సుజనా ప్రయత్నాల్లో సీక్రెట్ వేరే!

Update: 2018-04-29 13:30 GMT
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు సుజనా చౌదరి - సీఎం రమేష్ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీని కలవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుడు అంబటి రాంబాబు.. ఓ కీలకమైన అంశాన్ని బయటపెట్టారు. తద్వారా.. ఒకవైపు రాష్ట్రంలో భాజపా పరువు తీస్తూనే... ఢిల్లీలో మోడీ అపాయింట్ మెంట్ కోసం తెదేపా ప్రయత్నిస్తున్నదని ఆయన వెల్లడించారు. తన పబ్బం గడవడానికి వంద రకాల వక్రమార్గాలను అనుసరించడం చంద్రబాబుకు అలవాటే అనేది ప్రజాభిప్రాయం. అలాంటి నేపథ్యంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగినా అందులో ఆశ్చర్యం లేదు. అయితే తాజాగా ఢిల్లీ వర్గాల నుంచి పుడుతున్న పుకారు ఏంటంటే.. అంబటి రాంబాబు ఆరోపించినట్లుగా తెదేపా నాయకులు మోడీ తో భేటీకోసం పాకులాడుతున్న మాట వాస్తవమే గానీ.. సుజనా చౌదరి ప్రయత్నాల్లోని సీక్రెట్ వేరే ఉన్నదని అంటున్నారు.

సుజనా చౌదరి తెలుగుదేశానికి చెందిన కేంద్ర మంత్రి అయినప్పటికీ.. ఆయన అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీకి ‘బాగా’ దగ్గరయ్యారు. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ.. ఆయన భాజపాకు చెందిన కేంద్రమంత్రులతో మాత్రం సత్సంబంధాలనే కలిగి ఉన్నారనే ప్రచారం ముమ్మరంగా ఉంది. దానికి తగినట్లుగా.. పార్లమెంటులో ఆయన తెదేపా పార్లమెంటరీ పార్టీకి నాయకుడు అయినప్పటికీ.. పార్లమెంటు ముగిసిన తర్వాత.. ఇప్పటిదాకా ప్రత్యేకహోదా గురించి గానీ.. రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న వంచన గురించి గానీ.. ఒక్కటంటే ఒక్క సందర్భంలో కూడా పెదవి విప్పి మాట్లాడలేదు.

మరో కోణంలోంచి చూసినప్పుడు.. సుజనా చౌదరి తన రాజకీయ భవితవ్యం కోసం తెలుగుదేశం పార్టీని వీడి భాజపా తీర్థం పుచ్చుకున్నా కూడా ఆశ్చర్యం లేదనే ప్రచారం కూడా ఢిల్లీ వర్గాల్లో జరుగుతోంది. ఇప్పుడు అంబటి రాంబాబు చెబుతున్న మాటలతో ఈ పుకార్లను సింక్ చేసుకున్నప్పుడు.. తన సొంత రాజకీయం కోసమే సుజనా - మోడీతో భేటీకి ప్రయత్నిస్తుండవచ్చుననే అనుమానాలు పలువురిలో కలుగుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఏ సందర్భంలోనూ నిలకడైన నిబద్ధతను ప్రదర్శించకుండా.. ఇన్నేళ్లూ కేంద్ర మంత్రి పదవిని మాత్రం అనుభవించిన సుజనా.. తన వ్యాపారాలను పరిరక్షించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సున్నం పెట్టుకోరని.. అందుకోసం పార్టీ ఫిరాయించడానికి కూడా సిద్ధంగానే ఉండగలరనే ప్రచారం జరుగుతోంది.
Tags:    

Similar News