కోట్లు సంపాదించిన అమిత్ షా కొడుకు 'టెంపుల్‌'!

Update: 2017-10-09 05:44 GMT
అవినీతికి దూరం త‌మ పరిపాల‌న అంటూ ప్ర‌చారం చేసుకుంటున్న భార‌తీయ జ‌న‌తాపార్టీకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఏకంగా వేల కోట్ల ఆరోప‌ణ‌ల‌ను ఆ పార్టీ ఎదుర్కోవాల్సి వ‌చ్చింది. అది కూడా చోటా మోటా నేత‌లు కాకుండా ఏకంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ త‌న‌యుడు - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా త‌న‌యుడే ఈ ఆరోప‌ణ‌ల్లో చిక్కుకున్నారు.బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా తనయుడు జయ్‌ షాకు చెందిన కంపెనీ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయంటూ వచ్చిన వార్తలు అధికార పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి. బీజేపీ అధికారంలోకి రాకముందు వరకూ జయ్‌షాకు చెందిన కంపెనీలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయని - 2014 తర్వాతే జయ్‌ షాకు చెందిన టెంపుల్ ఎంటర్‌ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టర్నోవర్ 16వేల రెట్లు పెరిగిందంటూ ది వైర్ న్యూస్‌ పోర్టల్ కథనాన్ని ప్రచురించింది. కంపెనీల రిజిస్ట్రార్‌ కు సదరు సంస్థ సమర్పించిన వివరాలను కథనంలో ప్రస్తావించింది. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమిత్‌ షా కుమారుడికి చెందిన సంస్థ అస్తులు అనూహ్యంగా పెరుగడంపై దర్యాప్తు జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఈ కథనం సత్యదూరమని బీజేపీ వాదిస్తున్నది. జయ్‌ షా సదరు మీడియా సంస్థపై రూ.100కోట్లకు పరువు నష్టం దావావేశారు.

అమిత్ షా త‌న‌యుడు జయ్‌ షా - జితేంద్ర షా ఇద్దరు డైరెక్టర్లుగా 2004లో టెంపుల్  ఎంటర్‌ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రారంభమైంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా సతీమణి సోనాల్‌ షా కూడా ఈ సంస్థలో వాటాదారు. 2013-14లో కంపెనీకి స్థిరమైన ఆస్తులేవీ లేవు. కానీ, 2014-15 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.50 వేల వరకు ఆదాయాన్ని ఆర్జించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రాగానే టెంపుల్ ఎంటర్‌ ప్రైజెస్ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి. నిల్వలు - మిగులు కలిపి 19 లక్షల నుంచి రూ 80.2కోట్లకు చేరాయి. ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఈ వృద్ధిని సాధించినట్లు సదరు సంస్థ కంపెనీల రిజిస్ట్రార్‌ కు సమర్పించిన వివరాలలో పేర్కొంది. రూ.51కోట్ల విదేశీ ఆదాయాన్ని వచ్చినట్లు కూడా చూపించింది. రాజేశ్ ఖండ్వాలాకు చెందిన కేఐఎఫ్‌ ఎస్ అనే ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.15.78కోట్లు రుణంగా తీసుకున్నట్లు చూపించింది. అయితే రాజ్యసభ సభ్యుడు - రిలయన్స్ ఇండస్త్రీస్ ఉన్నతాధికారి పరిమళ్ నత్వానీకి వియ్యంకుడే ఈ రాజేశ్ ఖండ్వాలా. కంపెనీల రిజిస్ట్రార్‌ కు సమర్పించిన వార్షిక నివేదికల్ని పరిశీలిస్తే సాధారణ కంపెనీగా ఉన్న టెంపుల్ ఎంటర్‌ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంత అసాధారణ వృద్ధిని సాధించిందో తెలుస్తుందని ది వైర్ తన కథనంలో పేర్కొంది. జయ్‌షాకు 60శాతం వాటా ఉన్న మరో సంస్థ కుసుమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంకులకు రూ.7 కోట్లు బాకీ పడి ఉన్నప్పటికీ, గుజరాత్ కోఆపరేటివ్ బ్యాంక్ రూ.25 కోట్ల లోన్‌ ను ఆ సంస్థకు మంజూరు చేసింది. ఆ కంపెనీనే తర్వాత రిన్యూవబుల్ ఎనర్జీ కంపెనీగా మార్చారు. అనంతరం విద్యుత్‌ శాఖ నుంచి రూ.10కోట్ల మేర కాంట్రాక్టులను సంపాదించినట్లు ది వైర్ న్యూస్ పోర్టల్ తన కథనంలో బయటపెట్టింది.

కాగా, తన కంపెనీపై అవాస్తవాలతో కూడిన కథనాన్ని ప్రచురించడం ద్వారా తన పరువుకు భంగం కలిగించారంటూ టెంపుల్ ఎంటర్‌ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని, అమిత్‌షా తనయుడు జయ్‌షా ది వైర్ వెబ్‌ సైట్‌ పై రూ.100 కోట్లకు దావావేశారు. తన తండ్రి అమిత్‌ షా హోదా కారణంగా కంపెనీకి లాభాలు వచ్చాయన్న అపోహలు సృష్టించేందుకే ఈ కథనం రాసినట్లుగా ఉందని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. మ‌రోవైపు జయ్‌ షాకు చెందిన సంస్థలో అక్రమాలేవీ జరుగలేదని కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దశాబ్దకాలంగా జయ్‌ షాకు రాజేశ్ ఖండ్వాలా స్టాక్‌ బ్రోకర్‌ గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. రుణాలపై టెంపుల్ ఎంటర్‌ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ తన నివేదికల్లోనే స్పష్టంచేసిందని చెప్పారు.

కాగా ఈ ప‌రిణామంపై విప‌క్షాలు ఎంట్రీ ఇచ్చాయి. అమిత్‌ షా తనయుడు జయ్‌ షాకు చెందిన సంస్థపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సమగ్ర దర్యాప్తు జరిపించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. జయ్‌షా వ్యవహారాన్ని ఆశ్రిత పెట్టుబడి వ్యవస్థగా కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ అభివర్ణించారు. ``దీనిపై ప్రధానమంత్రి ఏం చెబుతారు? దీనిపై విచారణ జరుపాల్సిందిగా సీబీఐకి మార్గనిర్దేశనం చేస్తారా? వీరిని అరెస్టు చేయమని ఈడీని ఆదేశిస్తారా?`` అని ప్రశ్నించారు. జయ్‌ షా 60శాతంవాటా కలిగిన కుసుమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ స్టాక్‌ ట్రేడింగ్‌ లో ఉన్నప్పటికీ, మధ్యప్రదేశ్‌ లో గాలిమరల విద్యుత్‌ కు సంబంధించిన కాంట్రాక్టును ఎలా పొందగలిగిందని సిబల్ ప్రశ్నించారు.

బిర్లా-సహారా డెయిరీ - జీఎస్పీసీఎల్ - వ్యాపం - లలిత్ మోదీ - బియ్యం - మైనింగ్‌ కుంభకోణాల వరుసలో ఇప్పుడు ఈ ఆరోపణలు తెరపైకి వచ్చాయని, అయినప్పటికీ ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విట్టర్లో ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానం పర్యవేక్షణలో ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని సీపీఐ నేత డీ రాజా డిమాండ్ చేశారు. క్రిమినల్ విచారణ ప్రారంభించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. రాజకీయపక్షాలపై సీబీఐని - ఎన్‌ ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్‌ ను ప్రయోగిస్తున్న బీజేపీ ఇప్పుడు తనపై వచ్చిన ఆరోపణలపై వాటితో దర్యాప్తు ఎందుకు జరిపించడం లేదని తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఓబ్రయిన్ ప్రశ్నించారు.
Tags:    

Similar News