‌టం లేద‌ని త‌ప్పు ప‌ట్టారు.

సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మ‌హంకాళి బోనాల సంద‌ర్భంగా మ‌హిళ‌లు ఎదుర్కొన్న ఇబ్బందుల‌పై తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. బోనాల వేడుక‌ల్లో మ‌హిళ‌లు క‌న్నీళ్లు పెట్టుకున్న విష‌యాన్ని గుర్తు చేసిన విజ‌య‌.. తాము మాట్లాడితే రాజ‌కీయాల‌ని కొట్టి పారేస్తార‌ని.. మ‌రి.. జోగిని శ్యామ‌ల‌.. భ‌విష్య‌వాణి చెప్పిన విష‌యాల్ని రాష్ట్రం మొత్తం చూసింద‌న్నారు.

 బంగారు బోనం తెచ్చినా మ‌హిళ‌ల్లో ఆనందం లేద‌న్న ఆమె.. అధికారులు.. పోలీసుల దురుసు ప్ర‌ద‌ర్శ‌న‌తో మ‌హిళ‌లు క‌న్నీళ్లు పెట్ట‌కున్నార‌న్నారు. మీ చేత‌కానిత‌నానికి శ్యామ‌ల క‌న్నీళ్లు పెట్టుకున్న‌ది మీకు క‌నిపించ‌లేదా కేసీఆర్‌? అంటూ ఆమె ప్ర‌శ్నించారు.

బంగారు బ‌తుక‌మ్మ‌తో పాటు బంగారు బోనం సీఎం కేసీఆర్ కుమార్తె క‌మ్ టీఆర్ ఎస్ ఎంపీ క‌విత అయ్యింద‌ని.. రాష్ట్రంలో మ‌హిళ అంటే క‌విత ఒక్క‌రేనా? అని నిల‌దీశారు. ఇంకో మ‌హిళ క‌నిపించ‌రా? అని ప్ర‌శ్నించారు. ఇప్ప‌టికైనా సీఎం కేసీఆర్‌ క‌ళ్లు తెర‌వాల‌న్న విజ‌య‌.. సికింద్రాబాద్ ఉజ్జ‌యిని మహంకాళి అమ్మ‌వారి ప్రాంగణ‌లో బోనం ఎత్తుకునే అర్హ‌త క‌విత‌కు ఎక్క‌డిద‌ని నిల‌దీశారు. సికింద్రాబాద్ తో ఆమెకుఏం సంబంధం ఉంద‌న్న విజ‌య‌.. క‌విత‌కు సికింద్రాబాద్‌ కు అస‌లు ఏమైనా సంబంధం ఉందా?  వ‌చ్చేరోజుల్లో ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని ఉండాల‌ని తాము హెచ్చ‌రిస్తున్నామ‌న్నారు. ముఖ్య‌మంత్రి స‌తీమ‌ణి బోనం ఇస్తే త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని.. బోనాల సంద‌ర్భంగా జ‌రిగిన త‌ప్పుల‌కు ఇప్ప‌టికైనా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు.



Tags:    

Similar News