టీడీపీ ఆశ‌ల‌పై నీళ్లు.. బీజేపీ నేత‌ల‌కు షా క్లారిటీ!

Update: 2021-11-15 14:06 GMT
రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఉండ‌ర‌ని అంటారు. నిన్న‌టి శ‌త్రువు రేప‌టికి మిత్రుడు కావొచ్చు.. లేదా నేటి మిత్రుడే.. రేప‌టికి శ‌త్రువు కావొచ్చు. ఇది రాజ‌కీయాల్లో కామ‌న్‌గా జ‌రిగేదే. ఇదే.. టీడీపీలో ఆశ‌ల‌ను చిగురించింది. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌ను ఢీకొట్టి అధికారంలోకిరావాలంటే.. 2014 ఎన్నిక‌ల నాటి ఫార్ములాను అవ‌లంబించాల‌ని.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు భావిస్తున్నారు. ఆ ఎన్నిక‌ల్లో.. టీడీపీ+ బీజేపీ+ జ‌న‌సేన‌లు క‌లిసి రంగంలోకి దిగి.. అధికారంలోకి వ‌చ్చాయి. బీజేపీ నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వులు కూడా ఇచ్చారు. ఇక‌, టీడీపీ ఎంపీలుకూడా కేంద్రంలో ప‌ద‌వులు పంచుకున్నారు.

కానీ, రాజ‌కీయంగా .. వైసీపీ అనుస‌రించిన వ్యూహంలో చిక్కుకున్న చంద్ర‌బాబు(అంద‌రూ అనేదే) బీజేపీ పెద్ద‌ల‌తో వైరం పెంచుకున్నారు. 2018లో కేంద్ర ప్ర‌భుత్వం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. కేంద్రంలోని పెద్ద‌ల‌పై కామెంట్లు చేశారు. ప్ర‌త్యేక హోదాపై నిల‌దీశారు. దీంతో అప్ప‌టి నుంచి బీజేపీకి .. టీడీపీకి మ‌ద్య వైరం పెరిగింది. కానీ, క్షేత్ర‌స్థాయిలో చూసుకుంటే.. టీడీపీతో పొత్తు ఉన్న‌ప్పుడు.. బీజేపీ కూడా బ‌ల‌ప‌డింది. అదేవిధంగా బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్ర‌తిసారీ.. చంద్రబాబు అధికారంలోకి వ‌చ్చారు.

కానీ, ఎప్పుడైతే.. విడిపోయారో.. అప్పుడు అధికారం కోల్పోయారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో `స‌ర్దుబాటు` చేసుకుని ముందుకు సాగాల‌ని.. అటు టీడీపీ అదినేత చంద్ర‌బాబు, ఇటు రాష్ట్ర బీజేపీ నాయ‌కులు కూడా చూస్తున్నారు.

ఇటీవ‌ల జ‌రిగిన బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో బీజేపీకి టీడీపీ కి అంత‌ర్గ‌తంగా స‌హ‌క‌రించింద‌నే కామెంట్లు వ‌చ్చాయి. అయ‌తే.. వీటిని ఏ పార్టీ కూడా ఖండించ‌లేదు. దీనిని బ‌ట్టి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి మెలిసి ముందుకు సాగుతాయ‌ని.. అంద‌రూ అనుకున్నారు. అయితే.. తాజాగా తిరుప‌తి ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అమిత్ షా.. ఈ పొత్తుపై క్లారిటీ ఇచ్చార‌ని తెలుస్తోంది.

ఎందుకంటే.. టీడీపీ అధినేత.. చంద్ర‌బాబు 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీకి బ‌ద్ధ శ‌త్రువులైన‌.. ప‌శ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్‌తోనూ.. ఢిల్లీలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్‌తోనూ.. స్నేహం చేసింది. దీనివ‌ల్ల చంద్ర‌బాబుకు వ‌చ్చిన లాభం క‌న్నా న‌ష్ట‌మే.. ఎక్కువ‌గా జ‌రిగింది. బీజేపీ పెద్ద‌లు.. చంద్ర‌బాబును పూర్తిగా ప‌క్క‌న పెట్టారు.

ఇటీవ‌ల పార్టీ కార్యాల‌యంపై దాడి జ‌రిగిన‌ప్పుడు.. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను వివ‌రించాల‌ని చంద్ర‌బాబు అమిత్‌షా అప్పాయింట్‌మెంట్ కోరారు. కానీ, ఆయ‌న ఇవ్వ‌లేదు. దీంతో టీడీపీపై వైసీపీ విమ‌ర్శ‌లు చేసింది. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే అమిత్ షా అప్పాయింట్‌మెంట్ ఇస్తార‌ని.. బాబుకు ఫోన్ చేసి మ‌రీ చెప్పిన‌ట్టు ఓ వార్త హ‌ల్చ‌ల్ చేసింది.

ఈ క్ర‌మంలో తాజాగా తిరుప‌తికి వ‌చ్చిన అమిత్ షా.. అవ‌స‌రం అనుకుంటే.. ఖ‌చ్చితంగా బాబుకు అప్పాయింట్‌మెంట్ ఇచ్చి ఉండేవారు. కానీ, ఆయ‌న మూడు రోజులు ఏపీలోనే ఉన్నా.. బాబుపేరు కూడా ఎత్తలేదు. అంతేకాదు.. బీజేపీ వ్యూహాన్ని కూడా ఆయ‌న రాష్ట్ర పార్టీ నాయ‌కుల‌కు వివ‌రించార‌ని.. తాజాగా వార్త‌లు వ‌స్తున్నాయి.

టీడీపీతో భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలనే దానిపై క్లారిటీ ఇచ్చేశార‌ని రాష్ట్ర బీజేపీ నేత‌లు గుస‌గుస‌లాడుతున్నారు. ప్రస్తుతం అధికార వైసీపీతో రాజకీయంగా రాష్ట్రంలో దూరం పాటిస్తున్న బీజేపీ.. టీడీపీ విషయంలోనూ సమానదూరం పాటించాలని తనను కలిసిన బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్ లకు అమిత్ షా చెప్పేశార‌ట‌. దీంతో బీజేపీతో మళ్లీ కలిసేందుకు టీడీపీ తాజాగా చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టినట్లయింది.

అలాగే టీడీపీ విషయంలో బీజేపీ వైఖరి మరోమారు స్పష్టమైంది. అదే సమయంలో 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఎలా సిద్ధం కావాలనే విషయంలోనూ బీజేపీ నేతలకు అమిత్ షా పలు సూచనలు చేశారని తెలిసింది. జనసేనతో కలిసి ఈ ఎన్నికలు ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచించాలని సూచించారట‌. సో.. దీనిని బ‌ట్టి.. టీడీపీ ఆశ‌ల‌పై షా .. నీళ్లు కుమ్మ‌రించార‌నేది స్ప‌ష్ట‌మైంది. మ‌రి చంద్ర‌బాబు ఎలా ముందుకు సాగుతారో చూడాలి.
Tags:    

Similar News