కరోనా భయానికి తమదేశం పోమంటున్న అమెరికన్లు

Update: 2020-04-29 11:52 GMT
కరోనా భయానికి అమెరికన్లు అంతా ఇప్పుడు భారతదేశమే సురక్షితమని భావిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం ప్రత్యేక విమానాలు పంపుతున్నా తాము భారత్ వదిలి రామంటే రామంటున్నారు. అమెరికా వెళితే కరోనాతో చస్తామని.. భారత్ లోనే సురక్షితంగా ఉంటామని వారంతా భీష్మించుకు కూర్చుంటున్నారట.. అమెరికా అధికారుల కాల్స్ కు స్పందించడం లేదట..

అమెరికాలో కరోనా కేసుల సంఖ్య మంగళవారం 1 మిలియన్ దాటేసింది. 58,348 మంది మరణించారు. భారతదేశంలో 31,368 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పటిదాకా 1,008 మరణాలు మాత్రమే సంభవించాయి. దీంతో కరోనా అంతగా ప్రబలని భారత్ సేఫ్ అని అమెరికన్లు అంతా భావిస్తున్నారట..  

కరోనా మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేస్తోంది. లక్షల మందికి సోకి వేల ప్రాణాలు తీస్తోంది. కరోనాకు అగ్రరాజ్యం అల్లకల్లోలంగా మారింది. ఈ నేపథ్యంలో భారత్ లో చిక్కుకుపోయిన అమెరికన్లను తిరిగి దేశానికి తీసుకెళ్లడానికి అమెరికా సర్కార్ ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేస్తోంది. కానీ తాము భారత్ ను విడిచి అమెరికా రాము అంటూ అమెరికన్లంతా ససేమిరా అంటున్నారని విదేశాంగ శాఖ ఉన్నత కాన్సులర్ జనరల్ తాజాగా తెలిపారు.

 అమెరికా ప్రిన్సిపల్ డిప్యూటీ అసిస్టెంట్ విదేశాంగ కార్యదర్శి ఇయాన్ బ్రౌన్లీ మీడియాతో మాట్లాడారు.  భారతదేశంలో చిక్కుకుపోయిన అమెరికన్లను సొంతదేశానికి తీసుకెళ్లడానికి ఏర్పాటు చేశామని.. విమాన టికెట్లు పంపించినా వారు తిరిగి వెళ్లడానికి ఆసక్తి చూపించడం లేదని తెలిపారు.

రెండు వారాల క్రితం భారత్ లో చిక్కుకుపోయిన అమెరికాన్ల జాబితా రూపొందించి తాము ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేశామని.. వారికి సీట్లు కేటాయించి చాలా సార్లు కాల్స్ చేసినా వారు స్పందించడం లేదని ఇయాన్ బ్రౌన్లీ తెలిపారు. గత వారం 4,000 మంది అమెరికన్లను తిరిగి అమెరికాకు తీసుకువచ్చామని.. ఇంకా 6,000 మంది తీసుకెళ్లడానికి పిలిచామని వారు స్పందించడం లేదని చెప్పారు.

భారత దేశవ్యాప్తంగా అమెరికన్లు లాక్ డౌన్ ఎక్కడికక్కడే ఉన్నారని.. ముంబై - న్యూఢిల్లీలో ఎక్కువ శాతం ఉన్నారని.. వారిని తీసుకెళుదామంటే రావడం లేదని బ్రౌన్లీ తెలిపారు.

Tags:    

Similar News