మాకేంటి లాభం : సీట్లపెంపునకు షా మోకాలడ్డు!

Update: 2018-02-05 12:38 GMT
‘‘లేలేలేలేలే నాకస్సలు పొలిటికల్ ఇంటెరెస్టే లే... అని మంచిగ జెప్తవ్.. బ్రెయిన్ మాత్రం ప్రెమ్మినస్టర్ లెక్క ఐడియా లేస్తుంటది.. మంచిగున్నవయ్యా నువ్వు...’’

ఈ డైలాగు గుర్తుందా? గాయం సినిమాలో తనకు సలహాలు చెబుతూ ఉండే లాయరు తనికెళ్ల భరణి గురించి కోట శ్రీనివాస రావు చెప్పే డైలాగు ఇది. ఇప్పుడు కేంద్రంలోని భాజపా నిర్ణయాలు కూడా ఈ డైలాగును తలపించే మాదిరిగానే ఉంటున్నాయి. మోడీని ఆయన పరిపాలన గురించి - నిర్ణయాల గురించి - బడ్జెట్ గురించి ఎవరు అడిగినా సరే.. రాజకీయ నిర్ణయాలు ఉండనే ఉండవని.. పరిపాలన మొత్తం పారదర్శకంగా ఉంటుందని అంటూ ఉంటారు. కానీ నిర్ణయాల వరకు వచ్చేసరికి రాజకీయగా భారతీయ జనతా పార్టీ కి లాభించని నిర్ణయం ఒక్కటి కూడా కనిపించదు.

ఇప్పుడు బడ్జెట్ సంగతే తీసుకుందాం.. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కర్నాటకకు 17వేల కోట్ల పథకాలు గట్రా ఇబ్బడి ముబ్బడిగా దోచిపెట్టినట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. చివరికి వారికి ఏమాత్రం బలం లేని.. ఆశ కూడా లేని.. తెలుగు రాష్ట్రాల విషయంలో కూడా వారు రాజకీయ ప్రయోజనం లేకుండా ఎలాంటి నిర్ణయమూ తీసుకునే ఉద్దేశం లేనట్లుగా కనిపిస్తోంది.

విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు అనేది జరగాల్సి ఉంది. ఉభయ రాష్ట్రాల సీఎంలూ దాని కోసం పదేపదే ఢిల్లీ చుట్టూ తిరిగారు. అయితే ఇటీవలి పరిణామాల్లో.. మోడీ దీనికి అంగీకరించారని.. అయితే ఏకపక్షంగా తన నిర్ణయాన్ని బయటపెట్టేయకుండా.. తుది నిర్ణయం తీసుకునే బాధ్యతను అమిత్ షా చేతుల్లో పెట్టారని వార్తలు వస్తున్నాయి. అయితే అమిత్ షా మాత్రం.. రెండు రాష్ట్రాల్లోని కమల దళపతులతో కూలంకషంగా చర్చించి.. తమ పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చునని భావించడంతో సీట్ల పెంపు వ్యవహారానికే ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా కనిపిస్తోంది.

దక్షిణాదిలో పార్టీ విస్తరణ పేరిట తెలుగురాష్ట్రాల నాయకులను పిలిపించినప్పుడు వారితో అమిత్ షా భేటీ ప్రధానంగా సీట్ల పెంపు వ్యవహారం గురించే చర్చించినట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు పెంపువల్ల రాజకీయంగా భాజపాకు ఏమీ లాభం లేదని వారు చెప్పడంతో ఆ దిశగా ఆలోచన మానుకున్నట్లు తెలుస్తోంది. అటు తెలంగాణలో గానీ - ఇటు ఏపీలో గానీ భాజపా స్వతంత్రంగా పోటీచేయాల్సి వస్తే.. ప్రస్తుతం ఉన్న సీట్లకే నికార్సయిన అభ్యర్థుల్ని వెతుక్కోవడం అసాధ్యమైన పని అని.. అలాంటి నేపథ్యంలో సీట్లను పెంచితే.. తమకే ఇబ్బంది అని స్థానిక నాయకులు చెప్పినట్లుగా తెలుస్తోంది. పైకి రాజకీయ నిర్ణయాలు ఉండవని అంటుంటారు గానీ.. అచ్చంగా రాజకీయ ప్రయోజనాలకోసమే భాజపా దళపతులు నిర్ణయాలు తీసుకునేలా ఉన్నదని పలువురు విమర్శిస్తున్నారు.
Tags:    

Similar News