అమ్ముకో బాబూ.. అమరావతి భూములు

Update: 2017-07-22 05:07 GMT
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం రైతుల నుంచి బలవంతంగా సేకరించిన భూములను చంద్రబాబు ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకు కట్టబెడుతోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మూడు పంటలు పండే వేలాది ఎకరాల మాగాణి భూములను రైతులకు మాయమాటలు చెప్పి తీసుకుని ప్రభుత్వ పెద్దలు ఆ భూములతో కార్పొరేట్ కంపెనీలకు సంతర్పణ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.  తమకు నచ్చినవారికి కోరుకున్నంత భూములను కారుచౌకగా కట్టబెట్టి కమీషణ్లు కొట్టేస్తున్నారని మండిపడుతున్నారు.
    
గ్లోబల్‌ టెండర్లు లేకుండానే అమరావతిలో ఇప్పటిదాకా ఐదు ప్రైవేట్‌ విద్యాసంస్థలకు మొత్తం 850 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టడం వివాదాస్పదమవుతోంది.  ఈ వ్యవహారంలో ప్రభుత్వ ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం వాటిల్లిందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. రాజధానిలో ఎకరం భూమి ఖరీదు రూ.4 కోట్లు అని ‘స్విస్‌ చాలెంజ్‌’లో ప్రభుత్వమే ప్రకటించింది. కానీ, తాజాగా ఎస్‌ ఆర్‌ ఎం వర్సిటీకి ఎలాంటి టెండర్లు లేకుండానే 200 ఎకరాలను ఎకరా రూ.50 లక్షల చొప్పున కట్టబెట్టింది. భూమి వాస్తవ ధరలో 12.5 శాతానికే అప్పగించడం వెనక రూ.వందల కోట్ల ‘ముడుపులు’ చేతులు మారాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలకు 350 కోట్లు అందడంతో ఈ డీల్ చేశారని మండిపడుతున్నారు.
    
ఎస్సారెం యూనివర్సిటీ చాన్సలర్ పచ్చముత్తుపై అనేక కేసులున్నాయని... అయితే.. ఆయన బీజేపీ మనిషి కావడంతో ఆయనకు కారుచౌకగా భూములు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. సాక్షి పత్రికలో పచ్చముత్తు నేరాలకు సంబంధించిన కథనాలు కూడా ప్రచురితమయ్యాయి.

ఆ నేరాలు,  కేసుల చిట్టా ఇదీ..

* గతంలో పచ్చముత్తు స్నేహితుడు ‘వెందర్‌ మూవీస్‌’ అధినేత మదన్‌ తో ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు తేడా కొట్టాయి. ఆ తరువాత మదన్ అదృశ్యమయ్యాడు. దీనిపై మదన్ కుటుంబం పచ్చముత్తుపై అనుమానాలు వ్యక్తంచేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

* చెన్నై కోయంబేడు బస్టాండ్‌ సమీపంలో రూ.80 కోట్ల విలువైన తన స్థలాన్ని పచ్చముత్తు మనుషులు కబ్జా చేశారని 62 ఏళ్ల  డైశీరాణి గతేడాది పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.

* తమిళనాడులోని కాంచీపురం జిల్లా కట్టన్‌ కలత్తూర్‌ లో తంగల్‌ లేక్‌ వద్ద ఎస్‌ ఆర్‌ ఎం యూనివర్సిటీ కబ్జా చేసిన రూ.70 కోట్ల విలువైన 7 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయాలని రెవెన్యూ శాఖ గతేడాది ఆగస్టులో నోటీసులు జారీ చేసింది.

* మెడికల్‌ అభ్యర్థులను మోసం చేసిన కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు పచ్చముత్తును పోలీసులు అరెస్టు చేశారు.

* ఎస్‌ ఆర్‌ ఎం విశ్వవిద్యాలయంలో మేనేజ్‌ మెంట్‌ కోటాలో మెడికల్‌ సీట్లు ఇస్తామని పచ్చముత్తు, ఆయన మను షులు రూ.75 కోట్లు వసూలు చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదులందాయి.
Tags:    

Similar News