దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటోన్న బీజేపీ పప్పులు ఇప్పట్లో ఉడికేలా కనిపించడం లేదు. కర్ణాటకలో గత వైభవాన్ని సొంతం చేసుకోవాలనుకున్న బీజేపీకి కుమార స్వామి షాకిచ్చారు. తమిళ తంబీల మనసు గెలుచుకుందామనుకుంటోన్న మోదీకి ....తమిళ రాజకీయాలు ఓ పట్టాన అంతుచిక్కడం లేదు. కేరళలో అయితే ఆ పార్టీకి అసలు పట్టే లేకుండా పోయింది. ఇక ఏపీలో టీడీపీతో బీజేపీ కటీఫ్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే దక్షిణాదిలో కొద్దో గొప్పో.....ఆశలున్న రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ కావడంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.....ఇక్కడ పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో తిష్ట వేసేందుకు షా వ్యూహ రచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఏపీ - తెలంగాణలలో మండల స్థాయిలో వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, స్వయంగా షా నే ఆ గ్రూపులకు అడ్మిన్ గా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ నెల 13న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆర్ ఎస్ ఎస్ - వీహెచ్ పీ నేతలతో సమావేశమైన అమిత్ షా .....రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీతో పొత్తు ఉండదని - అన్ని స్ధానాల్లోనూ ఒంటరిగానే బరిలో దిగాలని చెప్పారు. `విశిష్ట సంపర్క్ అభియాన్ `లో భాగంగా తెలంగాణలోని పలువురు రాజకీయ, సినీ - పారిశ్రామిక ప్రముఖులను షా కలిసి....పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలలో బైక్ యాత్రలు చేపట్టాలని కార్యకర్తలకు షా ఆదేశించారు. అయితే, ఇరు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ కీలక నేతల పనితీరుతో షా సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. అందుకే, బీజేపీ మండల ఇన్ చార్జ్ లతో టచ్ లో ఉండేందుకు తానే అడ్మిన్ గా ఏపీ - తెలంగాణలో వాట్సాప్ గ్రూపులను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. మండల స్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని, తద్వారా పార్టీని బలోపేతం చేయాలని షా యోచిస్తున్నారట.