జ‌గ‌న్ స‌ర్కారుకు మ‌రో స‌ల‌హాదారు!

Update: 2022-10-18 15:24 GMT
ఏపీలోని వైసీపీ స‌ర్కారుకు మ‌రో స‌ల‌హాదారు వ‌చ్చారు. సీఎం జ‌గ‌న్ తాజాగా రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన ఆలూరు సాంబ‌శివారెడ్డిని.. త‌న స‌ల‌హాదారుగా నియ‌మించుకున్నారు. ఈయ‌న వైసీపీ ఎమ్మెల్యే, ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని శింగ‌న‌ల నియోజ‌క‌వర్గం ప్ర‌జాప్ర‌తినిధి జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తి భ‌ర్త కావ‌డం గ‌మ‌నార్హం.

అంతేకాదు.. ఏపీ పాఠ‌శాల విద్యకు చెందిన  ఏపీ స్కూల్ ఎడ్యుకేష‌న్ రెగ్యులేట‌రీ అండ్ మానిట‌రింగ్ క‌మిష‌న్ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేస్తున్నారు. ఈ నేప‌త్యంలో ఈయ‌న‌ను విద్యాశాఖ‌లో స‌ల‌హాదారుగా నియ‌మించారు. ఈ మేర‌కు జీవో విడుద‌ల చేశారు. సాంబ‌శివారెడ్డికి కేబినెట్ హోదా ఇవ్వ‌నున్నారు.

న‌వంబ‌రు 1వ తారీకు నుంచి సాంబ‌శివారెడ్డి నియామ‌కం అమ‌లులోకి వ‌స్తుంద‌ని జీవో లో పేర్కొన్నారు. దీనికి ముందు అంటే.. అక్టోబ‌రు 31న కార్య‌ద‌ర్శిగా ఆయ‌న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఇక‌, స‌ల‌హాదారుగా నియ‌మితుల‌య్యే సాంబ‌శివారెడ్డికి రూ.20 ల‌క్ష‌ల‌తో కారు కొనుగోలు చేసుకునేందుకు.. అదేవిధంగా కార్యాల‌యంలో కొత్త ఫ‌ర్నిచ‌ర్ కొనుగోలు కు మ‌రో రూ.3 ల‌క్ష‌లు విడుద‌ల చేయ‌నున్నారు.

అదేవిధంగా రూ.25 వేల తో ల్యాప్‌టాప్‌, అలాగే రూ.1.50 ల‌క్ష‌లు.. కిచెన్ సంబంధిత సౌక‌ర్యాల‌కు వెచ్చించారు. సాంబ‌శివారెడ్డికి ప్రైవేటు సెక్ర‌ట‌రీ, అద‌న‌పు వ్య‌క్తిగ‌త సెక్ర‌టరీ, మ‌రో ఆరుగురిని కార్యాల‌యానికి కేటాయించారు. ఒక‌వేళ సాంబ‌శివారెడ్డి త‌న సొంత‌కారును వినియోగించుకోవాల‌ని భావిస్తే.. నెల‌నెలా ఆయ‌న‌కు రూ.25 వేల ను ఖ‌ర్చుల కింద‌.. ఇస్తారు. అదేవిధంగా త‌న సొంత ఇంట్లో ఉంటే.. నెల‌కు రూ.ల‌క్ష అల‌వెన్స్ ఇవ్వ‌నున్నారు.  

పెద్ద సంఖ్యలో సలహాదారులను నియమించినందుకు జగన్ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన కొన్ని నెలల తర్వాత సాంబశివారెడ్డి నియామకం జరగ‌డం గ‌మ‌నార్హం. ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా వారిని "అతి రాజ్యాంగ శక్తులు" అని పేర్కొన్నారు. సలహాదారుల నియామకం, వారి జీతాలు,   ఇతర "ప్రత్యేక సౌకర్యాల" కోసం లక్షల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడంపై లోతైన విచారణ చేస్తామ‌న్నారు. అయినా.. జ‌గ‌న్ మాత్రం త‌న దారిలో తాను నియామ‌కాలు చేస్తూనే ఉండ‌డం గ‌మ‌నార్హం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News