ఇక్క‌డ పులులు.. కేంద్రంలో పిల్లులు ..!

Update: 2021-05-03 02:30 GMT
ప్ర‌స్తుతం ఏపీలో క‌రోనా భీభ‌త్సం సృష్టిస్తోంది. రోజుల‌కు ప‌దుల సంఖ్య‌లో క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో వైసీపీ ప్ర‌భుత్వంపై అన్ని పార్టీలూ.. మాట‌ల తూటాలు పేల్చుతున్నాయి. అదే స‌మ‌యంలో జ‌గ‌న్ కేంద్రంగా ప‌రీక్ష‌లుర‌ద్దు చేయాల‌ని.. విద్యార్థుల ప్రాణాలు మీకు ప‌ట్ట‌వా? అంటూ.. విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఈ విష‌యంలో టీడీపీ ఒకింత ముందున్నా.. త‌ర్వాత స్థానాల్లో కాంగ్రెస్‌, బీజేపీ, జ‌న‌సేన‌, క‌మ్యూనిస్టు పార్టీలు కూడా ఉన్నాయి.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. రాష్ట్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై పార్టీలు పుల‌ల మాదిరిగా గాండ్రిస్తున్నాయి. సీఎం జ‌గ‌న్‌కు వార్నింగులు కూడా ఇచ్చే స్థాయికి వ‌చ్చాయి. ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పార్టీలు చేస్తున్న విమ‌ర్శ‌ల‌ను అర్ధం చేసుకోవ‌చ్చు. కానీ, అదే స‌మ‌యంలో ప్ర‌జారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రాల‌తో పాటు కేంద్రంపైనా ఉంది క‌దా.. మ‌ని ఏ ఒక్క‌రూ కూడా కేంద్రాన్ని ఒక్క మాట ఎందుకు అన‌డం లేదు? అనేది ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని.. క‌నీసం వ్యాక్సిన్‌ను కూడా ప్ర‌జ‌ల‌కు అందించ‌లేని ప‌రిస్థితికి చేరుకుంద‌ని... శ్మ‌శానాల్లో గుట్ట‌లు గుట్ట‌లుగా శ‌వాలు పేరుకుపోతున్నాయ‌ని.. సామూహిక అంత్య‌క్రియ‌లు నిర్వ‌హిస్తున్నార‌ని.. అంత‌ర్జాతీయ మీడియా గ‌గ్గోలుపెడుతోంది. ఇప్పుడు కేవ‌లం వంద‌లో 9 మందికి మాత్ర‌మే.. వ్యాక్సిన్ ఇచ్చార‌ని.. ఇలా అయితే.. మ‌రో మూడేళ్ల‌యినా..తొలి ద‌శ వ్యాక్సిన్ ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌ని అంత‌ర్జాతీయ మీడియా దుయ్య‌బ‌డుతోంది.

ఇక‌, బీజేపీ పాలిత రాష్ట్రాల‌కు మాత్ర‌మే కేంద్రం వ్యాక్సిన్‌ను ఇబ్బ‌డిముబ్బ‌డిగా అందిస్తోంద‌ని.. సుప్రీం కోర్టు కూడా తాజాగా అనుమానం వ్య‌క్తం చేసింది. మ‌రి ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితికి కార‌ణ‌మైన‌.. కేంద్రంపై టీడీపీ కానీ, కాంగ్రెస్‌కానీ, జ‌న‌సేన కానీ, క‌మ్యూనిస్టులు కానీ.. ఒక్క‌మాట కూడా అన‌క‌పోవ‌డం.. కేవ‌లం జ‌గ‌న్‌ను మాత్ర‌మే టార్గెట్ చేసుకోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు సోష‌ల్ మీడియా జ‌నాలు. కేవ‌లం రాజ‌కీయ కోణంలో మాత్ర‌మే క‌రోనాను చూస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా నాయ‌కులు మేల్కొంటారా? లేదా? అనేది చూడాలి.




Tags:    

Similar News