గ్రౌండ్ రిపోర్ట్ : 'అనంత' లో పాగా వేసేదేవరు?

Update: 2019-03-28 06:47 GMT
– వైకుంఠం వర్సెస్‌ మాజీ ఎంపీ అనంత

– వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  వైపే నగర ప్రజలు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ప్రభావం ఆరంభం నుంచి ఉన్నప్పటికీ జిల్లా కేంద్రంలో మాత్రం పూర్తిగా భిన్నం. టీడీపీ ఆవిర్భావం 1983 నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికల్లో కేవలం రెండుసార్లు (1985 - 2014) మినహా టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. అయితే గత 2014 ఎన్నికల్లో పలు నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ టికెట్‌ పొందిన వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి ఎట్టకేలకు విజయం సాధించారు. అయితే ఐదేళ్ల కాలంలో ఆయన చేసిందేమీ లేదని నగర ప్రజలు వాపోతున్నారు. అంతేకాకుండా సొంత పార్టీ నుంచి కూడా ఆయనపై భారీ వ్యతిరేకత ఉంది. ఇప్పటికే పలువురు టీడీపీకి రాజీనామా చేశారు. ఫలితంగా అనంతపురం నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిగా బరిలో దిగిన అనంత వెంకటరామిరెడ్డి గెలుపు సులువు అవుతుందని భావిస్తున్నారు. అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం ఎంపీగా సేవలు అందించారు. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. అంతేకాకుండా నగరంలో టీడీపీ బలం అంతంత మాత్రమే. ఫలితంగా 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

అనంతపురం ఎమ్మెల్యేలు

1955 – ఆంథోని రెడ్డి – కాంగ్రెస్‌
1962 – ఆంథోని రెడ్డి – కాంగ్రెస్‌
1967 – తరిమెల నాగిరెడ్డి (కమ్యూనిస్టు పార్టీ)
1972 – అనంత వెంకటరెడ్డి – కాంగ్రెస్‌
1978 – బీటీఎల్‌ ఎన్‌ చౌదరి – కాంగ్రెస్‌ (ఐ)
1983 – డి.నారాయణస్వామి – స్వతంత్య్ర
1985 – ఎన్‌.రామకృష్ణ – టీడీపీ
1989 – బి.నారాయణరెడ్డి – కాంగ్రెస్‌
1994 – కె.రామకృష్ణ – సీపీఐ
1999 – బి.నారాయణరెడ్డి – కాంగ్రెస్‌
2004 – బి.నారాయణరెడ్డి – కాంగ్రెస్‌
2009 – బి.గురునాథరెడ్డి – కాంగ్రెస్‌
2012 – బి.గురునాథరెడ్డి – వైఎస్సార్‌ సీపీ
2014 – వి.ప్రభాకర్‌ చౌదరి – టీడీపీ

టీడీపీలో వర్గపోరు.. పాలన గాలికి..

2014 ఎన్నికలు ముగిసినప్పటి నుంచి అనంతపురం నియోజకవర్గంలోని టీడీపీలో వర్గపోరు రగులుతూనే ఉంది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి ఇద్దరూ ప్రతీ అంశంలో ‘నువ్వా–నేనా’ అంటూ పోటీపడ్డారు. వీరి వైరం నియోజకవర్గ అభివృద్ధిపై పడింది. 2014కు ముందు అప్పటి ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చొరవతో మంజూరైన రైల్వే బ్రిడ్జి - మంచినీటి పైపులైన్ - వైఎస్సార్‌ మంజూరు చేసిన శిల్పారామం మినహా చెప్పుకునేందుకు ఒక అభివృద్ధి పని కూడా ఇద్దరూ చేయలేకపోయారు. చివరకు అనంతపురంలో గతుకుల రోడ్లను కూడా ఆధునికీకరించలేకపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే అధికారంలో ఉన్న 57 నెలల కాలంలో ఎవరికి వారు రాజకీయంగా - ఆర్థికంగా బలపడాలనుకోవడం మినహా నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికొదిలేశారు.

మైనార్టీలకు టిక్కెట్‌ ఇవ్వలేదని..

గత 2004లో తన సోదరుడు రహంతుల్లా టీడీపీ తరఫున పోటీ చేశారు. అయితే అప్పట్లో వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి ఓటమికి కారణమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ఓటమిని తట్టుకోలేక రహంతుల్లా ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 20 ఏళ్ల కిందట సైఫుల్లా ఎంపీగా ఉండి కార్యకర్తల కోసం పాటుపడ్డారు. దీంతో ఆ కుటుంబసభ్యులకే ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని టీడీపీ పెద్దల వద్ద వాదించారు. అయితే వైకుంఠం మరోసారి టికెట్‌ తెచ్చుకున్నారు. ఫలితంగా ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎమ్మెల్యేను ఓడించి తీరేందుకు గట్టి కంకణం కట్టుకున్నారు.

ఓ వైపు బలిజలు.. మరోవైపు జేసీ

అనంతపురం టీడీపీ అర్బన్‌ సీటును బలిజలకు కేటాయించాలని కాపునాడు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. అయితే టికెట్‌ నిరాకరించడంతో టీడీపీ హయాంలో బలిజలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ అనంత అర్బన్‌ సీటును బలిజలకు ఇస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాలని విఙ్ఞప్తి చేశారు. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు చంద్రబాబు టికెట్‌ ఇవ్వడంతో బలిజల నుంచి అసమాధానం వ్యక్తం అవుతోంది. కాగా మరో వైపు అనంతపురంలో జేసీ దివాకర్‌ రెడ్డి మాట కూడా చెల్లుబాటు కాలేదని ఆయన వర్గీయులు వాపోతున్నారు.
Tags:    

Similar News