షాకింగ్‌: అమెరికా వ‌ర్సిటీల్లో ఆక‌లి కేక‌లు

Update: 2018-04-12 05:23 GMT
షాకింగ్ విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌పంచానికి పెద్ద‌న్న లాంటి అమెరికా విశ్వ విద్యాల‌యాల్లో ఏడాది కాలంలో విద్యార్థులు ఆక‌లితో అల‌మ‌టిస్తున్న వైనం అంత‌కంత‌కూ పెరిగిపోతున్న సంచ‌ల‌న విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. విద్యార్థులు బ‌రువు త‌గ్గుతున్నార‌ని.. అదేదో డైటింగ్ చేశో.. వ్యాయామం చేశో కాద‌ని.. ఆహారాన్ని త‌గ్గించి తీసుకోవ‌టం కార‌ణంగా బ‌రువు త‌గ్గిన‌ట్లు తేలింది. ఎందుకిలా అంటే.. క‌డుపు నిండా తినేందుకు అవ‌స‌ర‌మైన డ‌బ్బు లేక‌పోవ‌టం.. ఒక‌పూట భోజ‌నంతో స‌రిపెట్టుకోవ‌టంతో ఇలాంటి ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని చెబుతున్నారు.

ఇలా క‌డుపు క‌ట్టుకొని చ‌దువుకుంటున్న విద్యార్థుల సంఖ్య విశ్వ‌విద్యాల‌యాల్లో అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంద‌ని.. వంద‌లాది మంది విద్యార్థులు త‌మ‌కు స‌రిప‌డా ఆహారాన్ని కొనుగోలు చేయ‌లేని దుర్బ‌ర‌మైన ప‌రిస్థితుల్లో ఉన్న‌ట్లుగా తేలింది.

ఈ సంచ‌ల‌న విష‌యం ఎలా తేలిందంటే.. టెంపుల్ యూనివ‌ర్సిటీ.. విస్ కాన్సిస్ హోప్ ల్యాబ్ ఒక భారీ స‌ర్వేను నిర్వ‌హించింది. అమెరికాలోని 66 విద్యాసంస్థ‌ల్లోని 43వేల మంది విద్యార్థుల అభిప్రాయాల్ని సేక‌రించారు. ఈ స‌ర్వేలో  విశ్వ‌విద్యాల‌యాల్లోని విద్యార్థుల్లో 36 శాతం మందికి త‌గినంత ఆహారం ల‌భించ‌టం లేద‌ని.. ఇందుకు కార‌ణం డ‌బ్బు లేక‌పోవ‌టంగా తేల్చారు. చేతిలో డ‌బ్బులు ఎక్కువ‌గా లేక‌పోవ‌టంతో త‌క్కువ మొత్తంలో ఆహారాన్ని తిని స‌ర్ది చెప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

అంతేకాదు. విశ్వ‌విద్యాల‌యాల్లో చ‌దివే విద్యార్థుల్లో 36 శాతం మందికి స‌రైన నివాస స‌దుపాయం కూడా లేద‌ని.. ఇలాంటి వారు స్నేహితులు.. బంధువుల ఇళ్ల‌ల్లో ఉంటున్నారు. కొంత‌మంది అయితే ప‌గ‌లంతా క్యాంప‌స్ ల‌లో తిరిగి.. రాత్రి అయ్యేస‌రికి రైళ్లు.. బ‌స్సులు.. ఆసుప‌త్రులు.. అంబులెన్స్ ల్లో త‌ల‌దాచుకుంటున్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వ‌స‌తి స‌మ‌స్య‌తో పోలిస్తే.. ఆహారం ల‌భించ‌ని స‌మ‌స్య మ‌రింత పెద్ద‌దిగా ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు.

అగ్ర రాజ్యంలోని విద్యార్థులు ఆక‌లి కేక‌లు వేయాల్సిన ప‌రిస్థితి ఎందుకు ఏర్ప‌డింద‌న్న విష‌యంలోకి వెళితే..  విశ్వ విద్యాల‌యాల్లోనూ.. కాలేజీల్లో వ‌సూలు చేస్తున్న అధిక ఫీజులే కార‌ణంగా చెబుతున్నారు. త‌గినంత‌గా స్కాల‌ర్ షిప్ లు రాక‌పోవటం.. ఓప‌క్క చ‌దువుకుంటూ మ‌రోప‌క్క ఏదో ఒక‌టి ప‌ని చేయ‌టానికి సిద్ధ‌ప‌డిన‌ప్ప‌టికీ వారి అవ‌స‌రాలు తీర‌టం లేద‌న్నారు. దీంతో.. ప‌స్తులు ఉండాల్సి వ‌స్తోంద‌న్నారు.

 ఒక విద్యార్థి వ‌స‌తి.. ఆహార ఖ‌ర్చు అమెరికాలో స‌గ‌టున ఏడాదికి క‌నీసం 10వేల డాల‌ర్లు ఉంటుంద‌ని చెబుతున్నారు. ఈ ఖ‌ర్చు ఏడాదికేడాది పెరిగిపోతుంద‌న్నారు. దుస్తులు.. లాండ్రీ.. ఇత‌ర ఖ‌ర్చులు దీనికి అద‌న‌మ‌ని.. ఖ‌ర్చులు అంత‌కంత‌కూ పెరుగుతున్నా వారికి ఆదాయ మార్గాలు లేక‌పోవ‌టంతో ఆక‌లి బాధ‌లు త‌ప్ప‌టం లేదంటున్నారు.  మ‌రింత విషాద‌క‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. తెల్లారింది మొద‌లు విద్యార్థులు ప‌లువురు.. త‌మ‌కు ఉచితంగా భోజ‌నం ఎక్క‌డైనా దొరుకుతుందేమోన‌న్న అంశంపైనే ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నార‌ని.. ఆక‌లి కార‌ణంగా చ‌దువు మీద దృష్టి పెట్ట‌లేకపోతున్న‌ట్లుగా చెబుతున్నారు. పేరుకు ఆగ్ర‌రాజ్య‌మే కానీ చ‌దువుకునే విద్యార్థుల ఆక‌లికేక‌లు వింటే.. ఉన్నంత‌లో మ‌న పిల్ల‌లే చ‌క్క‌టి సౌక‌ర్యాల‌తో చ‌దువుకుంటున్నార‌ని చెప్పొచ్చు.
Tags:    

Similar News