బాబును 10 ప్ర‌శ్న‌ల‌తో స‌వాలు విసిరిన బీజేపీ

Update: 2018-04-29 11:50 GMT
బాబు వ‌ర్సెస్ బీజేపీ అంత‌కంత‌కూ ముదురుతోంది. ప్ర‌త్యేక హోదా అంశంపై యూట‌ర్న్ తీసుకున్న ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బీజేపీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. నాలుగేళ్లుగా హోదా అంశంపై ప‌లు మాట‌లు మార్చిన ఆయ‌న‌.. కొద్దిరోజులుగా హోదా అంశాన్ని టేక‌ప్ చేసి బీజేపీపైనా.. మోడీపైనా తీవ్ర‌స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు.

మోడీని ఆకాశానికి ఎత్తేసిన నోటితోనే భారీగా విరుచుకుప‌డుతున్న బాబు తీరు బీజేపీ నేత‌ల‌కు ఒళ్లు మండేలా చేస్తోంది. గొంతులు స‌వ‌రించుకోవ‌టానికి కాస్త ఆల‌స్యం చేసినా.. ఇప్పుడు బాబు తీరును తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు క‌మ‌ల‌నాథులు. బాబు అవినీతిని ఎండ‌గ‌డుతూ స‌త్య‌మేవ జ‌య‌తే అంటూ తిరుప‌తిలో స‌మావేశాన్ని నిర్వ‌హించిన బీజేపీ నేత‌లు.. బాబుకు ప‌ది సూటి ప్ర‌శ్న‌లు సంధించారు.

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చినా.. బాబు మాత్రం తాత్కాలిక భ‌వ‌న‌మే క‌ట్టార‌ని.. నిధుల‌ను స‌రిగా ఉప‌యోగించ‌లేద‌న్నారు. గుంటూరులో అతిసార వ్యాధితో ప్ర‌జ‌లు మ‌ర‌ణించ‌టానికి కార‌ణంగా రాష్ట్ర నిర్ల‌క్ష్య వైఖ‌రేన‌ని దుమ్మెత్తిపోశారు.  ఈ నెల 30న తిరుప‌తిలో చంద్ర‌బాబు నిర్వ‌హించ‌నున్న స‌భ నేప‌థ్యంలో బీజేపీ నేత‌లు బాబుకు ప‌ది ప్ర‌శ్న‌లు సంధించారు. సోమ‌వారాన్ని పోల‌వ‌రంగా ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు.. ఇప్పుడా విష‌యాన్నే మ‌ర్చిపోయార‌న్నారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశాన్నితిరుప‌తిలో మోడీ ప్ర‌స్తావించారంటూ విరుచుకుప‌డుతున్న టీడీపీ అధినేత బాబు.. ఆయ‌న అనుచ‌రులు త‌ప్పుడు వాద‌న‌ను వినిపిస్తున్నారంటూ ఎమ్మెల్సీ మాధ‌వ్ మండిప‌డ్డారు. నెల్లూరు స‌భ‌లో చెప్పిన‌ట్లే తిరుప‌తి స‌భ‌లోనూ బాబు ప్ర‌త్యేక ప్యాకేజీ గురించే ప్ర‌స్తావించారే త‌ప్పించి హోదా గురించి ప్ర‌స్తావించ‌లేద‌న్నారు. మార్ఫింగ్ వీడియోలు చేసి బాబు చూపిస్తున్నార‌న్నారు.

బీజేపీ త‌ర‌ఫున తాము ప‌ది ప్ర‌శ్న‌ల్ని చంద్ర‌బాబుకు సంధిస్తున్నామ‌ని.. ఆయ‌న వాటికి స‌మాధానాలు చెప్ప‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నించారు. బీజేపీ నేత‌లు బాబుకు విసిరిన ప‌ది ప్ర‌శ్న‌లు చూస్తే..

1.పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడం నమ్మక ద్రోహమా?

2. హోదా లేని రాష్ట్రానికి ప్యాకేజీ కింద రూ.16వేల కోట్లు ఇచ్చిన మీరు తీసుకోకపోవడం నిజం కాదా?

3. రెవెన్యూ లోటులో టీడీపీ వాగ్దానాలు కలపడం నిజం కాదా?

4. హోదా తప్ప అన్నీ హామీలు కేంద్రం అమలు చేసింది నిజం కాదా?

5. డీపీఆర్‌ లేకుండా రాజధాని కోసం 1500కోట్లు ఇచ్చి మరో వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పలేదా?

6. పదేళ్ల‌లో  ఏర్పాటు చేయాల్సిన 11 విద్యా సంస్థలను నాలుగేళ్లలో ఏర్పాటు చేసింది నిజం కాదా?

7. చట్టంలో లేని విద్యా సంస్థలు, రక్షణ శాఖ ప్రాజెక్టులు ఇవ్వడం వాస్తవం కాదా?

8. రాష్ట్రంలో 24 గంట‌లు విద్యుత్‌ సరఫరా చేయడం.. పెట్రోలియం.. నౌకయాన శాఖ ప్రాజెక్టుల‌కు నిధులు ఇవ్వట‌మే నమ్మకద్రోహమా?

9. ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా గ్రాంట్లు మంజూరు చేయడం మేం చేసిన త‌ప్పా?

10. 4 స్మార్ట్‌ సీటీలు.. 33 అమృత నగరాలు ఇచ్చి మరీ అభివృద్ది చేయడం మేం చేసిన ద్రోహమా?
Tags:    

Similar News