వైసీపీ మంత్రి పై సొంత పార్టీ నేతల అవినీతి ఆరోపణలు

Update: 2021-10-22 10:30 GMT
అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలో అధికార వైసీపీలో వర్గ విభేదాలు ముదురుతున్నాయి. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మంత్రి శంకర నారాయణ ప్రమాణం చేయాలంటూ సొంత పార్టీ నేత రమణారెడ్డి సవాల్ విసిరారు. సవాల్ను స్వీకరించిన గోరంట్ల వైసీపీ నాయకులు ఆంజనేయస్వామి గుడి వద్ద ప్రమాణం చేయటానికి బయల్దేరగా పోలీసులు అడ్డుకున్నారు. విష‌యం ఏంటంటే.. అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి శంక‌ర నారాయ‌ణ‌పై కొన్నాళ్లుగా ఇక్క‌డి అధికార పార్టీ నాయ‌కులు గుర్రుగా ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఆయ‌న పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే శంకర నారాయణ, వైసీపీ నాయకుడు గంపల రమణారెడ్డిల మధ్య వివాదం నెల‌కొంది. ఇది ఇప్పుడు తార‌స్థాయికి చేరుకుంది. మంత్రి అవినీతి పాల్ప‌డ్డార‌ని.. ర‌మ‌ణారెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మంత్రి ప్రమాణం చేయాలంటూ రమణారెడ్డి విసిరిన సవాల్ను స్వీకరించిన గోరంట్ల వైసీపీ నాయకులు ఆంజనేయస్వామి గుడి వద్ద ప్రమాణం చేయటానికి బయల్దేరగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి వెళ్లటానికి అనుమతి లేదని పోలీసులు చెప్పటంతో ఘర్షణ వాతావరణం నెలకొంది.

పోలీసులు సర్దిచెప్పి వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. కాగా...అధికార పార్టీ నేతల మధ్య నెలకొన్న ఘర్షణ ఎక్కడికి దారి తీస్తుందోనని నియోజకర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మంత్రి శంకరనారాయణ నిజాయితీపరుడని ఆలయంలో ప్రమాణం చేసి చెబుతారా అని గోరంట్ల మండలం కరావులపల్లికి చెందిన సహకార సంఘం మాజీ అధ్యక్షుడు, గంపల వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. ఇటీవల మంత్రి సొంత పార్టీలో కొంతమంది నాయకులను పందికొక్కులతో పోల్చారు. ఈ నేపథ్యంలో గంపల వెంకటరమణారెడ్డి మరింత రెచ్చిపోయారు.

గోరంట్లలో లేఔట్లు వేసిన వారి నుంచి డబ్బు వసూలు, గోరంట్ల పంచాయితీకి రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల నష్టం వాటిల్లడానికి మంత్రి, ఆయన సోదరులు కారణం కాదా ? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులతో కుమ్మక్కై వారికి పనులు ఇవ్వలేదా అని నిలదీశారు. కేసు పెడతామని భయపెట్టి కియా పరిశ్రమ పక్కన 200 ఎకరాలు అక్రమాలకు పాల్పడ్డారని వెంకటరమణారెడ్డి ఆరోపించారు. అయితే.. ఆయా ఆరోప‌ణ‌ల‌ను మంత్రి వ‌ర్గం ఖండించింది. కానీ, నేరుగా జోక్యం చేసుకునేందుకు నిరాక‌రించిన మంత్రి ఈ విష‌యాన్ని అధిష్టానం దృస్టికి తీసుకువెళ్తాన‌ని చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఇక్క‌డ కీల‌క విష‌యం ఏంటంటే.. టీడీపీకి గ‌ట్టి ప‌ట్టున్న జిల్లాలో వైసీపీ ఇలా రోడ్డున ప‌డ‌డం.. టీడీపీకి క‌లిసివ‌స్తున్న ప‌రిణామంగా చెబుతున్నారు.
Tags:    

Similar News