తెలిసినంతనే ఎమోషన్ అయ్యే వ్యక్తి హైదరాబాద్ కు వస్తున్నారు

Update: 2023-01-21 07:55 GMT
హైదరాబాద్ మహానగరానికి నిత్యం ఎంతోమంది వచ్చి వెళుతుంటారు. ఆ మాటకు వస్తే ప్రముఖులకు కూడా కొదవ లేదు. కానీ.. మరో రోజులో (ఆదివారం) హైదరాబాద్ కు వస్తున్న ఇద్దరి గురించి తెలిసినప్పుడు మాత్రం ఒకింత భావోద్వేగానికి గురి కావటం ఖాయం. నిజమా? అన్న ఆశ్చర్యంతో పాటు.. వారిని కలిస్తే బాగుండన్న భావన అందరికి కాకున్నా చాలామందికి కలుగుతుందని చెప్పాలి.

ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటారా? ప్రపంచ యువతను ప్రభావితం చేయటంతో పాటు.. పోరాడే గుణాన్ని పుణికిపుచ్చుకునేలా చేసే నిలువెత్తు స్ఫూర్తి.. పోరాట యోధుడు.. గెరిల్లా నాయకుడు.. క్యూబన్ విప్లవకారుడు చే గువేరా తెలుసు కదా?

ఆయన కుమార్తె.. ఆయన మనమరాలు తాజాగా హైదరాబాద్ కు వస్తున్నారు. చేగువేరా కుమార్తె డాక్టర్ అలైదా గువేరా.. మనమరాలు ప్రొఫెసర్ ఎస్తేఫానియా గువేరా ఆదివారం భాగ్యనగరానికి వస్తున్నారు. ప్రస్తుతం వారు భారతదేశంలో పర్యటిస్తున్నారు. తమ పర్యటనలో భాగంగా వారు హైదరాబాద్ కు వస్తున్నారు. రవీంద్ర భారతిలో నిర్వహించే ఒక కార్యక్రమంలో వారు పాల్గొంటారు.

అంతర్జాతీయ పరిస్థితులపై భారత ప్రజలతో మాట్లాడాలన్న కుతూహలం.. కోరిక చేగువేరా కుమార్తెకు ఉంది. అందుకే ఆమె తన కుమార్తెను వెంటపెట్టుకొని 63 ఏళ్ల వయసులో భారతదేశానికి వస్తున్నారు. వీరు జనవరి నాలుగున భారతదేశానికి వచ్చారు. ఆమెను కేరళ ప్రభుత్వం సత్కరించింది. తర్వాత వారు తమిళనాడు..కర్ణాటక.. కోల్ కతాలోని పలు సదస్సుల్లో పాల్గొన్న వారు తాజాగా హైదరాబాద్ కు వస్తున్నారు. ప్రపంచాన్ని తన పోరాటాలతో ప్రభావితం చేసిన చేగువేరా తొలిసారి భారతపర్యటనకు 1959లో వచ్చారు.

ఆయన్ను అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వయంగా స్వాగతం పలికారు. తాజాగా ఆయన కుమార్తె, మనమరాలు భారత్ లో పర్యటిస్తున్న వేళ కేంద్రంలోని మోడీ సర్కారు మాత్రమే కాదు.. తెలంగాణలోని కేసీఆర్ సర్కారు సైతం పెద్దగా పట్టించుకున్నది లేదు.

ఇక.. ఏపీలోని జగన్ సర్కారు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమైనా ఒక పోరాటయోధుడు.. ప్రపంచాన్ని తన ఆలోచనలతో ప్రభావితం చేసిన వ్యక్తి కుమార్తె.. మనమరాలు వచ్చినప్పుడు ప్రభుత్వాధినేతలు స్పందిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాంటివి మోడీ.. కేసీఆర్.. జగన్ లాంటి నేతలకు పడతాయంటారా?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News