అమ్మ మ‌ర‌ణంపై మ‌రో షాకింగ్ న్యూస్!

Update: 2018-03-22 12:18 GMT
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మ‌ర‌ణం ఓ మిస్ట‌రీ అని, ఆమె మ‌ర‌ణం వెనుక అనేక అనుమాలున్నాయ‌ని త‌మిళ‌నాడులో ర‌క‌ర‌కాల పుకార్లు షికార్లు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అమ్మ‌ను ఆసుప‌త్రిలో చేర్పించే స‌మ‌యానికే ఆమె కోమాలో ఉందని, 2016 డిసెంబ‌రు 5 కు కొద్దిరోజుల ముందే ఆమె మ‌ర‌ణించింద‌ని పుకార్లు వచ్చాయి. ఆమె ఇంట్లో మెట్ల‌పై నుంచి కింద‌ప‌డి గాయ‌మైంద‌ని...ఆమె కాళ్లను తొలగించారని అనుమానాలు వ్య‌క్తమ‌య్యాయి. ఆసుప‌త్రిలో అమ్మ‌ను చూసేందుకు త‌న‌ను అనుమ‌తించ‌లేద‌ని ప‌న్నీర్ సెల్వం కూడా ఆరోపించారు. అయితే, ఆమె కాళ్లు తొల‌గించలేద‌ని జ‌య ల‌లిత కారు డ్రైవరు అయ్యప్పన్ కొద్ది రోజుల క్రితం క్లారిటీ ఇవ్వ‌డంతో ఆ పుకార్ల‌కు తెర‌ప‌డింది. తాజాగా, జ‌య‌ల‌లిత చికిత్స స‌మ‌యంలో జ‌రిగిన మ‌రో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వ‌చ్చింది. అపోలో ఆసుప‌త్రిలో జ‌య చికిత్స పొందుతున్న సమయంలో సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేశారన్న వార్త చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఓ ప్రెస్ మీట్ సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని అపోలో ఆసుప‌త్రి చైర్మ‌న్ సీ.ప్ర‌తాప్ రెడ్డి స్వ‌యంగా వెల్ల‌డించారు.

జ‌య‌ల‌లిత మ‌ర‌ణంపై మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామి కమిషన్ విచారణ చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఆ క‌మిష‌న్ కు జ‌య‌ల‌లిత చికిత్స‌కు సంబంధించిన వివ‌రాల‌ను స‌మ‌ర్పించామ‌ని ప్ర‌తాప్ తెలిపారు. అయితే, ఆసుప‌త్రి సీసీటీవీ ఫుటేజీని మాత్రం క‌మిష‌న్ కు ఇవ్వ‌లేద‌ని తెలిపారు. జ‌య‌ల‌లిత చికిత్స పొందిన 75 రోజుల పాటు ఆసుప‌త్రిలో సీసీటీవీ కెమెరాలను వారు ఆఫ్ చేశార‌ని ప్ర‌తాప్ తెలిపారు. సెప్టెంబ‌రు 22 - 2016న జ‌య‌ల‌లిత ఆసుప‌త్రిలో చేరార‌ని, 24 ప‌డ‌క‌ల ఐసీయూను పూర్తిగా ఆమెకు కేటాయించామ‌ని అన్నారు. అందులోని పేషెంట్ల‌ను వేరే ఐసీయూకు బ‌దిలీ చేశామ‌ని తెలిపారు. జ‌య ఉన్న ఐసీయూలోకి వారు ఎవ‌రినీ అనుమతించేవారు కాద‌ని, ఆమెను అంద‌రూ చూడ‌డం వారికిష్టం లేద‌ని తెలిపారు. జ‌య‌ను బ్ర‌తికించేందుకు ఆసుప‌త్రి సిబ్బంది శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించార‌ని, ఆమె త‌ప్ప‌క బ్ర‌తుకుతుంద‌ని తాను ఎంతో ఆశ‌ప‌డ్డాన‌ని అన్నారు. దుర‌దృష్ట‌వ శాత్తు ఆమెను బ్ర‌తికించుకోలేక‌పోయామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.



Tags:    

Similar News