అనంతలో తేలని పంచాయతీ..టీడీపీ పెద్ద సెట్ బ్యాక్?

Update: 2019-03-18 06:31 GMT
అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీట్ల పంచాయితీ తేలడం లేదు. గత ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది అంటే.. అందులో అనంతపురం హస్తం ఎంతో ఉంది! అలాంటి జిల్లాలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పుడు అభ్యర్థులు ఖరారు కావడం లేదు. నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యాకా కూడా.. నాలుగు నియోజకవర్గాల పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను తేల్చలేకపోతూ ఉండటం గమనార్హం.

గుంతకల్ - శింగనమల - అనంతపురం అర్బన్ - కల్యాణదుర్గం.. ఈ నాలుగు నియోజకవర్గాల విషయంలో తెలుగుదేశం పార్టీలో ప్రతిష్టంభన నెలకొని ఉంది. ఈ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. అయితే వారికి టికెట్లు ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడే అంత సానుకూలంగా లేరు!

అయితే వారికి ప్రత్యామ్నాయాలు మాత్రం తగు రీతిలో లేవు. వాళ్లను మార్చేసి వేరే వాళ్లకు అభ్యర్థిత్వాలను ఖరారు చేయాలని చంద్రబాబు కూడా అనుకుంటున్నారట. అయితే సరైన ప్రత్యామ్నాయాలు లేకపోవడంతో బాబు వారికే ప్రాధాన్యతను ఇచ్చే పరిస్థితి ఉంది.

అయితే ఆ నలుగురికి టికెట్లు ఇచ్చే విషయంలో అనంతపురం సిట్టింగ్ ఎంపీ దివాకర్ రెడ్డి తీవ్రంగా అభ్యంతరం చెబుతున్నారు. వారికి టికెట్లు ఇవ్వకూడదని - వారు పోటీ చేస్తే తన తనయుడు ఎంపీగా ఓడిపోవడం ఖాయమని దివాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ నలుగురు టీడీపీ సిట్టింగులకూ టికెట్లు ఇవ్వనే కూడదని జేసీ పట్టు పడుతూ ఉన్నారు.

అనంతపురం అర్బన్ లో వేరొక కమ్మ నేతకు - గుంతకల్ లో మధుసూదన్ గుప్తాకు - శింగనమలలో శ్రావణ శ్రీ కి టికెట్ ఇవ్వాలనేది జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్. ఈ మేరకు మార్పులు చేస్తే తన తనయుడు అనంతపురం నుంచి ఎంపీగా టీడీపీ తరఫున పోటీలో ఉంటాడు.. లేకపోతే..లేఉ అని ఇది వరకే జేసీ కుండబద్ధలు కొట్టాడు.

దీంతో ఈ వ్యవహారం మరింత సంక్లిష్టంగా మారింది. వీరిలో ఎవరిని వదులుకోవాలో, ఎవరిని అలాగే పోటీ చేయించాలో అర్థం కాని పరిస్థితి చంద్రబాబు నాయుడిది అని పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇప్పటికి అయితే ఈ సీట్ల వ్యవహారం పెండింగ్ లో ఉంది. నామినేషన్ల ప్రక్రియ మొదలైనా ఈ వ్యవహారాన్ని పెండింగ్ లో పెట్టారు చంద్రబాబు. తను చెప్పినట్టుగా వినకపోతే రాజీనామా అని జేసీ అంటున్నారట, తమకు టికెట్లు దక్కకపోతే రెబల్స్ గా రంగంలోకి దిగుతామని సిట్టింగులు అంటున్నారట.. మొత్తానికి అనంత రాజకీయం హాట్ హాట్ గా అగుపిస్తోంది!
Tags:    

Similar News