మ‌హాత్మాగాంధీపై అమిత్ షా సంచ‌ల‌న కామెంట్లు

Update: 2017-06-10 10:40 GMT
ఇటీవ‌ల కాలంలో వివాదాల్లో ఇరుక్కుంటున్న బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా తాజాగా చేసిన వ్యాఖ్య మ‌రోసారి వివాదంగా మారింది.  జాతిపిత మ‌హాత్మాగాందీపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. గాంధీ ఓ తెలివైన వ్యాపారి అని ఆయన అన‌డంతో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అదే స‌మ‌యంలో ఆయ‌న ఓ విష‌యంలో త‌మ బ‌ద్ధ శ‌త్రువు సీపీఎంను ప్ర‌శంసించి అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.

మ‌హాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీలో భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను ముందే పసిగట్టారని... అందుకే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని ఆయన సూచించారని అమిత్ షా చెప్పారు.  అక్క‌డితో ఆగ‌కుండా గాంధీ మ‌హా తెలివైన వ్యాపారి అని ఆయ‌న అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి విలువలు లేవని,  ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు - సూత్రాలు లేవని చెప్పారు. కేవ‌లం స్వాతంత్ర్యాన్ని సాధించడం కోసమే ఆ పార్టీని ఏర్పాటు చేశారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అన్న‌ది ఉండ‌ద‌ని చెప్పిన అమిత్ షా దేశంలో కేవ‌లం రెండే రెండు పార్టీల్లో అంత‌ర్గ‌త స్వేచ్ఛ ఉంద‌ని చెప్పుకొచ్చారు. త‌మ పార్టీ బీజేపీలో, సీపీఎంలో మాత్రమే అంత‌ర్గ‌త స్వేచ్ఛ ఉంద‌ని.. దేశంలో ఉన్న 1650 రాజకీయ పార్టీల్లో ఇంకే పార్టీలోనూ ఇలాంటి వాతావ‌ర‌ణం లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ లో సోనియా తప్పుకుంటే ఆమె కుమారుడు అధ్యక్షుడు అవుతారని... బీజేపీలో మాత్రం ఎవరు అధ్యక్షుడు అవుతారో చెప్పలేమని అన్నారు.

కాగా బీజేపీకి బ‌ద్ధ శ‌త్రువైన సీపీఎం గురించి అమిత్ షా ఈ విష‌యంలో మంచిగా మాట్లాడ‌డం కూడా అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. అయితే... అమిత్ షా చెప్పిన‌దాంట్లో వాస్త‌వం ఉంద‌ని.. అంత‌ర్గ‌త స్వేచ్ఛ విష‌యంలో సీపీఎంను ఎవ‌రూ వేలెత్తి చూపే ప‌రిస్థితి లేద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News