అమలాపురం అల్లర్ల కేసు కీలక దశకు చేరినట్టేనా?

Update: 2022-05-31 05:37 GMT
ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ కోనసీమ ఆందోళన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మే 24న అమలాపురంలో జరిగిన అల్లర్లు, విధ్వంసానికి సంబంధించి దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్టేనా? విధ్వంసానికి కుట్ర ప్రణాళిక, దాన్ని అమలు చేసిన విధానంపై పోలీసులు కీలక ఆధారాలు సేకరించారా? అంటే అవుననే అంటున్నారు. సమాజంలో కుల చిచ్చును రేపేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా దాడుల్లో పాల్గొన్న అందర్నీ పోలీసులు గుర్తించారు. అల్లర్లు, విధ్వంసానికి సంబంధించి సుమారు 300 మందిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. వారిలో ఇప్పటికే 62 మందిని అరెస్టు చేశారు. మరో 50 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిలో కూడా కొంతమందిని అరెస్టు చేస్తారని సమాచారం.

కాగా, పరారీలో ఉన్న వారి ఆచూకీని కూడా ప్రత్యేక పోలీసు బృందాలు గుర్తిస్తున్నాయి. దీంతో వచ్చే వారంలో మరింతమంది నిందితులను అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. విచారణ అనంతరం వారిని అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. వారిలో పలువురిపై రౌడీషీట్లు తెరవాలని పోలీసులు నిర్ణయించారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం 52 మందిపై రౌడీషీట్లు ఎత్తేసిన విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. వారిలో కొందరు ఇటీవల అమలాపురంలో జరిగిన విధ్వంసంలో పాల్గొన్నారని పోలీసులు చెబుతున్నారు.

అమలాపురం అల్లర్లలో ప్రత్యక్షంగా పాల్గొన్నవారి అరెస్టుల ప్రక్రియ పూర్తిచేసిన తరువాత ఈ దాడుల వెనుక కుట్రదారులపై దృష్టిసారించాలని నిర్ణయించారు. ఇప్పటికే కొందరు సూత్రధారులను గుర్తించిన పోలీసులు వారు ఎవరి ప్రోత్సాహంతో, ఏ ప్రయోజనాల కోసం ఈ కుట్ర పన్నారన్న అంశాలపై విచారణ సాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే వారి కాల్‌డేటాలు, వాట్సాప్‌ సందేశాలు మొదలైనవి విశ్లేషిస్తున్నారు.

కాగా కోనసీమలో ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. అల్లర్లు, విధ్వంసం చోటు చేసుకున్న అమలాపురంతోసహా జిల్లాలోని మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు, సున్నితమైనవిగా గుర్తించిన గ్రామాల్లో పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. మళ్లీ ఉద్రిక్తతలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు గ్రామాల్లోకి అనుమానితుల కదలికలు, రాకపోకలపై పోలీసులు పటిష్ట నిఘాను ఏర్పాటు చేశారు. మరోవైపు గ్రామాల్లో అన్నికులాల పెద్దలతో మాట్లాడుతూ శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టారు. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు.

 వినతిపత్రాల సమర్పణ కోసం కలెక్టరేట్‌లకుగానీ, తహశీల్దార్‌ కార్యాలయాలకుగానీ కూడా ప్రజలను ఎవ్వరినీ రానీయడం లేదు. ఎలాంటి వినతిపత్రాలనైనా సంబంధిత గ్రామ, వార్డు సచివాలయంలో సమర్పించాలని అధికార యంత్రాంగం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్నె్‌ట్‌ సేవలను ఇంకా పునరుద్ధరించలేదు.

ఎటువంటి పుకార్లు, అసత్య వార్తలు వ్యాపించకుండా పోలీసులు ఇంటర్నెట్ మీద నిషేధం విధించారు. ఈ నిషేధం మరికొద్ది రోజులు కొనసాగుతుందని.. ఆ తర్వాత ఎత్తేస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు చెబుతున్నారు. కోనసీమలో జరుగుతున్న అల్లర్లపై పుకార్లు నమ్మవద్దని ప్రజలను కోరారు. ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. కోనసీమలో సెక్షన్ 30, 144 సెక్షన్ అమలులో ఉన్నందున్న ర్యాలీలు, సభలు, రహస్య సమావేశాలు నిర్వహించరాదని పేర్కొన్నారు.
Tags:    

Similar News