క‌రెన్సీ నోట్లే.. కేంద్రంగా... ద‌ళితుల ఓట్ల‌ కోసం కేసీఆర్ మ‌రో ఉద్య‌మమా?

Update: 2021-07-31 16:30 GMT
తెలంగాణ ఉద్య‌మ సార‌థి, సీఎం కేసీఆర్ మ‌రో ఉద్య‌మాన్ని ప్రారంభించ‌నున్నారా? ద‌ళితుల‌ను ఆక‌ట్టు కునేందుకు.. వారి ఓట్ల‌ను త‌న‌వైపు తిప్పుకొనేందుకు, ద‌ళితుల ఆత్మ బంధువుగా పేరు తెచ్చుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నిస్తున్నారా? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఎవ‌రికీ రాని ఐడియా ఒక‌టి కేసీఆర్‌కు వ‌చ్చింది. నిత్యం ప్ర‌జ‌ల చేతులు మారే.. క‌రెన్సీ నోట్ల‌పై ఇప్ప‌టి వ‌ర‌కు జాతిపిత మ‌హాత్మా గాంధీ ఫొటోనే కేంద్రం సూచ‌న‌ల‌తో ఆర్బీఐ ముద్రిస్తోంది.

వాస్త‌వానికి దేశ రికార్డుల ప్ర‌కారం.. గాంధీ జాతిపిత కాద‌ని(యూపీఏ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌క‌టించారు) ప్ర‌క‌టించినా.. క‌రెన్సీ నోట్ల‌పై మాత్రం ఆయ‌న ముఖ చిత్రాన్ని ముద్రిస్తున్నారు. అయితే.. ఇప్పుడు గాంధీ ఫొటోతో పాటు.. రాజ్యాంగ నిర్మాత అంబేద్క‌ర్ ఫొటోను కూడా క‌రెన్సీ నోట్ల‌పై ముద్రించాల‌నే డిమాండ్ ను కేసీఆర్ లేవ‌నెత్తుతున్నారు. తాజాగా ఇదే విష‌యాన్ని కేంద్రానికి కూడా పంపారు. తెలంగాణ‌ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ .. ఈ విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు.

క‌రెన్సీ నోట్ల‌పై రాజ్యాంగ నిర్మాత అంబేద్క‌ర్ చిత్త‌రువును కూడా ముద్రించాల‌ని వినోద్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ``కరెన్సీపై అంబేద్కర్ ఫొటో`` నినాదాన్ని అందుకున్న‌ సాధన సమితి జాతీయ కమిటీ ప్రతినిధులు మంత్రుల నివాసంలో వినోద్ కుమార్‌తో సమావేశమయ్యారు. తమ డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని వినోద్ కుమార్ ను కమిటీ ప్రతినిధులు కోరారు. కమిటీ చేపట్టిన ఆగస్టు 3, 4, 5 తేదీలలో ‘చలో ఢిల్లీ’ వాల్ పోస్టర్‌ను బోయినపల్లి వినోద్‌ కుమార్‌ ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫొటోను ముద్రించాలన్న డిమాండ్ న్యాయ సమ్మతమైనదేనని అన్నారు. క‌రెన్సీ నోటుపై అంబేద్క‌ర్ బొమ్మ‌ ముద్రించ‌డం అంశాన్ని పార్లమెంటు వేదికగా లేవనెత్తాలని టీఆర్ఎస్‌ ఎంపీలకు వినోద్ కుమార్‌ సూచించారు. దేశంలో రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ అని అన్నారు. అలాంటి మహానీయుడి చిత్తరువును క‌రెన్సీ నోట్ల‌పై ముద్రించుకోవ‌డం.. కనీస బాధ్యతగా వినోద్ పేర్కొన్నారు.

అయితే, ఇన్నేళ్ల‌లో లేనిది.. కేసీఆర్ స‌ర్కారు ఇప్పుడు ఉన్న‌ట్టుండి.. అంబేద్క‌ర్ ముఖచిత్రాన్ని క‌రెన్సీ నోట్ల‌పై ముద్రించాల‌నే నినాదం.. ఇప్పుడు అందుకోవ‌డం వెనుక హుజూరాబాద్ ఉప‌ ఎన్నికే కార‌ణ‌మా? అనే వాద‌న కూడా వినిపిస్తోంది. అదేస‌మ‌యంలో ఇప్ప‌టికే ద‌ళితుల‌ను ఆక‌ట్టుకునేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల్లో భాగంగానే కేసీఆర్ దీనిని భుజాన వేసుకున్నారా? అని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఏదేమైనా.. ప్ర‌స్తుతం ఎత్తుకున్న నినాదం దేశ‌వ్యాప్తంగా క‌నుక వినిపించ‌గ‌లిగితే.. ఎలూగూ వ‌చ్చేది ఎన్నిక‌ల నామ సంవ‌త్స‌ర‌మే(5రాష్ట్రాల్లో ఎన్నిక‌లుఉన్నాయి) క‌నుక‌..కేంద్రం కూడా దీనిపై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News