ఇవేం స‌ర్వేలు!..అడ్డుకుంటే అరెస్టులా?

Update: 2019-01-26 11:26 GMT
నిజంగా ఈ స‌ర్వేలు వెరీ వెరీ స్సెష‌లే. ఎందుకంటే.... ఈ స‌ర్వేల‌ను అడ్డుకుంటే అరెస్టైపోవాల్సిందే. గ‌తంలో ఈ త‌ర‌హా స‌ర్వేలు జ‌రిగిన దాఖలాలు లేవు. స‌ర్వేల పేరిట జ‌నం గానీ - విప‌క్షాలు గానీ భ‌య‌ప‌డ్డ సంద‌ర్భాలూ లేవు. ఎందుకంటే... గ‌తంలో జ‌రిగిన స‌ర్వేల‌న్నీ జ‌నాల అబిప్రాయాన్ని తెలుసుకునేందుకు మాత్ర‌మే జ‌రిగేవి. అయితే ఇప్పుడు తెర మీద‌కు వ‌చ్చిన స‌ర్వేలు మాత్రం జ‌నాభిప్రాయాన్ని సేక‌రిస్తున్నామ‌నే మాట చాటున చాలానే చేసేస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేత‌ల అండ‌తోనే రంగంలోకి దిగుతున్న‌ట్లుగా ప‌క్కా ఆధారాలున్న ఈ స‌ర్వేల‌ను ఏమాత్రం అడ్డుకున్నా... నిజంగానే కేసులు న‌మోదైపోతున్నాయి. ఆ కేసులు కూడా విప‌క్షాల‌కు చెందిన నేత‌ల‌పైనేన‌న్న విష‌యాన్ని ఇక్క‌డ మ‌రిచిపోరాదు. విజ‌య‌న‌గ‌రం జిల్లాలో గ‌డ‌చిన రెండు రోజులుగా జ‌రుగుతున్న తంతును చూస్తే ఇవే విష‌యాలు మ‌న కళ్లకు క‌ట్టిన‌ట్టుగా క‌నిపిస్తున్నాయి. ఈ జిల్లాలో ఎన్నిక‌ల స‌ర్వే పేరిట రంగంలోకి దిగిన ఓ బృందం... అక్క‌డి ఓట‌ర్ల జాబితాను ఓ చేతిలో - మ‌రో చేతిలో అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం ఉన్న ట్యాబ్ తన‌దైన శైలిలో ఓట‌ర్ల‌తో పాటు విప‌క్షాల‌ను బెంబేలెత్తిస్తోంది.

ఈ స‌ర్వే ఎందుకోసం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించ‌డమే త‌రువాయి.. అక్క‌డికి పోలీసులు రంగంలోకి దిగేస్తున్నారు. ప్ర‌శ్నించిన విప‌క్షాల నేత‌ల‌ను నేరుగా పోలీస్ స్టేష‌న్ల‌కు త‌ర‌లించేసి కేసులు న‌మోదు చేసేసి... ఆన‌క స‌ర్వేను అడ్డుకుంటే క‌ట‌క‌టాల‌పాలేన‌ని బెదిరించి మ‌రీ వ‌దిలేస్తున్నార‌ట‌. ఇప్పుడు ఈ స‌ర్వేపై రాష్ట్రంలో ప్ర‌ధాన ప్ర‌తిపక్షంగా వైసీపీ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. వైసీపీకి అనుకూలంగా ఓట్ల‌ను జాబితా నుంచి తొల‌గించడ‌మ‌నే ప్ర‌ధాన ఉద్దేశ్యంతోనే ఈ స‌ర్వేలు జ‌రుగుతున్నాయ‌ని ఆ పార్టీ తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. అయినా స‌ర్వేకు వ‌చ్చే బృందాలకు జ‌నాల అభిప్రాయం (ప‌ల్స్‌) స‌రిపోతుంది క‌దా... ఓట‌ర్ల జాబితాల‌ను చేతిలో పెట్టుకుని - ట్యాబ్‌ ల‌లో వాటిని స‌రిచూసుకుంటూ.... వేలి ముద్ర‌ల కోసం జ‌నాన్ని బెంబేలెత్తిస్తుంటే... నిజంగానే ఈ స‌ర్వేల‌పై అనుమానాలు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. విజ‌య‌న‌గ‌రంలో నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణ‌మైన స‌ర్వే బృందం... టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి - ఏపీ కేబినెట్ లో కీల‌క మంత్రిగా ఉన్న నారా లోకేశ్ నియ‌మించుకున్న బృందంగా ఇప్ప‌టికే పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.

ఇదే విష‌యాన్ని వైసీపీ నేత‌లు పోలీసుల‌కు అందిస్తున్నా... పోలీసులు ఉల్టా స‌ద‌రు వైసీపీ నేత‌ల‌పైనూ కేసులు పెట్టేస్తున్న వైనం నిజంగానే ఆందోళ‌న క‌లిగించేదే. అయినా ఎన్నిక‌ల స‌మ‌యంలో స‌ర్వేలు చేస్తున్న‌ది ఈ ఒక్క టీమే కాదు క‌దా. జాతీయ స్థాయి సంస్థ‌లు కూడా స‌ర్వేలు జ‌రుపుతున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల స్పంద‌న ఇలా ఉండ‌బోతోంద‌ని ఫ‌లితాల‌ను కూడా వెల్ల‌డిస్తున్నాయి. అయితే ఈ సంస్థ‌లు జ‌రుపుతున్న స‌ర్వేల సంద‌ర్భంగా ఇప్పుడు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో చోటుచేసుకున్న‌టువంటి గొడ‌వ‌లు ఎక్క‌డా జ‌ర‌గ‌లేదు క‌దా. మ‌రి ఈ ఒక్క స‌ర్వే సంద‌ర్భంగానే జ‌నంతో పాటు విప‌క్షాలు ఆందోళ‌న‌కు దిగుతున్నాయంటే... అందులో ఏదో తేడా ఉన్న‌ద‌ని అనుమానించాల్సిందే క‌దా. అయినా స‌ర్వే చేసే సంస్థ‌లు ఓట‌రు జాబితాల‌ను చేతుల్లో ప‌ట్టుకుని బ‌య‌ట‌కు వ‌స్తున్నాయా?  ట్యాబ్ ల‌తో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయా?  లేదు క‌దా. మ‌రి నారా లోకేశ్ నియ‌మించుకున్న‌ద‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఈ స‌ర్వే బృందం ఓట‌రు జాబితా - ట్యాబ్ ల‌తో హ‌ల్ చ‌ల్ చేయ‌డం ఏమిటి? అయినా జ‌నానికి ఇష్టం లేకుండా జ‌నాన్ని భ‌య‌పెట్టి నిర్వ‌హించిన స‌ర్వేలు ఎక్క‌డైనా ఉన్నాయా? మ‌రి ఒక్క‌డే ఈ బ‌ల‌వంత‌పు స‌ర్వేలు ఎందుకు?  నిజ‌మే... ఈ స‌ర్వేపై కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప‌క్కాగానే దృష్టి సారించి తీరాల్సిందే.

Tags:    

Similar News