బ‌డ్జెట్ లో ప్రాజెక్టుల కేటాయింపు గుట్టు విప్పితే?

Update: 2018-03-09 10:29 GMT
అంకెలు క‌ళ్ల‌ను మోసం చేస్తాయి. ఎందుకంటే.. అంకెల్ని త‌మ‌కు త‌గ్గ‌ట్లు అన్వ‌యం చెప్పుకొని బండి న‌డిపించే బాప‌తు రాజ‌కీయ నేత‌ల్లో క‌నిపిస్తూ ఉంటుంది. ప్ర‌భుత్వం భారీగా నిధులు కేటాయించిన‌ట్లు క‌నిపించినా.. అవ‌న్నీ ఉత్త అంకెలే త‌ప్పించి..వాస్త‌వంలో అలాంటిదేమీ లేద‌న్న విష‌యం స్ప‌ష్టం కాక మాన‌దు. తాజాగా ప్ర‌వేశ పెట్టిన ఏపీ బ‌డ్జెట్ లో సాగునీటి ప్రాజెక్టుల‌ను ప్రాధాన్య‌త క్ర‌మంలో పూర్తి చేస్తామ‌ని ప్ర‌భుత్వం చెప్పినా.. ఆచ‌ర‌ణ‌లో అదేమీ సాధ్యం కాద‌న్న విష‌యం గ‌ణాంకాల్ని జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే ఇట్టే అర్థ‌మైపోతుంది.

అంకెల గార‌డీ త‌ప్పించి ఏపీ బ‌డ్జెట్ లో ఇంకేమీ లేద‌న్న‌ది వాస్త‌వం. అదెలానంటే.. సాగునీటి ప్రాజెక్టుల‌కు ప్ర‌భుత్వం కేటాయించిన నిధుల లెక్క‌ల్ని చూస్తే అర్థ‌మ‌వుతుంది. తాజా బ‌డ్జెట్ లో సాగునీటి రంగానికి చేసిన కేటాయింపులు  రూ.16.97వేల కోట్లు. గ‌త ఏడాది బ‌డ్జెట్ కేటాయింపులతో పోలిస్తే .. 32 శాతం ఎక్కువ‌. మ‌రి.. ఇది నిజ‌మంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే.

ఎందుకంటే..ఈ  భారీ మొత్తంలో (రూ.16,978.23 కోట్లు) ఒక్క పోల‌వ‌రం ప్రాజెక్టుకు కేటాయించిన మొత్తం రూ.9994 కోట్లు. అంటే.. మొత్తం బ‌డ్జెట్ కేటాయింపులో పోల‌వ‌రం ఖాతా తీసేస్తే మిగిలేది సుమారు రూ.6వేల కోట్లు మాత్ర‌మే. ఈ ప‌రిమిత‌మైన మొత్తంతో రాష్ట్రంలోని ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తార‌న్న‌ది ప్ర‌ధాన ప్ర‌శ్న‌.

ఎన్నిక‌ల నాటికి సాగునీటి ప్రాజెక్టుల్ని యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని.. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి నాటికే అన్ని ప్రారంభాలు పూర్తి కావాల‌న్న మాట ఏపీ ముఖ్య‌మంత్రి చెబుతున్నా.. కేటాయింపులు లేని వేళ‌.. అలాంటి అవ‌కాశ‌మే లేద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ ఏడాది చివ‌రి నాటికి..  కుద‌రంటే వ‌చ్చే ఏడాది మొద‌టి రెండు నెల‌ల్లో పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న ప్రాజెక్టుల్లో గాలేరు-న‌గ‌రి.. హంద్రీనీవా.. వెలిగొండ‌.. ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతి.. తోట‌ప‌ల్లి.. వంశ‌ధార ఫేజ్ 2.. ప్రాజెక్టుల‌తో పాటు.. గోదావ‌రి.. పెన్నా అనుసంధానం.. మ‌హేంద్ర‌త‌న‌య.. గాలేరు-న‌గ‌రి రెండోద‌శ‌.. వెలిగొండ 1, 2.. వైకుంఠ‌పురం బ్యారేజ్.. స్వ‌ర్ణ‌మూఖి.. సోమ‌శిల‌.. మ‌ల్లెమ‌డుగు.. బాలాజీ రిజ‌ర్వాయ‌ర్.. వేణుగోపాల్ సాగ‌ర్‌.. తార‌క‌రామా తీర్థ‌సాగ‌రం.. హీర‌మండ‌లం ఇచ్చాపురం-సోంపేట‌.. జీడిప‌ల్లి బైర‌వానితిప్ప‌.. మూప‌ల్లి-కుప్పం.. పాలేరు.. ఉత్త‌రాంధ్ర సుజ‌ల స్ర‌వంతి.. ఆల్తూరుపాడు త‌దిత‌ర మ‌రో 25 చిన్న‌త‌ర‌మా ప్రాజెక్టులు ఉన్నాయి.
వంద రోజుల్లో 28 ప్రాజెక్టులుపూర్తి చేయాల‌న్న ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ప్ప‌టికీ ఇన్నిప్రాజెక్టులు కేవ‌లం రూ.6వేల కోట్ల‌తో ప‌నులు పూర్తి అవుతాయా? అన్న‌ది చూస్తే.. సాధ్యం కాద‌ని తేల్చి చెప్పొచ్చు.

ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు.. ప‌లుచోట్ల నిర్వాసితులకు పున‌రావాసం స‌మ‌స్య‌గా ఉంది.రాయ‌ల‌సీమను క‌రువు ర‌హితంగా చేసేందుకు ప్రాజెక్టులు ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ అందుకు త‌గ్గ‌ట్లు నిధులు కేటాయించ‌లేదు. గాలేరు-న‌గ‌రి.. హంద్రీనీవా ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌టానికి రూ.2500 కోట్లు అవ‌స‌రం. కానీ.. బ‌డ్జెట్ లో ఇందుకుకేటాయించింది కేవ‌లం రూ.521.31 కోట్లు మాత్ర‌మే. అలాంట‌ప్పుడు అనుకున్న స‌మ‌యానికి ప‌నులు పూర్తి అయ్యే అవ‌కాశం లేద‌ని చెప్పాలి. ఇదే రీతిలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల‌కు అలాంటి ప‌రిస్థితే ఉంది. కేటాయింపులు మూరెడు.. ల‌క్ష్యం బారెడుగా ఉన్న వేళ‌.. అనుకున్న‌ది అనుకున్న స‌మ‌యానికి పూర్తి కావ‌టం అసాధ్యం. ఆ విష‌యం బ‌డ్జెట్ కేటాయింపు లోతుల్లోకి వెళితే ఇట్టే అర్థ‌మ‌వుతుంది.
Tags:    

Similar News