యనమలపై ఇంకో ఆరోపణ

Update: 2016-08-13 08:13 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడుకు స‌మ‌యం అస్స‌లు క‌లిసి రావ‌డం లేదు. ఇప్ప‌టికే దివీ ఫార్మా కంపెనీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు చుట్టుముడుతుండ‌గా ఇపుడు య‌న‌మ‌ల మ‌రో వివాదంలో చిక్కుకున్నారు. వరుసకు సోదరుడైన కృష్ణుడు కోసం ఏకంగా జీవోనే జారీ చేసి లాభాన్ని సమకూర్చారని ప్ర‌స్తుతం విమ‌ర్శ‌లు ఎదుర్కుంటున్నారు. ఇంకా పూర్తికాకుండా నిర్మాణంలో ఉన్న తమ్ముడి భవనంలో తన శాఖకు చెందిన కార్యాలయాన్ని అద్దెకు కేటాయించడంపై ప్ర‌తిప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. వాణిజ్య పన్నులశాఖ ఆర్థిక మంత్రి యనమల చేతిలో ఉండటంతో ఈ ఆయాచిత లబ్థి చేకూర్చేందుకు తలపడడం అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డుతున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాణిజ్య పన్నులశాఖకు తునిలో సర్కిల్‌ కార్యాలయం రాణి సుభద్రయ్యమ్మపేటలో ఉంది. గత 30 ఏళ్లుగా ఓ భవనంలో ఎనిమిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయం నడుస్తుండ‌గా వాణిజ్య పన్నులుశాఖ నెలకు రూ.12,000లు అద్దె చెల్లిస్తోంది. ఆరేళ్ల క్రితమే ఆ భవనాన్ని ఖాళీ చేయాలని భవన యజమాని వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు లేఖలు రాశారు. అధికారులు ఖాళీ చేయకపోవడంతో భవన యజమాని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆ భవనాన్ని ఖాళీచేసి మరో భవనంలోకి మార్పు చేయాలని అధికారులు భావించారు. ఈ విషయం ఆనోటా - ఈనోటా మంత్రి సోదరుడు కృష్ణుడు దృష్టికి వెళ్లడంతో అన్నగారితో మంతనాలు జరిపి తనకు అనుకూలంగా మలుచుకున్నారని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

నిర్మాణం కూడా పూర్తికాని భవనంలో రెండు ఫ్లోర్లకు సంబంధించి 7వేల చదరపు గజాలను కార్యాలయం కోసం అద్దెకు తీసుకోవడానికి జీఓ విడుదల చేయించడంపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. అందుకు నిర్థారించిన అద్దె కూడా ఆషామీషీగా లేదంటున్నారు. ప్పుడున్న అద్దెకు నాలుగు రెట్లు ఎక్కువగా నిర్థారించడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. రూ.12000లు ఉన్న అద్దెను రూ.50 వేలు పైచిలుకు చెల్లించేలా జీఓ విడుదలవడం విస్మయం కలిగిస్తోంది. ఇప్పుడు కార్యాలయం నడుస్తోన్న భవనంలో 8 వేల చదరపు అడుగులకు నెలకు రూ.12 వేలు అద్దె చెల్లిస్తున్నారు. తాజా భవనంలో 7వేల చదరపు అడుగులకు నెలకు అద్దె రూ.50వేలు పైచిలుకుకు ఖాయం చేశారు. ఇప్పుడున్న స్థలం కంటే ఎక్కువగా విస్తీర్ణం కూడా లేద‌ని స‌మాచారం. ప్ర‌తిప‌క్ష వైసీపీకి చెందిన తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఈ ప‌రిణామంపై మండిపడుతున్నారు. తుని పట్టణం శివారున ఉన్న ఈ బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్న ప్రాంతం సగం మున్సిపాలిటీ - మ‌రో సగం ఎస్‌. అన్నవరం పంచాయితీలో ఉందని చెప్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రధాన కూడలిలో ఉన్న భవనాలకు ఎస్‌ ఎఫ్‌ టీ రూ.6 నుంచి రూ.7లు అద్దె ఉంది.  పట్టణానికి శివారులో 1000 ఎస్‌ ఎఫ్‌ టి ఉన్న ప్లాటుకు రూ.5000 అద్దె పలుకుతోంది. ఈ లెక్కల ప్రకారం చూసినా ఏడు వేల చదరపు అడుగులకు రూ.35 వేలు సరిపోతుందని ఉద్దేశ‌పూర్వ‌కంగా య‌న‌మ‌ల క‌ట్ట‌బెట్టార‌ని మండిప‌డుతున్నారు.  మొత్తంగా య‌న‌మ‌ల ల‌క్ష్యంగా వైసీపీ అడుగులు వేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News