అమరావతిలో ఎకరా 50లక్షలకు ఇచ్చేస్తున్న ఏపీ సర్కార్

Update: 2016-06-25 04:46 GMT
ఏపీ రాజధాని అమరావతిలో తమ కార్యకలాపాలు చేపట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయా సంస్థలు తమ కార్యకలాపాల కోసం భూముల్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. ఇలా కోరుతున్న సంస్థల్లో కొన్నింటిని ఎంపిక చేసి.. వాటికి భూములు కేటాయించే విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా తయారు చేయాలని భావిస్తున్న అమరావతిలో సంస్థలు ఏర్పాటు చేయటానికి వచ్చేందుకు వీలుగా తాజాగా కొన్ని సంస్థలకు ఏపీ సర్కారు భూముల్ని కేటాయించింది.

అయితే.. ఈ భూముల్ని ఎకరా రూ.50లక్షలకు కేటాయించటం గమనార్హం. ఇలా ఒకటో రెండో సంస్థలకు కాకుండా పలు సంస్థలకు ఎకరా రూ.50లక్షలు చొప్పున భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.  ఇండో -యూకే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కు ఎకరా రూ.50 లక్షల చొప్పున 200 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించగా.. తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా అదే ధరకు 25 ఎకరాలు ఇచ్చినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. ఇక.. సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సంస్థకు 5 ఎకరాలు.. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ కు మరో 50 ఎకరాలు.. ఏపీ హెచ్ఆర్ డీకి 25 ఎకరాల్ని కేటాయిస్తున్నారు. ఈ కేటాయింపులన్నీ ఎకరా రూ.50లక్షల చొప్పునే ఉండటం గమనార్హం.
Tags:    

Similar News