ఆ రికార్డును ఆంధ్రప్రదేశ్ బ్రేక్ చేసింది

Update: 2016-05-20 05:56 GMT
 అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత రెండు రాష్ట్రాల్లో పాత ముఖ్యమంత్రులే మళ్లీ పీఠమెక్కనుండగా మూడు చోట్ల మాత్రం కొత్తవారు రానున్నారు. తమిళనాడు - బెంగాల్  రాష్ర్టాల్లో జయలలిత - మమత మళ్లీ ముఖ్యమంత్రులు కానున్నారు. కానీ... కేరళలో యూడీఎఫ్ స్థానంలో ఎల్డీఎఫ్ గెలవడంతో ఈసారి అచ్యుతానందన్ - విజయన్ లలో ఎవరో ఒకరు సీఎం అవుతారు. అలాగే... పాండిచ్చేరిలో రంగస్వామి స్థానంలో కొత్త ముఖ్యమంత్రి వస్తారు. అస్సాంలో తరుణ్ గొగోయ్ స్థానంలో శర్వానంద సోనోవాల్ ముఖ్యమంత్రి కానున్నారు.

అయితే... కొత్త ముఖ్యమంత్రులు వస్తున్న తరుణంలో దేశంలోని ముఖ్యమంత్రులందరినీ పరిశీలిస్తే ఒక ఆసక్తికర అంశం కనిపిస్తోంది. దేశంలో బ్రహ్మచారి పాలకులు ఎక్కువవుతున్నారు. మరీ ముఖ్యంగా బీజేపీ నుంచి ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. తాజాగా అస్సాంకు ముఖ్యమంత్రి కానున్న శర్వానంద సోనోవాల్ కూడా బ్రహ్మచారి కావడంతో మరో బ్రహ్మచారి సీఎం వస్తున్నట్లయింది.

దేశ ప్రధాని నరేంద్ర మోడీ అవివాహితుడు కాకపోయినా ప్రస్తుతం ఆయన ఒంటరి పక్షే. అదేసమయంలో తమిళనాడు, బెంగాల్ ముఖ్యమంత్రులు జయలలిత - మమతలు కూడా అవివాహితులే. మన పొరుగు రాష్ట్రం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ బ్రహ్మచారి. ఉత్తర భారత రాష్ట్రం హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా వన్ మ్యాన్ ఆర్మీయే. పెళ్లిపెటాకులు లేని ముఖ్యమంత్రే. తాజాగా ఎన్నికల్లో ఓడిపోయిన పాండిచ్చేరి సీఎం రంగస్వామి కూడా బ్రహ్మచారే. దాంతో నిన్నటి వరకు దేశంలో అయిదుగురు బ్రహ్మచారి ముఖ్యమంత్రులు ఉండేవారు. వారిలో రంగస్వామి ఓటమితో ఆ సంఖ్య నాలుగుకు పడిపోయింది.. కానీ, అస్సాంలో సోనోవాల్ ముఖ్యమంత్రి కానుండడంతో మళ్లీ టోటల్ బ్యాచిలర్ సీఎంల నంబర్ అయిదుకు చేరిపోయింది. కేరళలో అచ్యుతానందన్ - విజయన్ లు వివాహితులే కావడంతో ప్రస్తుతం పెరిగే సూచనలు కనిపించడంలేదు. అలాగే పాండీలోనూ కొత్త ముఖ్యమంత్రి ఛాన్సున్నవారెవరూ బ్రహ్మచారులు కారు. దీంతో దేశంలో బ్రహ్మాచారి సీఎంల సంఖ్య అయిదుగానే ఉండనుంది.

అయితే... ఇదంతా రాజకీయంగా ఉన్న పరిస్థితి కాగా.. భౌగోళికంగా చూస్తే బ్రహ్మచారి సీఎంలు ఉన్న రాష్ట్రాలన్నీ దాదాపుగా వరుసగా ఉన్నాయి. ఒక్క హర్యానా మాత్రం వేరుగా పైన ఉత్తర భారతదేశంలో ఉంది. కానీ.. ఇప్పుడు అస్సాంలో మొదలుపెడితే... అస్సాం, దాని దిగువన ఉన్న బెంగాల్... దాని దిగువన ఉన్న ఒడిశాల ముఖ్యమంత్రులు బ్రహ్మాచారులే. ఆ దిగువన ఉన్న ఆంధ్ర మరియు తెలంగాణా  ముఖ్యమంత్రులు మాత్రం కాదు.. మళ్లీ ఏపీ దిగువనే ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి జయ సింగిలే. ఆ లెక్కన అస్సాం నుంచి తమిళనాడు వరకు వరుస రాష్ట్రాల్లో బ్రహ్మచారి ముఖ్యమంత్రులే దాదాపుగా ఉన్నారు. మధ్యలో ఏపీ ఒక్కటి ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఏపీ మినహా తూర్పు తీరంలో బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న రాష్ట్రాలన్నీ బ్రహ్మచారుల పాలనలోనే ఉన్నాయి.  ఇది కాకతాళీయమే అయినా, ఆసక్తికరమైన అంశం.
Tags:    

Similar News