తెలంగాణ బీజేపీ నేతలకు అమిత్‌ షా అక్షింతలు

Update: 2015-07-09 09:15 GMT
తెలంగాణ బీజేపీ నేతలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఒక రేంజిలో వేసుకున్నారట... హైదరాబాద్‌లో ఒక ఎమ్మెల్సీ సీటు గెలుచుకున్నంత మాత్రాన ఏదో బలపడినట్లు ఫీలయిపోతే ఎలా...? హైదరాబాద్‌ను మినహాయిస్తే మిగతా తెలంగాణలో పార్టీ పరిస్థితి  ఎలా ఉందో చూశారా...? అని ఫోన్‌ చేసి మరీ కీలక నేతలకు చీవాట్లు పెట్టినట్లు సమాచారం.  2019 నాటికి తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవాలని తాను అనుకుంటుంటే మీరు మాత్రం ఉన్న బలం కూడా పోగొట్టేలా ఉన్నారని ఘాటుగా అన్నట్లు తెలిసింది.

    హైదరాబాద్‌లో కూర్చుని రాజకీయం చేస్తే పార్టీ బలపడదని... ప్రజల్లోకి వెళ్లాలని.. ముఖ్య నేతలు జిల్లాల్లో తిరుగుతూ క్యాడర్‌ నిర్మాణంపై దృష్టి పెట్టాలని అమిత్‌ షా సూచించారు. అసలు ఏ కార్యాచరణా లేకపోవడం వల్లే పార్టీ దిగజారుతోందని... లేదంటే ఇన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు పార్టీ బలపడకపోవడమేమిటని ఆయన నిలదీశారట. కార్యకర్తల వ్యవస్థను బలోపేతం చేయడం లేదని... తెలంగాణలో పార్టీ క్లిక్‌ అవ్వడానికి చాలా అవకాశాలున్నా సద్వినియోగం చేసుకోవడం లేదని... తెలంగాణ నేతల చేతకానితనమే దీనికి కారణమని ఆయన అన్నట్లు సమాచారం.

    జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సమయం దగ్గరకొస్తున్న నేపథ్యంలో కీలకంగా వ్యవహరించాల్సిన బీజేపీ నాయకత్వ నిస్తేజంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. తెలంగాణలో కేసీఆర్‌ తో తలపడడానికి ఇష్టపడడం లేదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఈ పరిణామలన్నింటిపైనా పూర్తి వివరాలు తెప్పించుకున్న తరువాతే అమిత్‌షా ఇక్కడి నాయకులకు లైన్లోకి వచ్చి వార్నింగ్‌ ఇచ్చారని సమాచారం. కొద్ది నెలల్లో యాక్టివిటీ ఏమీ కనిపించకపోతే ఆయన నగరానికి వచ్చి దిశానిర్దేశం చేసే అవకాశముంది.

Tags:    

Similar News