నెల్లూరు టీడీపీలో ఆనం హ‌వా స్టార్ట్

Update: 2016-09-01 11:10 GMT
కాంగ్రెస్‌లో ఓ రేంజ్‌ లో హ‌వా కొన‌సాగించిన ఆనం బ్ర‌ద‌ర్స్ ఇప్పుడు రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో - కాంగ్రెస్ అడ్ర‌స్ లేక‌పోవ‌డంతో మారిన పొలిటిక‌ల్ సీన్ నేప‌థ్యంలో బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రూ ఇప్పుడు చంద్ర‌బాబు సైకిల్‌ పై స‌వారీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, గ‌తంలో హ‌వా చెలాయించిన నేత‌లు ఇప్పుడు సైలెంట్‌ గా ఎలా ఉంటారు చెప్పండి? అందుకే కొన్ని రోజులు లేటైనా లేటెస్ట్‌ గా మ‌ళ్లీ హ‌వా స్టార్ట్ చేసేశారు. వాస్త‌వానికి చెప్పాలంటే.. ఆనం బ్ర‌దర్స్ రామ‌నారాయ‌ణ రెడ్డి - వివేకానంద రెడ్డిల‌కు టీడీపీ కొత్త‌కాదు. అస‌లు వాళ్ల‌కి రాజ‌కీయ పాఠాలు నేర్పిన పార్టీ టీడీపీనే. గ‌తంలో ఎన్‌ టీఆర్ హ‌యాంలో పార్టీలో చేరిన రామ‌నారాయ‌ణ రెడ్డి.. కేబినెట్ మినిస్ట‌ర్‌ గా కూడా ప‌నిచేశారు. టీడీపీ నెల్లూరు జిల్లా అధ్య‌క్షుడిగా కూడా ఉన్నారు.

 అయితే, త‌ర్వాత మారిన రాజ‌కీయ‌ స‌మీక‌ర‌ణ‌ల‌తో ఆయ‌న కాంగ్రెస్‌ లోకి అడుగుపెట్టారు. అక్క‌డా మంచి మంచి ప‌ద‌వులు చేప‌ట్టి జిల్లాలో తిరుగేలేని శ‌క్తిగా చ‌క్రం తిప్పారు. ఇప్పుడు మ‌ళ్లీ.. చంద్ర‌బాబు హ‌యాంలో టీడీపీలోకి వ‌చ్చిన ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములూ.. జిల్లాలో మ‌ళ్లీ త‌మ హ‌వా సాగించేందుకు తెర‌దీశారు. అయితే. ఇప్ప‌టికే నెల్లూరులో పాతుకుపోయిన టీడీపీ నేత‌లు వీరిద్ద‌రి హ‌వాపై అనేక ఆరోప‌ణ‌లు గుప్పిస్తున్నారు. తొలుత ఇటీవ‌ల చంద్ర‌బాబును క‌లిసిన‌ప్ప‌డు నెల్లూరు జిల్లా మొత్తం కాకుండా ఆత్మ‌కూరు బాధ్య‌త‌ల‌ను తీసుకోవాల‌ని రామ‌నారాయ‌ణ‌కు చంద్ర‌బాబు సూచించార‌ట‌. దీంతో ఆయ‌న అక్క‌డ బాధ్య‌త‌లు తీసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు.

అయితే, ఇటీవ‌ల మాత్రం జిల్లా మొత్తంపై త‌మ హ‌వా సాగించేందుకు అన్న‌ద‌మ్ములు ఉబ‌లాట‌ప‌డుతున్నార‌ని టీడీపీలో అంత‌ర్గ‌తంగా టాక్ మొద‌లైంది. ఇప్పుడు ఈ వార్త పార్టీ అధినేత చంద్ర‌బాబు దృష్టికి కూడా వెళ్లింద‌ని తెలిసింది. దీంతో ఇప్ప‌టికే ప‌లు జిల్లాల్లో ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చి తెలుగుదేశంలో చేరిన నేత‌ల‌తో అక్క‌డి టీడీపీ నేత‌ల‌కు త‌ల‌నొప్పులు వ‌స్తున్న నేప‌థ్యంలో సంయ‌మ‌నం పాటించాలంటూ బాబు అంద‌రికీ సూచించిన‌ట్టే వీరికి కూడా ఆనం బ్ర‌ద‌ర్స్ నుంచి స‌ర్దుకుపోవాలంటూ సూచించే అవ‌కాశం ఉంద‌ని కొంద‌రు అంటున్నారు.

2019 ఎన్నిక‌ల‌లో తిరిగి టీడీపీ అధికారంలోకి రావాలంటే అన్ని జిల్లాల్లోనూ గ‌ట్టి ప‌ట్టున్న నేత‌లు అవ‌స‌ర‌మ‌ని, అలాంటి వారితో స‌ర్దుకు పోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చంద్ర‌బాబు చెబుతున్న‌ట్టు స‌మాచారం.  నెల్లూరు జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలుంటే... గత ఎన్నికల్లో ఏడు స్థానాల్లో వైసీపీ జెండా ఎగిరింది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ మెజారిటీ స్థానాల్లో గెలుపొందాల‌ని చంద్ర‌బాబు టార్గెట్‌ గా పెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆనం బ్ర‌ద‌ర్స్‌ కి ఆయ‌న ప‌చ్చ‌కండువా క‌ప్పారు. ఈ కార‌ణంగానే ఇప్ప‌టి వ‌ర‌కు టీడీపీలోకి వ‌చ్చికూడా మౌనంగా ఉన్న ఆనం బ్ర‌ద‌ర్స్.. ఇక త‌మ‌కు తిరుగులేద‌ని భావించి హ‌వాను మొద‌లు పెట్టార‌ని అంటున్నారు విశ్లేష‌కులు. మ‌రి రాబోయే రోజుల్లో వారి హ‌వా ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News