ఏపీలో 'వైఎస్సార్ నవోద‌యం '

Update: 2019-10-17 12:58 GMT
ఏపీలో అధికారంలోకి వ‌చ్చి నాలుగు నెల‌ల్లోనే వ‌రుస పెట్టి సంక్షేమ‌ - ఆర్థిక ప‌థ‌కాల‌ను ప్రారంభిస్తూ పోతోన్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘వైఎస్సార్‌ నవోదయం’ పథకాన్ని ప్రారంభించారు. సూక్ష్మ - చిన్న మధ్య తరహా పరిశ్రమలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 80 వేల యూనిట్లు ఈ ప‌థ‌కం ద్వారా ప్ర‌యోజ‌నం పొందుతాయి. ఈ పథకం కింద ఎంఎస్ ఎంఈలకు ఆర్థిక తోడ్పాటును అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ప‌థ‌కం ముఖ్య ఉద్దేశం లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఎస్ ఎంఈలను ఆదుకోవ‌డ‌మే. ఈ పథకానికి గురువారం సచివాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ - సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం - ఉన్నతాధికారులు - తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ ప‌థ‌కం విష‌యానికి వ‌స్తే ఏపీలో ఉన్న 13 జిల్లాల్లో మొత్తం 86 వేల ఎంఎస్ ఎంఈల ఖాతాలను గుర్తించారు.

రూ.4 వేల కోట్ల రుణాలను వన్‌ టైమ్‌ రీస్ట్రక్చర్‌ చేయనున్నారు. ఎన్‌ పీఏలుగా మారకుండా - ఖాతాలు స్తంభించకుండా దీని ద్వారా చర్యలు చేపట్టనున్నారు. దీంతో ఎంఎస్ ఎంఈలకు మరింత రుణంతో పాటు తక్షణ పెట్టుబడి అందే అవకాశం కలగనుంది. అవకాశాన్ని వినియోగించుకునేందుకు ఎంఎస్ ఎంఈలకు 9 నెలల వ్యవధి ఇవ్వనున్నారు. ఇక 2020 మార్చి 31లోగా ఎంఎస్ ఎంఈల రుణ ఇబ్బందులు తీర్చేలా బ్యాంకులు సిద్ధం కావాల‌ని కూడా ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రుణాలు 2019 జ‌న‌వ‌రి 1 నాటికి రు.25 కోట్ల‌కు మించి ఉండ‌కూడ‌ద‌న్న నిబంధ‌న కూడా ఉంది.
Tags:    

Similar News