షా కొడుకుపై బ్యాంకుల ప్రేమ ఎంతో తెలుసా?

Update: 2018-08-12 04:32 GMT
నిప్పులాంటి ప్ర‌భుత్వం త‌మ‌ది. త‌మ పాల‌న‌లో త‌ప్పు అన్న‌ది జ‌ర‌గ‌లేద‌ని అదే ప‌నిగా గొప్ప‌లు చెప్పుకునే మోడీ స‌ర్కారు నిర్వాకాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ర‌ఫెల్ యుద్ధ విమానాల మీద ఆరోప‌ణ‌ల మోత ఒక కొలిక్కి రాక ముందే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కొడుకు విష‌యంలో బ్యాంకులు వ్య‌వ‌హ‌రించిన వైనం ఇప్పుడు కొత్త రాజ‌కీయ అల‌జ‌డికి తెర తీసేలా ఉంది.

అమిత్ షా కొడుకు జే షాకు చెందిన కంపెనీ కుసుమ్ ఫిన్ సెర్వ్ విలువ కేవ‌లం రూ.6 కోట్లు అయితే.. ఆ కంపెనీకి ఏకంగా రూ.97 కోట్ల మేర వివిధ బ్యాంకులు రుణాలు ఇచ్చి ఆదుకున్న వైనం ఇప్పుడు కొత్త సంచ‌ల‌నంగా మారింది. ఈ వ్య‌వ‌హారంలో వివిధ బ్యాంకులు.. స‌హ‌కార సంస్థ‌లు రుణాలు ఇచ్చిన‌ట్లుగా కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

ఈ రుణాల్ని పొంద‌టానికి జే షా త‌న తండ్రి పేరిట ఉన్న రెండు స్థ‌లాల్ని త‌న‌ఖా పెట్టార‌ని.. అందులో ఒక‌టి అహ్మ‌దాబాద్‌లో ఉన్న ఖ‌రీదైన వాణిజ్య స్త‌ల‌మ‌ని చెబుతున్నారు.

తండ్రికి చెందిన ఆస్తుల్ని బ్యాంకు ద‌గ్గ‌ర త‌న‌ఖా పెట్టారుకాబ‌ట్టి ఆ తండ్రి బాకీ ప‌డిన‌ట్లే లెక్క‌ని.. ఆ వివ‌రాల్ని అమిత్ షా త‌న ఎన్నిక‌ల అఫిడ‌విట్ లో పేర్కొన‌లేద‌న్న వాద‌న‌ను కాంగ్రెస్ తెర మీద‌కు తీసుకొచ్చింది. ఈ ఉదంతంపై తాము ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఫిర్యాదు చేస్తామ‌ని చెబుతోంది.

గుజ‌రాత్ పారిశ్రామిక అభివృద్ధి సంస్త స‌నంద్ వ‌ద్ద గ‌త ఏడాది మేలో జే షాకు రూ.6 కోట్ల విలువైన భూమిని కేటాయించింది. ఇది జ‌రిగిన నెల రోజుల్లోనే ఎలాంటి పూచీక‌త్తు లేకుండా ఆ సంస్థ‌కు రూ.17 కోట్ల రుణాన్ని ఒక ప్రైవేటు బ్యాంకు మంజూరు చేసింది. ఆ త‌ర్వాత ప‌లు కంపెనీలు రుణాలు ఇవ్వ‌టం మొద‌లెట్టాయి. ఏడాది వ్య‌వ‌ధిలోనే జే షా కంపెనీకి రుణాలు 300 శాతం పెర‌గ‌టంపై అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

నీతిగా.. నిజాయితీగా ప‌ని చేస్తామ‌ని చెప్పే మోడీ హ‌యాంలో అమిత్ షా ఆస్తులు.. ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఆస్తులు రాకెట్ స్పీడ్ తో ఎందుకు వృద్ధి చెందుతున్న‌ట్లు?  ఒక‌వేళ ఈ ఆరోప‌ణ నిజం కాకుంటే.. రూ.6 కోట్ల విలువైన స్థ‌లం.. ఎలాంటి పూచీక‌త్తు లేకుండా కోట్లాది రూపాయిల్ని బ్యాంకు రుణాలుగా ఎలా ఇస్తారు? అన్న ప్ర‌శ్న ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.
Tags:    

Similar News