అంబ‌టికి షేక్ హ్యాండ్ ఇచ్చిన బుచ్చ‌య్య ఏం చెప్పారు?

Update: 2019-07-23 08:57 GMT
స‌భ‌లో బ‌లం లేన‌ప్పుడు.. విప‌క్షం ఎలా వ్య‌వ‌హ‌రించాలి?  ఏ రీతిలో అధికార‌ప‌క్షాన్ని ఇరుకున పెట్టాల‌న్న విష‌యం మీద బాబు అండ్ కోకు ఏ మాత్రం అవ‌గాహ‌న లేని విష‌యం తాజాగా సాగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్ని చూస్తే.. ఇట్టే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి. బ‌లం లేదు కాబ‌ట్టి ప్ర‌తిప‌క్ష హోదాలో కామ్ గా ఉండిపోవాల‌ని.. అధికార ప‌క్షం ఏం చెబితే దానికి తందానా అనాల‌ని అన‌టం లేదు. నిర్మాణాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌టం ద్వారా.. త‌మ‌కు అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ వారి త‌ప్పుల్ని ఎఫెక్టివ్ గా ఎత్తి చూప‌టం ద్వారా ఇబ్బంది పెట్టొచ్చు.

అంతేకానీ.. అరుపులు.. కేక‌లు.. రంకెలు వేయ‌టం ద్వారా ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. వాస్త‌వానికి చంద్ర‌బాబు ఐదేళ్ల పాల‌న వేళ‌.. విప‌క్షానికి వారు కేటాయించిన స‌మ‌యంతో పోలిస్తే.. తాజాగా జ‌గ‌న్ స‌ర్కారు హ‌యాంలో స‌భ‌లో ప్ర‌తిప‌క్షం మాట్లాడేందుకు ఇస్తున్న స‌మ‌యం ఎక్కువ‌నే విష‌యాన్ని అంద‌రూ ఒప్పుకుంటున్నారు.

అయితే.. అధికార‌ప‌క్షం స్పీడ్ ముందు తాము తేలిపోకుండా ఉండేందుకు తెలుగు త‌మ్ముళ్లు ప‌డుతున్న తాప‌త్ర‌యం వారిని అడ్డంగా బుక్ చేస్తోంది. తాజాగా స‌భ‌ను ముందుకు సాగ‌నివ్వ‌కుండా అదే ప‌నిగా అరుపుల‌తో.. కేక‌ల‌తో.. స‌భ‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసిన టీడీపీ స‌భ్యుల్లో ముగ్గురిపై ఈ సెష‌న్ వ‌ర‌కూ స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌టం తెలిసిందే.

స‌భ‌లోకి మార్ష‌ల్స్ ను తీసుకురావ‌టం ద్వారా స‌స్పెన్ష‌న్ వేటు ప‌డిన ముగ్గురు స‌భ్యుల్ని స‌భ బ‌య‌ట‌కు తీసుకెళ్లారు. ఇదిలా ఉండ‌గా.. వేటు ప‌డిన ముగ్గురు స‌భ్యుల‌కు స‌భ‌లోకి వెళుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబు ఎదుర‌య్యారు.

ఆయ‌న‌కు షేక్ హ్యాండ్ ఇచ్చిన బుచ్చ‌య్య‌.. గ‌డిచిన ఐదేళ్ల కాలంలో మార్ష‌ల్స్ అసెంబ్లీలోకి రాలేద‌ని చెప్పుకొచ్చారు. సెష‌న్ మొత్తం వేటు వేసేంత త‌ప్పు తామేం చేశామ‌ని ప్ర‌శ్నించారు. దానికి బ‌దులుగా రాంబాబు.. తాను ఇప్పుడే వ‌స్తున్నానని..  త‌న‌కేం తెలీద‌న్నారు. సెష‌న్ మొత్తం వేటు వేయ‌టంపై బుచ్చ‌య్య ఆవేద‌న‌కు బ‌దులిచ్చిన అంబ‌టి.. అంత‌లా గొడ‌వ చేయ‌టం ఎందుకు? అని ప్ర‌శ్నించి.. మ‌ళ్లీ వ‌చ్చే సెష‌న్ లో క‌లుద్దామ‌ని స‌భ లోప‌ల‌కు వెళ్లిపోయారు. అయినా.. బుచ్చ‌య్య ఆత్రం కాకుంటే.. ఆయ‌న ఆవేద‌న‌కు అంబ‌టి సానుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తారా ఏంటి?


Tags:    

Similar News