ఈఎస్ ఐ స్కాం...తవ్వే కొద్దీ బయటపడుతున్న ఆస్తులు

Update: 2020-09-01 17:30 GMT
తెలంగాణలో ఈఎస్ఐ మందుల స్కామ్ పెను ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. ఈ స్కాంలో ప్రధాన పాత్రధారి అయిన ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు ఆమె భర్త గురుమూర్తి, ఈ కేసుతో సంబంధం ఉన్న 19 మంది ప్రభుత్వ, ప్రైవేటు వ్యక్తుల్ని గత ఏడాది సెప్టెంబరులో అరెస్ట్‌ చేశారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో దేవికా రాణి దాదాపుగా 120 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. ఆంధ్ర, తెలంగాణలో ఆమెకు భారీగా ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. విచారణ చేస్తున్న కొద్దీ దేవికారాణి ఆస్తుల చిట్టా పెరిగిపోతోందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. విచారణలో భాగంగా ఆమె కూడబెట్టిన ఆస్తుల చిట్టాపై అధికారులు ఆరా తీయగా అనేక ఆస్తులు బయటపడుతున్నాయి. ఏసీబీ అధికారుల విచారణలో దేవికారాణితోపాటు ఫార్మసిస్ట్ నాగలక్ష్మిల మరికొన్ని అక్రమాస్తులు బయటపడ్డాయి.

ఓ రెసిడెన్షియల్ స్థలాన్ని కొనేందుకు వీరిద్దరూ ప్రయత్నించినట్టు ఏసీబీ అధికారులు తాజాగా గుర్తించారు. ఓ బిల్డర్ కు రూ. 4 కోట్ల 47 లక్షలు చెల్లించారని ఏసీబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో, ఆ బిల్డర్ ఇంటిలో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.4.47 కోట్లను సీజ్ చేశారు. ఆ బిల్డర్ ఆస్తులను అటాచ్ చేస్తామని ఏసీబీ అధికారులు హెచ్చరించడంతో ఆ డబ్బును తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తోంది. కొన్నాళ్ళ క్రితం ఒక నివాస స్థలం కొనుగోలుకు సంబంధించి ఈ నగదు ఇచ్చారని బిల్డర్ వెల్లడించినట్టు తెలుస్తోంది. ఆ అక్రమార్జనలో రూ.3.37 కోట్లు దేవికారాణిదని, మిగతా డబ్బు నాగలక్ష్మిదని తెలుస్తోంది. ఆ నగదు మొత్తం కోర్టులో డిపాజిట్ చేస్తామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. స్కాం చేసి సంపాదించిన సొమ్ముతో వీరిద్దరూ రియల్ ఎస్టేట్ ధందా చేయాలని భావించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో డాక్టర్ నాగమణి పైనా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.
Tags:    

Similar News