గాంధీలో కులం కోణాన్ని చూపించిన షా

Update: 2017-06-11 05:39 GMT
అతి కీల‌క స్థానాల్లో ఉన్న వ్య‌క్తి ఎలా ఉండాలి? ఎలా వ్య‌వ‌హ‌రించాలి? ఎలా మాట్లాడాలి? ఏ మోతాదులో విమ‌ర్శ‌లు చేయాలి? లాంటివి కూడా చెప్పించుకునే పాడు రోజులు వ‌చ్చేశాయి. నిత్యం విలువ‌ల గురించి మాట్లాడే వ్య‌క్తులు సైతం విలువ‌ల్ని వ‌లువ‌ల్లా విడిచేస్తున్న వైనం చూసిన‌ప్పుడు రానున్న‌రోజుల్లో దేశ రాజ‌కీయాలు మ‌రెంత ద‌రిద్రంగా త‌యార‌వుతాయ‌న్న భ‌యం క‌ల‌గ‌టం ఖాయం.

మిగిలిన వారి సంగ‌తి ఎలా ఉన్నా.. జాతిపిత గాంధీ విష‌యంలో రాజ‌కీయ నేత‌లు ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంటారు. తాజాగా ఆ ల‌క్ష్మ‌ణ రేఖ‌ను దాటేశారు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా. గాంధీని ఉద్దేశించి తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లాన్ని రేపాయి. ఎప్పుడూ లేని రీతిలో జాతిపిత మ‌హాత్మ‌గాంధీకి కులాన్ని ఆపాదించిన వైనం వివాదాస్ప‌దంగా మారి సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది.

రాయ్ పూర్ లోని ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న అమిత్ షా.. జాతిపిత మ‌హాత్మ గాంధీని ఉద్దేశించి ఆయ‌న్ను అత్యంత చ‌తుర‌త ఉన్న వైశ్యుడు.. (లేదా) తెలివైన వ్యాపారిగా అభివ‌ర్ణిస్తూ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. జాతిపిత గాంధీజీని కూడా వ‌ద‌ల‌కుండా అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల్ని వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని.. క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇక్క‌డ కీల‌క‌మైన విష‌యం ఏమిటంటే జాతిపిత‌కు కులం మ‌కిలిని అంటించ‌టం. గాంధీని వైశ్యుడిగా ప‌రిమితి చేయ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది.

కాంగ్రెస్ మీద తీవ్ర‌వ్యాఖ్య‌లు చేసి.. ఆ పార్టీని బ‌ద్నాం చేసే క్ర‌మంలో గాంధీని సీన్లోకి తీసుకొచ్చిన అమిత్ షా.. నోరు జారిన‌ట్లుగా ప‌లువురు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని తీవ్రస్థాయిలో విమ‌ర్శించిన అమిత్ షా.. ఆ పార్టీని ఒక బ్రిటీష్ వ్య‌క్తి ఒక క్ల‌బ్బుగా నెల‌కొల్పార‌ని.. త‌ర్వాతి కాలంలో అదొక సంస్థ‌గా మారి స్వాతంత్య్రోద్యమంలో  పాల్గొంద‌న్నారు. వేర్వేరు సైద్ధాంతిక‌త‌లున్న వారు.. భిన్న ఆలోచ‌న‌లు ఉన్న వారంతా స్వాతంత్య్రం కోసం ప‌ని చేశార‌న్న ఆయ‌న‌.. దేశానికి స్వేచ్ఛా వాయువుల్ని బ్రిటీష్ వారు ప్ర‌సాదించిన త‌ర్వాత పార్టీని ర‌ద్దు చేయాల‌ని గాంధీజీ చెప్పిన విష‌యాన్ని గుర్తు చేశారు.

గాంధీ మాట‌ల్ని అప్పుడు నెర‌వేర్చ‌లేక‌పోయినా.. ఇప్పుడు కొంద‌రు ఆ ప‌నిని పూర్తి చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.  దేశంలో వార‌స‌త్వం లేని పార్టీలో రెండే రెండు అని.. అందులో ఒక‌టి బీజేపీ .. మ‌రొక‌టి సీపీఐగా అభివ‌ర్ణించారు.
కాంగ్రెస్ ప‌గ్గాల్ని సోనియా త‌ర్వాత రాహుల్ చేప‌డ‌తార‌న్న‌ది సుస్ప‌ష్ట‌మ‌ని.. కానీ.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా ఉన్న తన త‌ర్వాత ఎవ‌రు ప‌గ్గాలు చేప‌డ‌తారో తెలీద‌న్నారు. ఇదిలా ఉంటే.. అమిత్ షా వ్యాఖ్య‌ల‌పై ప‌లు రాజ‌కీయ‌ప‌క్షాలు తీవ్ర అభ్యంత‌రాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. షా వ్యాఖ్య‌లు జాతిపిత‌కు.. దేశ ప్ర‌జ‌ల‌కు అవ‌మాన‌క‌రంగా అభివ‌ర్ణిస్తున్నారు. కుల‌త‌త్త్వం మీద పోరాడ‌టం పోయి.. జాతిపిత‌కు సైతం కులం మ‌కిలిని అంటించిన అమిత్ షా తీరును ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు.

ఇంత త‌ప్పు చేసి కూడా అమిత్ షా మాత్రం త‌న వ్యాఖ్య‌ల్ని స‌మ‌ర్థించుకోవ‌టం గ‌మ‌నార్హం. తాను ఏ సంద‌ర్భంలో మాట్లాడిందీ స‌భ‌కు హాజ‌రైన వారికి తెలుస‌ని.. తాను త‌ప్పు మాట్లాడ‌లేద‌న్నారు. ఏ సంద‌ర్భంలో మాట్లాడినా.. జాతిపిత కులం గురించి మాట్లాడాల్సిన అవ‌స‌రం ఏంది? ఎప్పుడైతే గాంధీజీ దేశానికి జాతిపిత అయ్యారో.. ఆయ‌న 130 కోట్ల మంది భార‌తీయుల‌కు తండ్రిలాంటి వారు. అలాంటి ఆయ‌న్ను ఒక వ‌ర్గానికి కుదించ‌టం క్ష‌మించ‌లేనిది. త‌ల‌దించుకునేలా మాట్లాడిన షా.. త‌ప్పు చేయ‌లేద‌న్న‌ట్లుగా మాట్లాడుతున్న తీరు చూస్తే.. అధికారం ఆయ‌న త‌ల‌కు బాగానే ఎక్కేసింద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News