జగన్ మాజీ సీఎం అవుతారు...ఆయన పార్టీ సైతం ఉండదు... ?

Update: 2021-12-31 15:30 GMT
ఈ జోస్యం ఏంటి అని అనుకుంటున్నారా. ఇది జోస్యం కాదు, కడుపు మండిన వారి శాపం. మేము ఏం పాపం చేశామని అన్న అమరావతి రైతుల ఆందోళన ఇది. అమరావతి రాజధాని కోసం వేలాది భూములు ఇచ్చిన వారి ఆవేదన ఇది. జగన్మోహనరెడ్డి కాదు ఏ రెడ్డి వచ్చినా అమరావతి రాజధాని ఎక్కడికీ పోదు, అది అక్కడే ఉంటుంది. ఇది మా మాట కాదు, అయిదు కోట్ల తెలుగు జాతి మాట. ఇదే అందరి బాట అంటున్నారు అమరావతి రైతులు.

అమరావతి రాజధాని జేఏసీతో ఒక చానల్ జరిపిన ఇంటర్వ్యూ త్వరలో ప్రసారం కానుంది. అయితే దానికి ముందు వచ్చిన చిన్న టీజర్ ఇది. దాదాపు గంట సేపు ఆ ఇంటర్వ్యూ ప్రసారం కానుంది. అందులో అమరావతి జేఎసీ నాయకులు ఏ బాంబులు పేలుస్తారో చూడాలి. అయితే ఆ ఇంటర్వూకి సంబంధించి వచ్చిన ప్రోమో మాత్రం హాట్ హాట్ గానే ఉంది. అది వైరల్ గా మారి ఏపీ రాజకీయాల్లో రచ్చ చేస్తోంది.

అమరావతి జేయేసీ నేతలు శివారెడ్డి, శైలజ వంటి తదితరులు తమ రాజధాని కాదు అది ప్రజా రాజధాని అంటున్నారు. వికేంద్రీకరణ అన్నది శుద్ధ దండుగ మారి వ్యవహారం అని కూడా అంటున్నారు. జేఏసీ నేతలు మరో అడుగు ముందుకేసి అమరావతి రాజధానిని కాదని జగన్ ముందుకు అడుగులు వేస్తే ఆయన మాజీ సీఎం కావడం తధ్యమని కూడా స్పష్టంగా చెబుతున్నారు.

అయితే జగన్ 2024 ఎన్నికల్లో మళ్లీ గెలిచి వస్తే మాత్రం భారతదేశంలో ఏపీ అన్న రాష్ట్రాన్ని మరచిపోవచ్చు అని కూడా వారు ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. 13 కోట్ల జనాభా ఉన్న ఏపీకి మూడు రాజధానులు అంటున్నారు. మరి 130 కోట్ల ఉన్న భారత దేశానికి ఒకటి కాదు, అయిదు రాజధానులు అని ఎవరైనా అంటే అపుడు దేశం ఏంకావాలి అన్న అమరావతి జేఏసీ నేతల ప్రశ్నలు కూడా ప్రోమోలో ఆకట్టుకునేలా ఉన్నాయి.

తాము అన్నింటికీ తెగించే ఉద్యమ బాటలోకి వచ్చామని ఏవరికీ అమ్ముడుపోమని, ఎవరూ తమని అసలు కొనలేరని కూడా వారు అంటున్నారు. అమరావతి అంటే కేవలం కమ్మ సామాజికవర్గం వారిదే కాదని, ఆ చుట్టుపక్కన ఎస్సీలు, ఎస్టీలు సహా బీసీ ఇతర సామాజిక వర్గాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నారని, అక్కడ నెగ్గిన ఎమ్మెల్యేలకు ఆ సంగతి తెలుసని, ప్రభుత్వానికీ తెలుసు అని జేఏసీ నేతలు అంటున్నారు. మొత్తానికి అమరావతి రాజధానిని సాధించుకుని తీరుతామంటున్న జేఏసీ నేతలతో ఇంటర్వ్యూ ఈ ఆదివారం ఒక చానల్ లో ప్రసారం అవుతోంది. మరి వారు ఏం చెప్పారు, ఎలా రియాక్ట్ అయ్యారు అన్నది ఏపీ మొత్తానికే ఆసక్తికరమైన అంశంగానే ఉందిపుడు.


Tags:    

Similar News