విశాఖ మీదుగానే అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర 2.0.. ప్ర‌భుత్వం ఊరుకుంటుందా?

Update: 2022-08-29 04:26 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని కోరుతూ ఇప్ప‌టికే రాజ‌ధాని ప‌రిర‌క్ష‌ణ స‌మితి, రైతులు న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు పేరుతో ఏపీ హైకోర్టు నుంచి తిరుమ‌ల వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబ‌ర్ 12 నాటికి అమ‌రావ‌తి రాజ‌ధాని ఉద్య‌మం ప్రారంభించి 1000 రోజులు పూర్త‌వుతుండ‌టంతో మ‌రోమారు అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు పేరుతో పాద‌యాత్ర నిర్వ‌హించ‌నున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి శ్రీకాకుళం జిల్లా అర‌స‌వ‌ల్లిలోని సూర్య దేవాల‌యం వ‌ర‌కు పాద‌యాత్ర నిర్వ‌హించ‌నున్నారు.

అయితే రైతుల మొద‌టి పాద‌యాత్ర‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుమ‌తి నిరాక‌రించింది. పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డంతో రైతులు హైకోర్టును ఆశ్ర‌యించారు. హైకోర్టు పాద‌యాత్ర చేసుకోవ‌డానికి రైతుల‌కు అనుమతి ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ పోలీసులు కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల పేరుతో అడ్డంకులు సృష్టించ‌డానికే ప్ర‌య‌త్నించార‌నే రైతుల నుంచి విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు అమ‌రావ‌తి నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు పేరుతో చేప‌ట్ట‌బోయే పాద‌యాత్ర‌కు ప్ర‌భుత్వం ఏం చేయ‌నుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే రాజ‌ధాని జేఏసీ, ప‌రిర‌క్ష‌ణ స‌మితి పాద‌యాత్ర‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని డీజీపీకి ద‌ర‌ఖాస్తు చేసుకున్నాయి. 60 రోజుల‌పాటు అంటే రెండు నెల‌ల పాటు యాత్ర జ‌రుగుతుంద‌ని తెలిపాయి. సెప్టెంబ‌ర్ 12 నుంచి త‌మ పాద‌యాత్ర 2.0 కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించాయి. ఇప్ప‌టికే టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ నేత‌ల‌ను క‌లిసిన రాజ‌ధాని జేఏసీ నేత‌లు ఆయా పార్టీల మ‌ద్ధ‌తును కోరారు. ఒక్క వైఎస్సార్సీపీ త‌ప్ప అన్ని పార్టీలు ఒకే రాజ‌ధానికి క‌ట్టుబ‌డి ఉన్నాయి. రాజ‌ధాని జేఏసీకి కూడా త‌మ మ‌ద్ద‌తు ఉంటుంద‌ని హామీ ఇచ్చాయి.

అంతేకాకుండా పాద‌యాత్ర‌లో త‌మ పార్టీల నేత‌లు కూడా పాల్గొంటార‌ని టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ, క‌మ్యూనిస్టు పార్టీలు ప్ర‌క‌టించాయి. దీంతో రైతులు సంతోషంగా ఉన్నారు. మ‌రోవైపు మూడు రాజ‌ధానుల బిల్లు తెచ్చిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. హైకోర్టులో వేసిన బిల్లును ఉప‌సంహ‌రించుకుంది. అంతేకాకుండా ఈ విష‌యంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చుక్కెదురు అయ్యింది. మూడు రాజ‌ధానులు చెల్ల‌వ‌ని.. అమ‌రావ‌తే ఏపీ రాజ‌ధానిగా ఉంటుంద‌ని హైకోర్టు ఖ‌రాఖండీగా తేల్చిచెప్పింది.

అయితే కొన్ని మార్పులు చేసి మ‌ళ్లీ మూడు రాజ‌ధానుల బిల్లును శాస‌న‌స‌భ‌లో చేయ‌డానికి ప్ర‌భుత్వం కృత‌నిశ్చ‌యంతో ఉంది. స్వ‌యంగా కోర్టు నుంచే మొట్టికాయ‌లు ప‌డ్డా జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌గ్గ‌డం లేదు. సంద‌ర్భం వ‌చ్చిన ప్ర‌తిసారి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నుంచి మంత్రులు, ముఖ్య నేత‌ల వ‌ర‌కు విశాఖ‌ప‌ట్న‌మే ఏపీ కార్వ‌నిర్వాహ‌క రాజ‌ధాని చెబుతూ వ‌స్తుండ‌టం ఇందుకు నిద‌ర్శ‌నం.

హైకోర్టులో కేసు విచారణ ఉన్న సమయంలో ప్రభుత్వం అసెంబ్లీలో మూడు రాజధానులకు సంబంధించి బిల్లును ఉప సంహరించుకుంది. హైకోర్టు అమరావతిలో రాజధాని నిర్మాణాల‌ను మూడు నెల‌ల్లో పూర్తి చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల అమలుకు సమయం కోరుతూ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా.. హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన రివ్యూ కోరాలా..లేక సుప్రీంలో ఎసెఎల్పీ వేయాలా అనే అంశం పైన ప్ర‌భుత్వం ఆలోచన చేస్తుందని అడ్వొకేట్ జ‌న‌ర‌ల్ చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర 2.0 హీట్ పెంచుతోంది. త‌మ పాద‌యాత్ర‌కు పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌క‌పోతే మ‌రోమారు రైతులు హైకోర్టును ఆశ్ర‌యించే ఉద్దేశంలో ఉన్నారు. అయితే మొద‌టిసారిలాగా ప్ర‌భుత్వం అనుమ‌తి ఇవ్వ‌కుండా ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అంటున్నారు. ప్ర‌భుత్వం అనుమ‌తి నిరాక‌రిస్తే కోర్టు నుంచి రైతులు సానుకూల ఉత్త‌ర్వులు పొంద‌డానికి సిద్ధంగా ఉన్నారు.  

అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర 2.0 తుళ్లూరు మండలం వెంకటపాలెం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి ప్రారంభమవుతుంది. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వరకు యాత్ర సాగుతుంది. 60 రోజులపాటు సాగే పాదయాత్రలో ప్రతి 8 రోజులకోసారి విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించారు.

మ‌రోవైపు పాద‌యాత్ర 2.0.. గుంటూరు, కృష్ణా, ఏలూరు, రాజమండ్రి, తుని, విశాఖ, విజయనగరం మీదుగా శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి ఆలయం వరకు యాత్ర సాగనుంది. యాత్రను విజయవంతం చేసేందుకు అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మ‌రోవైపు వైఎస్సార్సీపీ ప్ర‌తిప‌క్ష నేత‌లు మూడు రాజధానులను అడ్డుకుంటున్నార‌ని.. విశాఖ అభివృద్ధి చెంద‌డం వారికి ఇష్టం లేద‌ని.. ఉత్త‌రాంధ్ర‌పై నిర్ల‌క్ష్యం చేస్తున్నార‌ని సెంటిమెంట్ రెచ్చగొడుతోంది. ఈ నేప‌థ్యంలో పాద‌యాత్ర 2.0 ఉత్త‌రాంధ్ర‌లో ప్ర‌వేశించ‌గానే ప‌రిస్థితులు ఏరూపు దాలుస్తాయ‌నేదానిపై చ‌ర్చ న‌డుస్తోంది. వైఎస్సార్సీపీ సెంటిమెంట్ రెచ్చ‌గొట్టి ప‌రిస్థితుల‌ను ఉత్త‌రాంధ్ర‌లో ఉద్రిక్తంగా మారుస్తుందేమోన‌ని అమ‌రావ‌తి జేఏసీ భ‌య‌ప‌డుతోంది.
Tags:    

Similar News