ఇదేం కామెడీ బాబు

Update: 2016-09-17 17:30 GMT
ప‌నులే ప్రారంభం కాలేదు. నిధుల విడుద‌ల లేదు. కానీ అభివృద్ధిలో పురోగ‌తి లేద‌ని అధికారుల‌ను స‌స్పెండ్ చేస్తే ఎలా ఉంటుంది? ఏంటి ఇలా కూడా జ‌రుగుతందా అంటారా? జ‌రిగింది. అలా జ‌రిగిన తీరుపై ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రితో పేచీ పెట్టుకున్నారు. ఆ శాస‌న‌స‌భ్యుడు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కాగా... మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు. ఈ ప‌రిణామం చోటుచేసుకుంది ప్ర‌కాశం జిల్లాలో.

ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో ఏఈ గోవిందరెడ్డిని రాష్ట్ర అదికారులు సస్పెండ్ చేశారు. అయితే దీనిపై ఆమంచి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. జిల్లా మంత్రి శిద్దా రాఘవరావును సైతం కలిసిన ఆమంచి ఈ విష‌యం చర్చించారు. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణాలు ఇంకా మొదలే కానప్పుడు.. ఈ వారంలో పురోగతి లేదంటూ వేటపాలెం ఏఈని స‌స్పెండ్ చేయమని ఆదేశించడం సరికాదని అన్నారు. జిల్లాలోనే వేటపాలెం ఏఈ మంచి పనితీరు కనబరుస్తున్నారని.. పలు సందర్భాల్లో ఆయనకు ఉన్నతాధికారుల ప్రశంసలు వచ్చాయని ఆమంచి వివరించారు. బాగా పనిచేసే అధికారులను కాపాడుకోలేకపోతే.. ఇక పనిచేయడానికి ఎవరూ మిగలరని అన్నారు. ఎక్కడైనా గోవిందరెడ్డి సరిగా పనిచేయరని గానీ, ఇతర వ్యహారాల్లో తలదూర్చారని గానీ, అక్రమాలకు పాల్పడినట్లు ఉంటే తెలపాలని ఆమంచి కోరారు. అనంత‌రం కలెక్టర్‌ సుజాతశర్మను క్యాంపు కార్యాలయంలో కలిసిన ఆమంచి ఇదే విష‌యం చర్చించారు. ఏఈ గోవింద‌రెడ్డి సస్పెన్షన్‌ సిఫారసును ఉపసంహరించుకోవాలని కోరారు. ఇలాంటి నిర్ణ‌యాలు ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వాన్ని న‌వ్వుల పాలు చేస్తాయ‌ని ఆమంచి వ్యాఖ్యానించారు.

ఇదిలాఉండ‌గా మ‌రో కార్య‌క్ర‌మంలో గృహ నిర్మాణ శాఖ‌ మంత్రి మృణాళిని ఈ విష‌య‌మై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కొత్తగా మంజూరైన గృహనిర్మాణాలు అక్టోబరు నుంచి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి 1250 ఇళ్లను మంజూరుచేశామన్నారు. అన్ని సిద్ధంగా ఉన్నప్పటికీ లబ్ధిదారుల ఎంపికే కష్టమవుతోందని వ్యాఖ్యానించారు. ఆధార్‌ తో అనుసంధానం చేసేటప్పటికి - ప్రస్తుతం గుర్తించిన లబ్ధిదారులకు గతంలో ఇల్లు మంజూరైన విషయం బహిర్గతమతోందని - దీనివల్ల మళ్లీ మొదటికి వస్తోందని మృణాళిని వివరించారు. అక్టోబరు నుంచి పక్కాగృహాల పనులు ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లో మంజూరైన ఇళ్లకు గానూ 73వేల మంది లబ్ధిదారులు నేరుగా తమ స్థలాల్లో నిర్మించుకోవచ్చునన్నారు. లక్షా ఇరవై నాలుగువేల ఇళ్లను స్థల లభ్యత బట్టి జి+3 - లేదా జి+4 స్థాయిలో నిర్మాణాలు చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు ప్రారంభించి మధ్యలో నిలిచిపోయిన ఇళ్లకు చెల్లింపులు చేసేందుకు రూ.334కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. గృహనిర్మాణంలో జరిగిన అవకతవకలపై నిఘావిభాగం దర్యాప్తునకు ఆదేశించామని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని మంత్రి మృణాళిని వెల్లడించారు.
Tags:    

Similar News