గోదావరిపై రెండో పట్టిసీమ

Update: 2015-11-07 05:20 GMT
రికార్డు సమయంలో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ఇలాంటి మరిన్ని పథ కాల్ని చేపట్టేందుకు చంద్రబాబు వెనుకాడటంలేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని గోదావరి - ఏలే రుల అనుసంధాన ప్రక్రియకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం గోదావరిపై పురుషోత్తమపట్నం వద్ద పట్టిసీమ తరహా మరో భారీ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీని నిర్మాణానికి రూ.800కోట్లు అవసరమవుతాయని ప్రాథమికంగా అంచనాలేశారు. ఏలేరు రిజర్వాయర్‌ లోని నీటిని ప్రత్తిపాడు - తుని - పిఠాపురం నియోజక వర్గాల పరిధిలోని 64వేల ఎకరాలకు సాగునీరుగా అందిస్తారు. ఇదిగాక విశాఖలోని ఉక్కుకర్మాగారంతో పాటు పలు సంస్థలకు పైప్‌ లైన్‌ ద్వారా ముడినీరును రిజర్వాయర్‌ నుంచే సరఫరా చేస్తారు.

గతంతో పోలిస్తే ఏలేరులో నీటిమట్టం తగ్గుతోంది. ఈ ప్రాంతంలో ఈ ఏడాది సగటు వర్షపాతం కంటే తక్కువ నమోదు కావడంతో రిజర్వాయర్‌ లో నీటిమట్టం పడిపోయింది. ఏలేరు ఆయ కట్టుపై ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. గత పదేళ్ళుగా ఏలేరు ఆయకట్టుపై ప్రతిఏటా వివాదాలు ముసురుకుంటూనే ఉన్నాయి. తగినంత నీరు అందుబాటులో లేదంటూ ఆయకట్టు విస్తీర్ణం అంతటికి నీటిని సరఫరా చేయలేమని ప్రభుత్వం చేతులెత్తే స్తోంది. ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే నయంగా సగం ఆయకట్టుకు నీరిస్తామంటూ నచ్చజెప్పింది. రైతులు మాత్రం మొత్తం ఆయకట్టుకు నీరివ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో కృతనిశ్చయంతో ఉన్నారు. పైగా ఆయకట్టు అంతటికి నీరివ్వని పక్షంలో విశాఖకు వెళ్తున్న నీటిని అడ్డుకుంటామని కూడా రైతులు, ప్రజాప్రతినిధులు హెచ్చరించారు. మధ్యేమార్గంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఇందులో భాగంగానే మరో పట్టిసీమ నిర్మాణానికి ప్రయత్నాలు మొదలవుతున్నాయి. ప్రస్తుతం పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకం నిర్మించిన ప్రాంతంలోనే పట్టిసీమ తరహాలో మరో ఎత్తిపోతల పథకం నిర్మిస్తారు. దీని నుంచి గోదావరి మిగులు జలాల్ని ఏలేరు రిజర్వాయర్‌ కు మళ్ళిస్తారు. ఇందుకోసం కాలువలు తవ్వుతారు. అంతవరకు పోలవరం కాలువనే వినియోగించుకుంటారు. ఇందుకోసం రూ.800కోట్లు అవుతాయని అంచనాలేయగా ముఖ్యమంత్రి కూడా ఇందుకు సానుకూలంగానే ఉన్నట్లు సమాచారం.
Tags:    

Similar News