మరోసారి తెరపైకి అమరావతి.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

Update: 2022-05-05 05:29 GMT
ఏపీలో అధికారంలోకి రాగానే  అమరావతికి మంగళం పాడి మూడు రాజధానులను ప్రకటించారు. ఆ దిశగా ప్రతిపక్షాలు ఎంత వ్యతిరేకించినా.. రైతులు ఆందోళనలు చేసినా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లాడు. ఒకే రాజధాని ఉండాలంటూ టీడీపీ, అమరావతి రైతులు హైకోర్టుకు కూడా ఎక్కారు. దీంతో దీనికి బ్రేక్ పడింది.

ఏపీ హైకోర్టు మూడు రాజధానులపై విచారణ చేపట్టింది. ప్రభుత్వాన్ని ముందుకు వెళ్లకుండా విరమించుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేసింది. ఇక అమరావతి రాజధాని ఒక్కటే అంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఇప్పుడు మరోసారి రాజధాని వ్యవహారం కోర్టుకెక్కింది.

రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదని కోర్టు ధిక్కరణ పిటీషన్ ను దాఖలు చేశారు అమరావతి రైతులు. దీంతో నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. ఈ పిటీషన్ ను త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది.

అయితే రైతుల తరుఫున కోర్టు ధిక్కరణ పిటీషన్ ను న్యాయవాది ఉన్నం మురళీధర్ వేశారు. ఉద్దేశపూర్వకంగానే రాజధాని తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఈ పిటీషన్ లో రైతులు పేర్కొన్నారు. నిధులు లేవనే సాకుతో రాజధాని తీర్పు అమలు చేయడంలో జాప్యం చేస్తున్నారని రైతులు ఆరోపించారు.

దీంతో మరోసారి ఏపీ రాజధాని వ్యవహారం హైకోర్టు గడప తొక్కింది. ఇప్పటికే జగన్ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నారు. ఈసారి కోర్టుల్లో కొట్టుడుపోకుండా పకడ్బందీగా ఏపీ మూడు రాజధానుల బిల్లు తెస్తామని.. విశాఖలో ఏపీ పరిపాలన రాజధానిని తెస్తానని ప్రకటించారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే అమరావతినే రాజధాని అంటూ రైతులు హైకోర్టుకు ఎక్కడ హాట్ టాపిక్ గా మారింది.  ఒకవేళ హైకోర్టు అమరావతియే రాజధాని అని అమలు చేస్తే జగన్ సర్కార్ ఇబ్బందుల్లో పడడం ఖాయం. దీంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది.
Tags:    

Similar News