టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు ఓ రేంజిలో పైరయ్యారు. అసలు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు నారా లోకేశ్ ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించిన అంబటి... ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు తన కుమారుడిని పరోక్ష ఎన్నిక ద్వారా చట్టసభకు పంపుతున్నారని ఆరోపించారు. కాసేపటి క్రితం గుంటూరులో మీడియాతో మాట్లాడిన అంబటి... టీడీపీ వైఖరిపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలకు అటు చంద్రబాబుకు గాని, ఇటు లోకేశ్ కు గాని విశ్వాసం లేదని, ఆ కారణంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటి చేస్తే ఎక్కడ ఓడిపోతాడోనన్న భయంతోనే లోకేశ్ ను శాసన మండలికి పంపుతున్నారని సెటైర్లేశారు. అయినా టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు వ్యతిరేకించిన శాసనమండలికి ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎలా పంపుతారని కూడా అంబటి ప్రశ్నించారు. అధికార పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేశ్ కు దమ్ము - ధైర్యం ఉంటే... ప్రత్యక్ష ఎన్నికల్లో పోటి చేసి విజయం సాధించి చట్టసభల్లో అడుగుపెట్టాలని సవాల్ విసిరారు.
ఈ సందర్బంగా పలు రాజకీయ పార్టీల అధినేతల వారసుల రాజకీయ ఎంట్రీని అంబటి ప్రస్తావించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా తొలుత పార్లమెంటుకు ఆ తర్వాత ఎమ్మెల్యేగా శాసనసభకు ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే ఎన్నికయ్యారని అంబటి తెలిపారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కూతురు కవితలు ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే ఎంట్రీ ఇచ్చారన్న విషయాన్ని గుర్తు చేసుకోవాని తెలిపారు. యూపీ సీఎంగా ఉన్న అఖిలేశ్ యాదవ్ కూడా ప్రత్యక్ష ఎన్నికల ద్వారానే రాజకీయంగా ఎంట్రీ ఇచ్చారన్న విషయం కూడా మరిచిపోయారా అని అంబటి ప్రశ్నించారు. కీలక స్థానంలో ఉన్న లోకేశ్ కూడా వారి మాదిరే ప్రత్యక్ష ఎన్నికలకు సిద్ధం కావాల్సింది పోయి... పరోక్ష ఎన్నికల ద్వారా చట్టసభబలలోకి అడుగుపెట్టడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
http://www.tupaki.com/photogallery/actress/Pragya-Jaiswal-New-Photos/2489